Rahul Gandhi Visit Telangana: తెలంగాణలో పట్టు కోసం, పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఈనెల 6న నిర్వహించే సభతో ఆ లక్ష్యం నెరవేరుతుందని భావిస్తోంది. ఈమేరకు వరంగల్ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఉస్మానియా విద్యార్థులతో రాహుల్ సమావేశానికి అనుమతి రాకపోవడంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులే లక్ష్యంతగా తలపెట్టిన రాహుల్ పర్యటనలో వరంగల్ సభను విజయవంతం చేయడానికి నాయకులంతా ఐక్యతారాగం అందుకున్నారు.

-50 కిలోమీటర్లలోపు 10 వేలమంది..
మే 6న వరంగల్‌లో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు . ఈ సభకు జన సమీకరణకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలు జిల్లాలను చుట్టొచ్చారు. కమిటీలు ఏర్పాటు చేశారు. హన్మకొండలో జరిగే రాహుల్ సభను 6 లక్షల మందితో నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది . వరంగల్, హన్మకొండ జిల్లాలకు సమీపంలో ఉండే ఉత్తర తెలంగాణ జిల్లాలు కరీంనగర్ , సిద్దిపేట జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో పార్టీ నేతలు , కార్యకర్తలను సమీకరించాలని నిర్ణయించారు . ఈ క్రమంలోనే రేవంత్‌రెడ్డి ఆయా జిల్లాల్లో సన్నాహక సమావేశాలు సైతం నిర్వహించారు. పార్టీ విస్తత స్థాయి సమావేశాల్లో పాల్గొని కార్యకర్తలకు , నాయకులకు దిశానిర్దేశం చేయడంతోపాటు ముఖ్యనేతలతో రాహుల్ సభపై సమీక్షించారు. రాహుల్ గాంధీ బహిరంగ సభ జరిగే వరంగల్ జిల్లాకు 50 కిలోమీటర్ల లోపు ఉన్న మండలాల నుంచి 10 వేల మంది చొప్పున కార్యకర్తలను ప్రజలను సమీకరించాలని నిర్ణయించారు . అలాగే 70 కిలోమీటర్ల దూరం ఉంటే ఐదు వేలు, వంద కిలోమీటర్లపై దూరం ఉంటే 3 వేల చొప్పున రాహుల్ సభకు తరలించాలని నిర్ణయించారు .
Also Read: MLC Kavitha: ఓడిన చోటే పోటీ.. నిజామాబాద్ పైనే కవిత గురి.. కారణమిదీ!
-పార్టీ పునర్వవైభవం కోసం..
తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి రాహుల్‌సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాహుల్ పర్యటన తర్వాత పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంటుందని, సమస్టిగా 2023 ఎన్నికలకు సమాయత్తమవుతామని భావిస్తున్నారు. అన్నీ తానై నడిపిస్తున్న రేవంత్‌రెడ్డి తాజాగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాతోపాటు సోషల్ మీడియాను ఇందుకు విస్తృతంగా వాడుకుంటున్నారు. రాహుల సభ ఏర్పాట్లు, సన్నాహక సమావేశాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా చూస్తున్నారు. అధికార పార్టీకి వంతపాడే మీడియాలోనూ ఇంటర్వ్యూ(పెయిడ్) ఇచ్చి రాహుల్ పర్యటనతోపాటు, సన్నాహక ఏర్పాట్లు కవర్ చేసేలా చూసుకున్నారు. ఈమేరకు రేవంత్ రెడ్డి కూడా పలు చానెళ్లు, పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే ఈ ఇంటర్వ్యూల్లో అంతర్గత కుమ్ములాటలపై అడిగిన ప్రశ్నలకు దీటుగా సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పే ప్రయత్నం చేశారు. పర్యటన రోజు మీడియాకు అడ్వర్టయిజ్‌మెంట్లకు కూడా ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.

-రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులే ఎజెండా..
తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులను తమవైపు మళ్లించుకోవడమే లక్ష్యంగా టీకాంగ్రెస్ రాహుల్ సభ ప్రణాళిక సైతం సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రధానంగా రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర, కొనుగోళ్లలో తలెత్తుతున్న ఇబ్బందులు, కౌలు రైతులను ఆదుకోవడం గురించి రాహుల్ సభలో ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది. రైతుబంధు పట్టాదారులకే ఇవ్వడం వలన కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారని, కొనుగోళ్ల సమయంలోనూ పట్టాదారు పాస్ పుస్తకం అడుగుతుండడంతో కౌలు రైతులు పంట అమ్ముకునేందకు కూడా పడుతున్న ఇబ్బందులను ఇందులో ప్రస్తావించి కౌలు రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నట్లు సమాచారం. విద్యార్థులు, నిరుద్యోగుల విషయంలోనూ రాహుల్ ద్వారా సరికొత్త ఎజెండా ప్రకటించే ప్రయత్నాల్లో టీకాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది.
-హామీలను ప్రశ్నించేలా..
దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, రుణమాఫీ, మహిళలకు సున్నా వడ్డీ, పంటలకు సాగునీరు, కొత్తగా వచ్చిన ఆయకట్టు ఇలా కేసీఆర్ ఇచ్చిన హామీలను కూడా రాహుల్ ద్వారా ప్రశ్నించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మొత్తంగా టార్గెట్ 2023 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ రాహుల్ పర్యటనను ఖరారు చేసింది. రాహుల్ రాకతోపార్టీ బలోపేతంతోపాటు శ్రేణులకు భరోసా ఇవ్వడం.. అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందకెళ్లబోతోంది. ఈ మేరకు రాహుల్ గాంధీ రాకతో పార్టీకి ఊపు వస్తుందని భావిస్తున్నారు.
Also Read:Extramarital Affair: ఛీ..ఛీ.. ఇదేం పాడుబుద్ధి.. పెళ్లి తర్వాత పరాయి వ్యామోహం.. హత్యలు