తెలంగాణలో బీజేపీ బలపడేందుకు తనవంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ముందుకెళుతోంది. టీఆర్ఎస్ సర్కారుపై దూకుడుగా వెళుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అనే సంకేతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు బీజేపీలోకి ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తూ జిల్లాలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా కాంగ్రెస్ కు చెందిన ఓ మాజీ ఎంపీ బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుండటం చర్చనీయాంశంగా మారింది.
Also Read: అర్థగంటలోనే కరోనా రిజల్ట్!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. టీడీపీ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన రమేష్ రాథోడ్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు. ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. దీంతో నాటి నుంచి ఆయన కాంగ్రెస్ కార్యక్రమాలను దూరంగా ఉంటున్నారు. కేవలం సన్నిహితులతో మాత్రం టచ్లో ఉంటున్నారట. దీంతో నాటి నుంచే ఆయన కాంగ్రెస్ ను వీడుతారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా మరోసారి ఆయన కాంగ్రెస్ వీడుతారనే చర్చ నడుస్తోంది.
కాగా రమేష్ రాథోడ్ కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మంచి పట్టు ఉంది. నార్నూర్ జడ్పీటీసీ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 1999లో తొలిసారి ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2004లో అదేస్థానం నుంచి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వచ్చిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీచేసి జడ్పీ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. 2008 ఖానాపూర్ ఉప ఎన్నికల్లో ఆయన భార్య సుమన్ రాథోడ్ ను ఎమ్మెల్యేగా పోటీ చేయించి గెలిపించుకున్నారు. 2009లో ఆదిలాబాద్ ఎంపీగా విజయం సాధించి జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు.
ఇక 2014లో టీడీపీకి ప్రతికూల వాతావరణం ఎదురవడంతో ఆ ఎన్నికల్లో ఆయన ఎంపీగా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కిందటి ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే టీఆర్ఎస్ ఆయనకు సీటు కేటాయించకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ తరపున ఖానాపూర్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. నాటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన భవిష్యత్ రాజకీయ దృష్ట్యా బీజేపీలోకి వెళుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
Also Read: కేసీఆర్ తప్పులపై కాంగ్రెస్ మళ్లీ ఫెయిల్?
అయితే రాథోడ్ రాకను బీజేపీ ఎంపీ సోయం బాబురావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. సోయం బాపూరావు ఆదిమ తెగకు చెందినవాడు. రమేష్ రాథోడ్ లంబాడ తెగకు చెందినవాడు. వీరిమధ్య బీజేపీ అధిష్టానం సయోధ్య కుదిర్చి జిల్లాలో మరింత పట్టుపంచుకునేందుకు ప్రణాళికలు చేస్తోంది. బీజేపీ బలోపేతం దృష్ట్యాలో సోయం బాపూరావుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీలోకి ఆయన రాకకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే రమేష్ రాథోడ్ కమలం గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరీ దీనిపై రమేష్ రాథోడ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..!