Rahul Gandhi- Congress President Election: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ(ఏఐసీసీ)కి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అక్టోబర్ లో ఎన్నిక నిర్వహించాలని చూస్తోంది. ఇందుకు గాను కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. దీంతో నేతల్లో పోటీ నెలకొంటోంది. ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు మరింత మంది కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లాత్ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంకా సీనియర్ నేత శశిథరూర్ కూడా పోటీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కూడా ఆ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో అధ్యక్ష పదవి కోసం ఇంకా కొంతమంది తెర మీదకు రానున్నట్లు చెబుతున్నారు. దాదాపు పది రాష్ట్రాల నుంచి సీనియర్ నేత రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి చేపట్టాలని తీర్మానం చేసిన సందర్భంలో పార్టీలో ఇంకా ఏం మార్పులు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు.
మొత్తానికి గాంధీయేతర సభ్యులే అధ్యక్షులు కావాలనే ఉద్దేశంతో ఉన్నందున నేతల్లో పోటీ అనివార్యమవుతోంది. మరోవైపు అధ్యక్ష ఎన్నిక సమయంలో రాహుల్ గాంధీ జోడో యాత్రలో ఉండనున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఆశించే వారి సంఖ్య కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశముంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 8 తేదీగా నిర్ణయించారు. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే అక్టోబర్ 17న ఎన్నిక నిర్వహించి 19న ఫలితాలు ప్రకటిస్తారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మునిగిపోయే నావ మాదిరి ఉంది. దీంతో పార్టీని గట్టెక్కించే సత్తా గల వారికే ఆ పదవి అప్పజెప్పేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే శక్తి ఉన్న వారికే బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏఐసీసీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. సుదీర్ఘ కాలం అధ్యక్ష బాధ్యతలు పోషించిన సోనియా గాంధీకి ఆరోగ్యం సహకరించడం లేకపోవడంతో ఆమె ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు రాహుల్ గాంధీనే అధ్యక్షుడిగా కొనసాగాలని డిమాండ్లు వస్తున్నా ఆయన మాత్రం అందుకు ససేమిరా అంటున్నట్లు చెబుతున్నారు. దీంతో రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా అయ్యేందుకు సిద్ధంగా లేరని వార్తలు వస్తున్నాయి.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి డోలాయమానంలో పడిపోతోంది. దీంతో మునిగిపోయే నావను ఒడ్డుకు చేర్చే నేత కోసం పార్టీ ఎదురు చూస్తోంది. పార్టీలో జవసత్వాలు నింపి ఒడ్డున పడేసే నేత కావాలని ఆశిస్తున్నారు. అధ్యక్ష పదవి రేసులో పలువురు ఉండటంతో అదృష్టం ఎవరిని వరిస్తుందో తెలియడం లేదు. కానీ మొత్తానికి అధ్యక్ష పదవి కోసం ఎన్నిక జరగడం ఖాయమని చెబుతున్నారు.