Raju Role in AP Politics: నాటి వైభవమేదీ.. రాజులకు గడ్డుకాలం

Raju Role in AP Politics: కింకరుడే రాజగున్.. రాజే కింకరుడగున్. అది కాలానుగుణంబుగా అన్న హరిశ్చంద్ర పద్యం గుర్తుకొస్తొంది విజయనగరం జిల్లాలో రాజుల దుస్థితి తలచుకుంటే. సుదీర్ఘ రాజకీయ నేపథ్యంతో.. నిత్యం పదవులతో సరితూగే రాజులు.. ఇప్పుడు ఏ పదవులు లేకుండా ఖాళీగా ఉన్నారు. విజయనగరం సంస్థానాధీశుడు పూసపాటి అశోక్ గజపతిరాజు, కురుపాం రాజు వైరిచర్ల కిశోర్ చంద్రేదేవ్, బొబ్బిలి సంస్థానాధీశులు సుజయ్ క్రిష్ణ రంగారావు, చినమేరంగి రాజులు శత్రుచర్ల విజయరామరాజులు ఉన్నారు. ఈ నాలుగు […]

Written By: Neelambaram, Updated On : March 27, 2022 6:42 pm
Follow us on

Raju Role in AP Politics: కింకరుడే రాజగున్.. రాజే కింకరుడగున్. అది కాలానుగుణంబుగా అన్న హరిశ్చంద్ర పద్యం గుర్తుకొస్తొంది విజయనగరం జిల్లాలో రాజుల దుస్థితి తలచుకుంటే. సుదీర్ఘ రాజకీయ నేపథ్యంతో.. నిత్యం పదవులతో సరితూగే రాజులు.. ఇప్పుడు ఏ పదవులు లేకుండా ఖాళీగా ఉన్నారు. విజయనగరం సంస్థానాధీశుడు పూసపాటి అశోక్ గజపతిరాజు, కురుపాం రాజు వైరిచర్ల కిశోర్ చంద్రేదేవ్, బొబ్బిలి సంస్థానాధీశులు సుజయ్ క్రిష్ణ రంగారావు, చినమేరంగి రాజులు శత్రుచర్ల విజయరామరాజులు ఉన్నారు. ఈ నాలుగు కుటుంబాలది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. జాతీయ, ప్రాంతీయ పార్టీల్లో కీలక భూమిక వహించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉన్నత పదవులు అలంకరించారు. అటువంటి రాజులు ప్రస్తుతం రాజకీయంగా వెనుకబడ్డారు. పూర్వ వైభవానికి తహతహలాడుతున్నారు. విజయనగరం జిల్లా అంటే ముందుగా గుర్తొచ్చేది పూసపాటి రాజవంశీయులు. విజయనగరంతో పాటు ఉత్తరాంధ్రలో పురాతన దేవాలయాల వంశపారంపర్య ధర్మకర్తలుగా పూసపాటి వంశీయులే ఉన్నారు. వేలాది ఎకరాల భూములు మాన్సాస్ ట్రస్ట్ కు చెందినవే. ప్రస్తుతం కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజే మాన్సాస్ ట్రఃస్ట్ చైర్మన్ గా కొనసాగుతున్నారు.

Ashok Gajapathi Raju

అశోక్ గజపతిరాజు సుదీర్ఘ కాలం రాష్ట్ర మంత్రిగా, 2014 నుంచి 2018 వరకూ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసి ఓటమి చవిచూశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అశోక్ ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో కీలక పోర్ట్ పోలియోలు నిర్వహించారు. జిల్లా రాజకీయాలను కనుసైగల్లో శాసించారు. అన్ని నియోజకవర్గాలపై పట్టు సాధించారు. కానీ గత కొన్నేళ్లుగా రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఆయన వారసురాలిగా గత ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగిన కుమార్తె అదితి గజపతిరాజు ఓటమితో నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. దీనికితోడు వైసీపీ ప్రభుత్వం అశోక్ గజపతిరాజుపై కక్షకు దిగింది. అందుకు ఆయన అన్న కుమార్తె సంచయిత గజపతిరాజును రంగంలోకి దింపింది. సింహాచలం, రామతీర్థం ఆలయ వ్యవహారాల్లో అడుగడుగునా అవమానపరచింది. దీనికితోడు ఆయన వయోభారంతో రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నట్టు అనుచరవర్గం చెబుతోంది.

