Homeజాతీయ వార్తలుకాంగ్రెస్‌ను సింగిల్ చాయిస్ గా మార్చే రాహుల్ ప్లాన్

కాంగ్రెస్‌ను సింగిల్ చాయిస్ గా మార్చే రాహుల్ ప్లాన్

Rahul
రాహుల్‌ వ్యవహార శైలిని బట్టి చూస్తుంటే ఆయనకు రాజకీయాలంటే అంతగా ఆసక్తి లేనట్లుగా అర్థం చేసుకోవాల్సి వస్తోంది. అందుకే పార్టీని పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంత ఏజ్‌లోనూ తన తల్లి సోనియా గాంధీనే పార్టీని నడిపించాల్సి రావడం రాహుల్‌ నిరాసక్తతే కారణంగా తెలుస్తోంది. కానీ.. అధినాయకత్వం మాత్రం రాహుల్‌ నాయకత్వాన్ని కోరుకుంటోంది. అయితే.. అధ్యక్ష పీఠం ఎప్పుడంటే అప్పుడు ఎక్కేయొచ్చని రాహుల్‌ అభిప్రాయం. కానీ.. రాహుల్‌ టార్గెట్‌ వేరేదిగా కనిపిస్తోంది. తాను ఏదో లక్ష్యాన్ని విధించుకొని.. అది సాధించాకనే అధ్యక్ష పీఠం ఎక్కాలన్న కాన్సెప్ట్‌లో ఉన్నారని సమాచారం.

యువతరం కాంగ్రెస్‌ పార్టీ విధానాల పట్ల ఆసక్తి చూపడం లేదు. మైనారిటీల పట్ల సానుకూల దృక్పథం ఉంటుందనే ముద్ర పార్టీపై బలంగా పడిపోయింది. మత విశ్వాసం ఎక్కువగా ఉండే హిందువులు పార్టీకి దూరం అయ్యారు. ఇంతవరకూ అండగా ఉన్న ముస్లింలు, దళితులు విభిన్న పార్టీలను ఎంచుకున్నారు. ఫలితంగా రెంటికీ చెడ్డ రేవడిలా మారింది కాంగ్రెస్‌ దుస్థితి. అటు మెజార్టీ హిందువుల ఓట్లను చేజార్చుకుని, ఇటు ముస్లిం, దళిత్ కాంబినేషన్ కూడా ఆదరించక అన్యాయమైపోయింది. వీటి నుంచి బయటపడేందుకు.. మతాలు, కులాలకు అతీతంగా యువతతో కనెక్టు కావాలనేది రాహుల్ ప్రస్తుత ప్రయత్నమని చెబుతున్నారు కాంగ్రెస్‌ వర్గీయులు.

మత పరమైన అంశాలను మినహాయిస్తే పాలనపరమైన అజెండాలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పెద్ద తేడాలు లేవు. సంస్కరణలు, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణల అంశంలో రెండూ పార్టీలది ఒకటే ధోరణి. కాంగ్రెస్‌ కొంచెం మందకొడిగా ఆచరణలోకి తెస్తుంది. బీజేపీ వేగంగా చేస్తుంది. అదే వీటి మధ్య తేడా. కానీ.. కాంగ్రెస్‌ ఒక సంస్కరణను ప్రవేశపెడితే నెగిటివ్ ప్రచారంతో దేశంలో గందరగోళం చెలరేగుతోంది. అదే బీజేపీ అమలు చేస్తే కరిష్మాటిక్ లీడర్‌‌ షిప్ కారణంగా పాజిటివ్ వేవ్ తయారవుతోంది. దీనికి మతపరమైన అభిమానాలూ కారణమవుతున్నాయి. మరో విడత ఎన్నికల వరకూ బీజేపీ సంకీర్ణాన్ని కూలదోసి హస్తం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు.

2024లోనూ ఏదో రకంగా ఎన్డీఏ గట్టెక్కుతుందని కాంగ్రెస్‌ నేతలే అంతర్గతంగా ఒప్పుకుంటున్నారు. ఆర్థిక వ్యవహారాలు, ప్రాంతీయ పార్టీల అనుచిత డిమాండ్ల నేపథ్యంలో దేశం క్లిష్టమైన పరిస్థితుల్లోనే ఉంది. ఈ దశలో మోడీ వంటి మొండి నాయకుడే అవసరం. తాను చేయాల్సిందంతా చేసి పారేస్తారు. ఆ క్రమంలో ప్రజావ్యతిరేకత వస్తుందనుకున్నా లెక్క చేయడం లేదు. కానీ.. కాంగ్రెస్‌ దేశానికి అవసరమైన అజెండాను ప్రజావ్యతిరేకంగా ఆచరణలోకి తేవడం కష్టమని సీనియర్ నేతలు చెబుతున్నారు. ఆ పనేదో మోడీనే చేస్తారనుకుంటున్నారు. తర్వాత ఒకే దేశం ఒకే విధానం అన్నరీతిలో సుక్షేత్రం తయారవుతుంది. స్వాతంత్ర్యం అనంతరం తొలినాళ్లలో కాంగ్రెస్‌కు లభించిన అవకాశం అదే. మళ్లీ ఆ తరహా వ్యవస్థకు అనువైన వాతావరణం మోడీ కల్పిస్తారని భావిస్తున్నారు.

మోడీ తర్వాత బీజేపీకి పెద్ద నాయకులెవరూ కనిపించడం లేదు. అమిత్ షాకు ప్రజల్లో అంతటి ఆదరణ లేదు. మోడీ ఛాయగా మాత్రమే ఆయనకు ఇమేజ్ ఉంది. అందుకే పార్టీ ఆయన మాట వింటోంది. ఒక్కసారి మోడీ రంగంలోంచి తప్పుకుంటే షా నామమాత్రమే అయ్యారు. మోడీ సృష్టించిన నాయకత్వ శూన్యత పార్టీని ఒకటి రెండు దశాబ్దాలు ఉండే అవకాశాలూ లేకపోలేదు. అందుకే.. యువతరం ద్వారానే కాంగ్రెస్‌కు భవిష్యత్‌ అని రాహుల్‌ ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే.. వయసులో పెద్దవాడైన మోడీ యువతను ఆకట్టుకోగలుగుతున్నారు. కానీ.. రాహుల్‌ ఎందుకో ఆ విషయంలో సక్సెస్‌ కాలేకపోతున్నారు. దానిని భర్తీ చేసుకునేందుకు యువతతో కలిసిపోయే చర్యలను ఇటీవల మరింతగా పెంచేశారు రాహుల్.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular