RajyaSabha Elections 2022 : ఇన్నాళ్లు బీహార్ కు చెందిన మహేంద్రప్రసాద్ దేశంలోని ఎంపీల్లో అత్యంత ధనవంతుడిగా ఉండేవాడు. ఆయనతోపాటు కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ.4070 కోట్లు. పార్లమెంట్ లో జనతాదళ్ (యూ) నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈయన ఒక ఫార్మా కంపెనీ ఓనర్. 2021లో మరణించారు. కానీ ఇప్పుడు మహేంద్రను ఓవర్ టేక్ చేసి మన తెలంగాణకు చెందిన పారిశ్రామికవేత్త దేశంలోని ఎంపీల్లో అత్యంత ధనవంతుడిగా నంబర్ 1 స్థానంలో నిలవబోతున్నారు.
టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు అభ్యర్థిగా బరిలోకి దిగిన హెటిరో గ్రూప్ చైర్మన్ బండి పార్థసారథి రెడ్డి దేశంలోనే అత్యంత ధనిక ఎంపీ అవతరించనున్నారు. నామినేషన్ దాఖలు సమయంలో పార్థసారథి రెడ్డి తన అఫిడవిట్ లో ఆస్తులు, అప్పుల వివరాలు అందజేశారు. ఈ వివరాల ప్రకారం.. పార్థసారథి రెడ్డి ఆస్తులు దాదాపు రూ.3909 కోట్లుగా ఉన్నాయి. ఇక ఈయన కుటుంబంతో కలిపి రూ.5300 కోట్ల ఆస్తి ఉంది. ఆయన ఆస్తిలో ఎక్కువగా ‘హెటిరో గ్రూప్’లో షేర్లు, పెట్టుబడుల రూపంలో ఉన్నాయి.
పార్థసారథి రెడ్డికి రూ.3858 కోట్ల చరాస్తులు ఉన్నాయి. ఇందులో దాదాపు రూ.3407 కోట్లు షేర్ల రూపంలో ఉన్నాయి. మిగిలిన రూ.1249 కోట్లలో దాదాపు రూ.1140 కోట్లు ఆయన భార్య ఆస్తి. రూ.105 కోట్లు హెచ్.యూఎఫ్ లో ఉన్నాయి. ఇక పార్థసారథి, ఆయన కుటుంబ ఆదాయం రూ.140 కోట్లు. ఇందులో ఎక్కువగా అద్దె డిపాజిట్ల రూపంలో దాదాపు 73 కోట్లు ఉన్నాయి. ఆయన వద్ద రూ.13 కోట్ల విలువైన, భార్య వద్ద రూ.6 కోట్లు విలువైన నగలున్నాయి.
దేశంలోనే ధనిక ఎంపీ తెలంగాణ నుంచి ఉండడం విశేషం కాగా.. రెండోస్థానంలో వైసీపీ ఎంపీ, రామ్కీ గ్రూప్ వ్యవస్థాపకుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రూ.2577 కోట్ల ఆస్తులతో అత్యంత సంపన్న ఎంపీల జాబితాలో రెండోస్థానంలో ఉన్నారు.
-బండి పార్థసారథి రెడ్డి బయోగ్రఫీ
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరులో బండి పార్థసారథి రెడ్డి జన్మించారు. ఉన్నత విద్య పూర్తి చేసి కందుకూరులో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూనే హెటిరో సంస్థను స్థాపించి దాదాపు 10వేల మందికి ఉపాధి కల్పించి ఆ సంస్థను నిలబెట్టారు. విద్యాసంస్థలు స్థాపించి విద్యావేత్తగానూ ఎదిగారు. గుప్తదాతగా పార్థసారథికి పేరుంది. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. టీఆర్ఎస్ కు ఆది నుంచి అండగా ఉన్నారు. అందుకే ఈయనకు రాజ్యసభ పదవి దక్కింది.
1997లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్.డీ పూర్తి చేసిన పార్థసారథి రెడ్డి 2021 సంవత్సరంలో హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం రూ.16000 కోట్ల నికర విలువ కలిగి ఉన్నారు. ఇక పార్థసారథిరెడ్డిపై డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ కింద నాలుగు కేసులున్నాయి.