మరో రోజు బొబ్బిలి సంస్థానాధీశుడు, మాజీ మంత్రి సుజయ్ క్రిష్ణ రంగారావు కూడా రాజకీయంగా వెనకబడ్డారు. బొబ్బిలి సంస్థానానికి సుదీర్ఘ నేపథ్యం ఉంది. సుజయ్ తండి్ర రామక్రిష్ణ శ్వేతచలపతి రంగారావు బహుదూర్ ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. ఆయన అకాల మరణం తరువాత బొబ్బిలి సంస్థానాధీశులు ఎవరూ రాజకీయంగా యాక్టివ్ గా లేరు. ఈ నేపథ్యంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రొత్సహంతో 2004లో సుజయ్ క్రిష్ణ రంగారావును బొబ్బిలి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. అటు తరువాత 2009 ఎన్నికల్లో సైతం గెలుపొందారు. కానీ సామాజిక సమీకరణల్లో భాగంగా మంత్రి పదవి దక్కలేదు. బొత్స సత్యనారాయణ రాజకీయ ఎదుగుదలకు అడుగడుగునా అడ్డుకున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికైన సుజయ్ చంద్రబాబు ఆహ్వానం మేరకు టీడీపీలో చేరారు. దీంతో ఆయనకు చంద్రబాబు కేబినెట్లో చోటు కల్పించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆయన ఓడిపోయారు. అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన నియోజకవర్గం పర్యటిస్తున్న దాఖలాలు తక్కువ. ఆయన సోదరుడు, మునిసిపల్ మాజీ చైర్మన్ బేబీ నయన అన్నీ తానై చక్కదిద్దుతున్నారు. స్థానికి సంస్థల ఎన్నికల్లో టీడీపీ సత్తా చూపారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బేబీనాయన బరిలో దిగుతారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కురుపాం రాజు వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. ఐదు సార్లు ఎంపీగా ఆయన గెలుపొందారు. ఒకసారి రాజ్యసభకు ఎంపికయ్యారు. 1977లో ఎంపీగా ఎన్నికైన కిశోర్ స్టీల్, మైనింగ్ శాఖ మంత్రిగా పదవి చేపట్టారు. పార్లమెంట్లో స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా కీలకంగా వ్యవహరించారు. జాతీయ కాంగ్రెస్ పార్టీకి కీలకమైన సీడబ్ల్యూసీ లో సభ్యుడిగా కూడా కొనసాగారు. 2009,2014 మధ్య గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగారు. కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేకతను మూటగట్టుకొంది. ఈ పరిస్థితుల్లో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అరకు లోక్ సభ స్థానం నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు. అటు తరువాత 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. అరకు లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీచేశారు. కానీ విజయం మాత్రం దక్కలేదు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నా.. అంతగా యాక్టివ్ గా లేరు.

Pamula Pushpa Sreevani

చినమేరంగి రాజవంశీయులు శత్రుచర్ల వారిది వింత పరిస్థితి. ప్రస్తుతం ఆ కుటుంబానికి చెందిన పాముల పుష్న శ్రీవాణి డిప్యూటీ సీఎంతో పాటు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సోదరుడు చంద్రశేఖర్ రాజుకు స్వయాన కోడలు. అయితే ఆ కుటుంబంలో రాజకీయ విభేదాలున్నాయి. శత్రుచర్ల విజయరామరాజు ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులు చేపట్టారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 9, 10, 12వ లోక్ సభల్లో ఎంపీగా ఉన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. 2009 ఎన్నికల్లో రిజర్వేషన్ అడ్డంకిగా మారడంతో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి పోటీచేసి గెలుపొందారు. అటవీ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. అదే పాతపట్నం నుంచి మరోసారి బరిలో దిగారు. కానీ ఓటమి చవిచూశారు. దీంతో చంద్రబాబు ఆయనను ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. ప్రస్తుతం వయోభారంతో చినమేరంగి కోటకే పరిమితమయ్యారు. కోడలు పుష్ప శ్రీవాణి, కుమారుడు పరిక్షిత్ రాజు వైసీపీలో కొనసాగుతుండగా.. చంద్రశేఖర్ రాజు ప్రస్తుతం అన్న గూటిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కోడలిపై కుమార్తె పవిత్రను దించే యోచనలో ఉన్నారు.

Tags