Rajinikanth Vs YCP Leaders: తనపై జరుగుతున్న మాటల దాడిపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. వైసీపీ నేతల ప్రవర్తన గురించి ఆరాతీశారు. అటు అభిమానులను సైతం నియంత్రిస్తున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో రజనీకాంత్ పాల్గొన్నారు. చంద్రబాబునుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై వైసీపీ నేతలు అభ్యంతరాలు తెలిపారు. రజనీకాంత్ ను టార్గెట్ చేసుకొని తిట్ల దండకానికి పూనుకున్నారు. ఆయన ఆరోగ్యంతో పాటు కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని అయితే రజనీ శరీర ఆకృతి గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. దీనిపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ఈ మంట ఎగబాకి అభిమానులకు తాకింది. దీంతో రజనీ స్పందించాల్సి వచ్చింది. స్నేహితుడు చంద్రబాబుకు ఫోన్ చేసి ఆరాతీసినట్టు తెలుస్తోంది.
వైసీపీ ప్రస్తావన తేకున్నా..
వాస్తవానికి రజనీకాంత్ వైసీపీ ప్రభుత్వంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కేవలం తన స్నేహితుడు చంద్రబాబు విజనరీ ఉన్న నాయకుడుగా మాత్రమే చెప్పుకొచ్చారు. అభివృద్ధి చేసి చూపించారని కొనియాడారు. అయితే రాజుగారి మొదటి భార్య బాగుందంటే.. రెండో భార్య బాగులేని చందంగా రజనీకాంత్ వ్యాఖ్యలకు వక్రభాష్యాలు చెబుతూ వైసీపీ నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. బూతులు మాట్లాడుతున్నారు. దీనిపై చంద్రబాబు స్పందించారు. వైసీపీ నేతలు శృతిమించి మాట్లాడుతుండడం దారుణమని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. అయితే వివాదం మరింత ముదరడంతో రజనీకాంత్ నేరుగా స్పందించారు. చంద్రబాబుకు ఫోన్ చేశారు. చంద్రబాబు ఇక్కడ పరిస్థితిని వివరించారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరుకావడం చాలా ఆనందంగా ఉందన్నారు. తన వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని తేల్చేశారు. దీనిపై స్పందిచనని కూడా చెప్పేశారు.
ఈ తరహా విమర్శలకు దూరం..
సహజంగా రాజకీయాల్లో ప్రత్యర్థుల విమర్శలకు బదులిచ్చే క్రమంలో ప్రతివిమర్శలు చేస్తారు. ఇతర రంగాల ప్రముఖులు, సెలబ్రిటీలు తమకు నచ్చిన నాయకుడికి ఫేవర్ గా మాట్లాడితే ఎదుటి పక్షం అస్సలు మాట్లాడదు. ఒక వేళ తమపై నేరుగా కానీ విమర్శకు దిగితే మాత్రం స్పందిస్తారు. అటు చాలా సందర్భాల్లో వైసీపీ, టీడీపీల మధ్య దీనిపైనే వివాదం నడిచింది. జగన్ ను పొగడ్తలతో ముంచెత్తుకోండి.. కానీ తమ నేతపై విమర్శలకు దిగకండి అంటూ టీడీపీ చాలాసార్లు సూచించింది. కానీ వైసీపీ పెడచెవిన పెట్టింది. ఇప్పుడు రజనీకాంత్ విషయంలో అదే తప్పు చేస్తోంది. ఆయన జగన్ పై విమర్శలు చేస్తే స్పందించాలి. కానీ చంద్రబాబును పొగిడితే వీరికి వచ్చిన తంటా ఏమిటని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు.
దేశవ్యాప్తంగా చర్చ..
ఈ విషయంలో జగన్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ పెరుగుతోంది.సోషల్ మీడియాలో ఉద్దృతంగా సాగుతోంది. ఒక్క తమిళ్ నుంచే కాదు..తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా ఈ డిమాండ్ వినిపిస్తోంది. జగన్ అనే పేరు కూడా రజనీ ఎత్తలేదు. తన మిత్రుడ్ని పొగిడారు. అదేదో మహా పాతకం అయినట్లు రజనీకాంత్ ను అత్యంత దారుణంగా దుర్బాషలు ఆడుతున్నారు వైసీపీ నేతలు. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇదేం సైకో రాజకీయమన్న ప్రశ్న ప్రతీ చోటా వస్తోంది. అందుకే జగన్ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి వైసీపీ ముగింపు పలకకపోతే మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.