Ram Mandir martyrs tribute: శతాబ్దాల ఆకాంక్ష తీరిన అయోధ్య రామాలయ నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులను ఆనందపరిచినా, ఆ ఉద్యమంలో ఎంతో మంది కర సేవకులు ప్రాణత్యాగం చేశారు. కొందరు ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో మరణిస్తే.. కొందరు అనారోగ్యం, చలి ప్రభావం, ఆమరణ దీక్షలో మరనించారు. కరసేవకుల గుర్తును భవిష్యత్ తరాలకు చేరవేయాలనే చారిత్రక చర్య మొదలైంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అమరుల స్మారక మ్యూజియం నిర్మించనుంది. ఇది ఉద్యమాన్ని కేవలం ఆలయ విజయంగా మాత్రమే కాకుండా, మానవ త్యాగాల చరిత్రకు వేదికగా ఉంటుంది.
రామాలయ నిర్మాణ యాత్ర..
2019 సుప్రీంకోర్టు తీర్పుతో ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. రాముడి గర్భగుడిలో బాలరాముడి విగ్రహం నుంచి ఆలయంలో జటాయువు విగ్రహం, ఇతర విగ్రహాలు అద్భుతమైన పద్ధతిలో ఏర్పాటు చేశారు. నవంబర్ 25, 2025న ఆలయ నిర్మాణం పూర్తయిందని ధర్మధ్వజం ఎగురవేశారు. ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద రాతి ఆలయాల్లో ఒకటిగా నిలిచింది. కానీ, ఈ విజయం వెనుక శతాబ్దాల పోరాటం, అనేక త్యాగాలు దాగాయి.
1990లో కర సేవకులపై కాల్పులు..
1990 అక్టోబర్ 30, నవంబర్ 2న ములాయమ్ సింగ్ యాదవ్ ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో 29 మంది కరసేవకులు ప్రాణాలు కోల్పోయారు. వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చు. కోల్‌కత్తా అన్నదమ్ములు రామ్‌కుమార్ కొఠారి (22), శరత్‌కుమార్ కొఠారి (20) లాంటి యువకులు రామాలయ ప్రాకారంపై ఆక్రమణకు వ్యతిరేకంగా నిలబడి బుల్లెట్లకు బలి అయ్యారు. బాబ్రీ మసీదు పడిపోయిన 1992 డిసెంబర్ 6న కూడా 2 వేల మంది పైగా మరణించారు. ప్రకృతి వైపరీత్యాల్లో కూడా అనేక మంది కార్మికులు పోయారు.
మ్యూజియం కోసం ట్రస్ట్ నిర్ణయం..
ట్రస్ట్ అధ్యక్షుడు నిత్యగోపాల్‌దాస్ మహారాజ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో, మరణించిన కరసేవకుల ఫొటోలు, జీవిత చరిత్రలు, ఉద్యమ ఘటనలతో సజ్జం చేసిన మ్యూజియం నిర్మించాలని తీర్మానించారు. ఆలయ నిర్మాణంలో పనిచేసిన 400 మంది కార్మికులకు ప్రత్యేక సత్కారం, ఆర్థిక సహాయం అందించేందుకు కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మ్యూజియం ఆలయ కాంప్లెక్స్ సమీపంలో ఏర్పాటు అవుతుంది.
ఈ మ్యూజియం అయోధ్య ఉద్యమాన్ని ఆలయ నిర్మాణంతో పరిమితం చేయకుండా, త్యాగాల చరిత్రగా స్థాపిస్తుంది. కరసేవకుల మరణాలు ఉద్యమానికి బలం ఇచ్చి, సుప్రీంకోర్టు తీర్పుకు దారి తీశాయి. ఇలాంటి స్మారకాలు యువతకు దేశభక్తి, త్యాగ ఆదర్శాలను నేర్పుతాయి. హిందూ సమాజంలో ఐక్యతను పెంచుతూ, జాతీయ గుర్తింపును బలోపేతం చేస్తాయని చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ట్రస్ట్ చర్య భవిష్యత్ తరాలకు ఉద్యమ గాథలను శాశ్వతం చేస్తుంది.