
రాష్ట్రంలో మూడవ విడత రేషన్ పంపిణీ మా వల్ల కాదంటూ రేషన్ డీలర్లు చేతులెత్తేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,47,24,017 రేషన్ కార్డులు ఉన్నాయి. తాజాగా మరో 70 వేళా మందికి ప్రభుత్వం కార్డులు పంపిణీ చేసింది. కరోనా నేపథ్యంలో మూడు విడతలుగా బియ్యం, కందిపప్పు కార్డుదారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి, రెండవ విడత రేషన్ పంపిణీలో కార్డుదారుల వేలిముద్రలు ఈ-పోస్ మిషన్లపై తీసుకోలేదు. వేలిముద్రలు కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మూడవ విడత రేషన్ పంపిణీలో వెలిముద్ర తప్పనిసరి చేస్తూ పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శ్రీధర్ ఆదేశాలు ఇచ్చారు.
ఒక్కో రేషన్ డిపోలో 600 నుంచి వెయ్యి వరకు కార్డులు ఉన్నాయి. వీరందరి వేలిముద్రలు ఈ-పోస్ యంత్రంపై తీసుకుంటే వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేషన్ పంపిణీ చేసి వైరస్ బారిన పడలేమని డీలర్లు అంటున్నారు. గత రెండు విడతల్లో శానిటైజర్, సోప్, మాస్కులు ప్రభుత్వం పంపిణీ చేయకపోవడాన్ని డీలర్లు తప్పుబడుతున్నారు. రేషన్ డీలర్లకు వాలంటీర్ల తరహాలో బీమా సౌకర్యం లేదని ఏ దైర్యంతో తాము రేషన్ పంపిణీ చేస్తామని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వేలిముద్రలు తీసుకుని తాము రేషన్ పంపిణీ చేయలేమని స్పష్టం చేశారు. రేషన్ డీలర్ల సంఘము అధ్యక్షుడు దివి లీలా మాధవరావు ఈ విషయాన్ని మీడియాకు వెల్లలించారు.