టాటా గ్రూప్ సామ్రాజ్యాన్ని రెండు దశాబ్దాల పాటు మకుటం లేని మహారాజు లాగా పాలించారు. అలాగని లాభాల కోసం వెంట పడలేదు. ఆస్తులను పోగేసుకోవడం కోసం తాపత్రయ పడలేదు. ప్రభుత్వం నుంచి అడ్డగోలుగా రాయితీలు పొందడానికి తాపత్రయ పడలేదు. నిఖార్సుగా వ్యాపారం చేశారు. నిజాయితీగా విస్తరించారు. లాభాలు వస్తే ఉద్యోగులకు పంచారు. నష్టాలు వస్తే ఆ వ్యాపారాన్ని మూసేశారు. అంతేతప్ప నింద ఒకరి మీద వేయలేదు. ఖ్యాతి తన జేబులో వేసుకోలేదు. విలువలను మాత్రమే పాటిస్తూ వ్యాపారాలు చేశారు. అందువల్లే ఉప్పు నుంచి విమానం దాకా రతన్ టాటా.. టాటా గ్రూప్ కార్యకలాపాలను విస్తరించారు. అనితర సాధ్యమైనంత లాభాలను అర్జించి సరికొత్త రికార్డులను సృష్టించారు. అంతటి కోవిడ్ సమయంలో 150 కోట్లను కేంద్ర ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చి.. కల్లోల సమయంలో దేశానికి తన వంతు సాయాన్ని అందించారు. అప్పుడు మాత్రమే కాదు దేశం విపత్తులో ఉన్నప్పుడు.. దేశ సమగ్రత ప్రమాదంలో ఉన్నప్పుడు.. రతన్ టాటా స్పందించారు. తన వంతుకు మించి బాధ్యతను చేపట్టారు. రతన్ టాటా అస్తమించినప్పటికీ.. ఆయన పాదుకొల్పిన విలువలు.. ఆయన సృష్టించిన బాటలు అలాగే నిలిచి ఉంటాయి..
స్నేహితుల ప్రాణాలను కాపాడారు
రతన్ టాటా వేలకోట్ల టాటా గ్రూప్ సంస్థలకు అధిపతి మాత్రమే కాదు.. స్నేహితుల ప్రాణాలను కాపాడిన ఆపద్బాంధవుడు కూడా. రతన్ టాటా గతించిన తర్వాత.. జాతీయ మీడియాలో ఓ కథనం విస్తృతమైన ప్రచారంలో ఉంది. రతన్ టాటాకు చిన్నప్పటి నుంచి విమానాలు నడపడం అంటే చాలా ఇష్టం. ఆయన తనకు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పైలట్ శిక్షణ తీసుకొని.. దానికి సంబంధించిన లైసెన్స్ పొందారు. 2007లో F-16 లో ఫాల్కన్ జెట్ నడిపారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డ్ సృష్టించారు. బోయింగ్ -787, ఎయిర్ బస్ – A380 విమానాలను నడిపి సంచలనం సృష్టించారు. అయితే రతన్ టాటా పైలట్ శిక్షణ సమయంలో.. విమానం గాల్లో ఉండగా ఒక్కసారిగా ఇంజన్ ఫెయిల్ అయింది. దీంతో అందులో ఉన్న అతని స్నేహితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయపడుతుండగా.. ఆయన అత్యంత చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. తన స్నేహితుల ప్రాణాలను కాపాడారు. ఆ తర్వాత వారితో సరదాగా ముచ్చటించారు..” నా ప్రాణమైన స్నేహితులు మీరు. మీ ప్రాణాలను నేను ఎలా ప్రమాదంలో పెడతాను? అవసరమైతే నా ప్రాణాలు పోయినా సరే.. మీ ప్రాణాలు కాపాడుతానని” వారితో రతన్ వ్యాఖ్యానించారు. దీంతో స్నేహితుడు తమపై చూపిస్తున్న ఉదారతకు వారు మురిసిపోయారు. రతన్ టాటా చేతులు పట్టుకొని కన్నీటి పర్యంతమయ్యారు.