
Ramoji Rao: మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంలో ఏ_1 గా ఉన్న రామోజీరావు ను ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు సోమవారం విచారించిన నేపథ్యంలో పలు ప్రశ్నలు ఉత్నమవుతున్నాయి.. ఈ క్రమంలో వాటికి ఆయన సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏపీ సిఐడి అధికారులు చెప్పిన ప్రకారం… విచారణను తప్పించుకునేందుకు రామోజీరావు రకరకాల ఎత్తుగడలు వేశారని అంటున్నారు. విచారించాల్సింది తనను కాదని, కింది స్థాయి సిబ్బందినంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారని వారు చెబుతున్నారు. తన ఆరోగ్యం బాగాలేదని రామోజీరావు చెబుతున్నవి మొత్తం సాకులే అని, ఆయన వ్యక్తిగత వైద్యుడే పరోక్షంగా సమ్మతించడంతో విచారణకు అంగీకరించక తప్పలేదని సీఐడీ అధికారులు అంటున్నారు.
చిట్ ఫండ్ చట్టం, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు అక్రమాలకు పాల్పడ్డారని సిఐడి అధికారులు చెబుతున్నారు.. విచారణ ప్రక్రియ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డ్ చేశారు. కేంద్ర చిట్ ఫండ్ చట్టానికి విరుద్ధంగా భారీగా నిధులను మళ్లించినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను పూర్తిగా విస్మరించారని, డిపాజిట్లు అక్రమంగా సేకరించారని ఆధారాలతో సహా నిరూపించారు. ఇక ఈ కేసులో ఏ_2 గా ఉన్న రామోజీరావు కోడలు శైలజ ను ఈనెల 6న సీఐడీ అధికారులు విచారించనున్నారు. దర్యాప్తులో పురోగతిని సమీక్షించి రామోజీరావు, శైలజ ను ఆంధ్రప్రదేశ్ కు పిలిపించి మరోసారి విచారించాలని సీఐడీ భావిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

“బ్రాంచ్ మేనేజర్లకు 500కు మించి చెక్ పవర్ లేనప్పుడు భారీగా నిధుల బదిలీ ఎలా చేశారు? చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టడం ఎం మతవరకు కరెక్ట్? చిట్టిల చందాదారులు పాడిన మొత్తాన్ని ఇవ్వకుండా రసీదు మాత్రమే ఇస్తూ ఐదు శాతం వడ్డీ చెల్లిస్తున్నది నిజం కాదా? చందాదారులకు నగదును ఇవ్వకుండా, మార్గ దర్శి యాజమాన్యం దగ్గరే పెట్టుకోవడం డిపాజిట్ సేకరణ కాదా? చిట్ ఫండ్ కంపెనీలు డిపాజిట్ల సేకరణకు రిజర్వ్ బ్యాంక్ అనుమతించిందా?” ఈ ప్రశ్నలకు మార్గదర్శి సమాధానం చెప్పలేకపోతోంది.
వాస్తవానికి మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. పైగా మార్గదర్శి వంటి చిట్ ఫండ్ సంస్థల్లో చీటీలు వేసే వారంతా మధ్యతరగతి వారే. పైసా పైసా కూడ పెట్టి అందులో పొదుపు చేస్తే.. యాజమాన్యం మాత్రం అవసరానికి ఇవ్వడం లేదు. పైగా వడ్డీ పేరుతో చందాదారులను మభ్యపెడుతోంది.. పైగా చీటీపాడే క్రమంలోనూ రసీదు ఇస్తోంది.. ఇది రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఈ విషయాలపై సిఐడి లోతుగా తవ్వింది కాబట్టే రామోజీరావును కార్నర్ చేయగలిగింది..ఆఫ్ కోర్స్ దీని వెనక జగన్ ఉన్నాడు. రామోజీరావును ఒక ఆట ఆడుకుంటున్నాడు. తదుపరి విచారణ తర్వాత సిఐడి ఎలాంటి అడుగులు వేస్తుంది అనేది వేచి చూడాల్సి ఉంది.