PM CARES Fund Trustees: ప్రధానమంత్రి మోడీ విపక్షాలకు మరోసారి తనదైన శైలిలో సమాధానం చెప్పారు. కరోనా ప్రబలిన నేపథ్యంలో సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన ప్రతిపక్షాలు, పిఎం కేర్స్ ఫండ్ ను కూడా విడిచిపెట్టలేదు. దీని ద్వారా ఎంత మందికి సహాయం చేశారో చెప్పాలని అప్పట్లో రాహుల్ గాంధీ పార్లమెంటులో కడిగిపారేశారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి దీనికి సరైన సమాధానం రాలేదు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండడంతో బిజెపి నాయకులు ఏం సమాధానం చెప్పాలో తెలీక మౌనాన్ని ఆశ్రయించారు. కానీ వారి విమర్శలకు రతన్ టాటా రూపంలో మోడీ సమాధానమిచ్చారు.

ఇంతకీ ఏం చేశారంటే
రాష్ట్రాలలో సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నట్లే.. కేంద్రంలో పీఎం కేర్స్ ఫండ్ అనే ధార్మిక సంస్థ ఉంటుంది. దీనికి వివిధ సంస్థల నుంచి, వ్యక్తుల నుంచి విరాళాలు వచ్చేవి. వీటి ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇప్పటివరకు వేలాది మందికి పిఎంకేర్స్ ఫండ్ ద్వారా వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు అందాయి. కేవలం సేవా కార్యక్రమాలు కాకుండా విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు పునరావాసం, వైద్య శిబిరాల నిర్వహణ, మందుల పంపిణీ వంటి కార్యక్రమాలు కూడా జరిగాయి. ఉత్తరాఖండ్లో వరదలు సంభవించినప్పుడు పీఎం కేర్స్ ఫండ్ వెంటనే స్పందించి బాధితులకు అండగా నిలిచింది. అలాగే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి వైద్య సహాయం అందించింది.. మరిముఖ్యంగా కోవిడ్ ప్రబలినప్పుడు పేదలకు ఇతోధికంగా సేవా కార్యక్రమాలు చేపట్టింది. దీనిని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి మోడీ కీలక అడుగు వేశారు. ఇందులో భాగంగానే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రతన్ టాటా కు చోటు
పీఎంకేర్ ఫండ్స్ ట్రస్ట్ సమావేశం మోడీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఎం కేర్స్ ఫండ్ కు సహకరించిన వారికి మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఆపద పరిస్థితులలో వెంటనే ప్రతిస్పందించే దృక్పథంతో పనిచేసేందుకు పీఎంకేర్ ఫండ్ మరింత శ్రద్ధ వహిస్తుందన్నారు. కేవలం సహాయ కార్యక్రమాలు కాకుండా ఉపశమన చర్యలు సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు దోహదపడుతుందన్నారు. ఇదే సమయంలో దేశానికి కీలకమైన సమయంలో పిఎంకేర్స్ ఫండ్ పోషించిన పాత్రను, ట్రస్టీలు అనుసరించిన విధానాలను మోదీ ప్రశంసించారు. ఇది సమయంలో 4,345 మంది పిల్లలకు సహాయం అందించే పీఎంకేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ తో సహా పీఎంకేర్స్ ఫండ్ సహాయంతో చేపట్టిన కార్యక్రమాల పై ప్రజెంటేషన్ ఇచ్చారు. అత్యవసర ఆపద పరిస్థితుల్లో సమర్థవంతంగా ప్రతిస్పందించడంపై పిఎంకెర్స్ కు ప్రధాన దృష్టి ఉందన్నారు.

ఈ సందర్భంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు పీఎం కేర్స్ ఫండ్ లో కొత్తగా ట్రస్టీలను నామినేట్ చేశారు. ఈ బాధ్యతను ఆ రతన్ టాటా కు అప్పగించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్, మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా ను నియమించారు. సలహామండలి సభ్యులుగా కాగ్ మాజీ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహ్రీషి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్మన్ సుధా మూర్తి, టీచ్ ఫర్ ఇండియా సహా వ్యవస్థాపకుడు ఆనంద్ షాను నియమించారు. కొత్త ట్రస్టీలు, సలహాదారుల భాగస్వామ్యం పీఎంకేర్స్ ఫండ్ పనితీరుకు మరింత శక్తిని ఇస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రజా జీవితంలో వారి అపార అనుభవం, వివిధ ప్రజా అవసరాలకు మరింత ప్రతిస్పందించేలా చేయడంలో మరింత శక్తిని అందిస్తుందన్నారు. కాగా రతన్ టాటా నియామకంపై ఇంతవరకు ప్రతిపక్షాలు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. గతంలో ప్రతిపక్షాలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో పీఎం కేర్స్ ఫండ్ ను కాగ్ పరిధిలోకి తీసుకురావాలని మోడీ యోచిస్తున్నారు. ఇప్పటివరకు చేసిన ఖర్చులు కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
[…] […]