Rahul Gandhi: రాహుల్‌గాంధీ.. పరిచయం అక్కరలేని పేరు.. యావత్ భారత దేశానకి సుపరిచితుడు. నెహ్రూ కుంటుంబ రాజకీయాలను వారసత్వంగా పుచ్చుకున్న కాంగ్రెస్ నేత. ఆయన గతంలో ఏఐసీసీ అధ్యక్షుడిగా పనిచేశాడు. అయితే ఆయన సారథ్యంలో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గేను ఎన్నుకున్నారు. అయితే అధ్యక్షుడు మారినా పార్టీ పరిస్థితి మాత్రం మారలేదు. ఖర్గే అధ్యక్షుడు అయ్యాక కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక రాహుల్ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత మాత్రం.. కాంగ్రెస్ పార్టీ పరాజయాల సంఖ్య మొన్నటి బిహార్ ఓటమితో 95 కు చేరింది. ఇది కేంద్ర, రాష్ట్ర, ఉప ఎన్నికలు, రాజ్యసభ, స్థానిక ఎన్నికలు అన్నింటిని కలిపి. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో ఇంత ఎక్కువ పరాజయాలను ఎదుర్కొన్న ప్రధాన నాయకుడు లేరని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. క్రమంగా ప్రతీ ఎన్నికల్లో నిరుత్సాహకర ఫలితాలు రావడం, కాంగ్రెస్‌కు గట్టి సంకేతమని వారు అభిప్రాయపడుతున్నారు. పార్టీకి తగిన వ్యూహపరమైన మార్పులు లేకపోవడం, స్థానిక స్థాయిలో బలమైన నాయకత్వం కొరత ప్రధాన కారణాలుగా చెప్పబడుతోంది.
వ్యూహం లోపమా? లేక దిశా దోషమా?
రాహుల్ గాంధీ నాయకత్వం తీసుకున్నప్పటి నుంచి కాంగ్రెస్ తన పాత జోరు తిరిగి పొందలేకపోతోంది. యువతకు చేరువ కావాలన్న ఉద్దేశంతో ఆయన ప్రారంభించిన ప్రచార విధానాలు కూడా పెద్దగా ఫలితాలను ఇవ్వలేకపోయాయి. భిన్న ప్రాంతాల్లో స్థానిక కూటములపై ఆధారపడటం, బలమైన రాష్ట్ర స్థాయి నేతల లోటు, నిర్ణయాల ఆలస్యం వంటి అంశాలు పార్టీని వరుస ఓటముల దిశగా నెట్టాయి. పదును కోల్పోయిన పార్టీ నిర్మాణం, భావజాల స్పష్టత లేకపోవడం, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన ప్రత్యామ్నాయం చూపడంలో విఫలం అవ్వడం వంటి అంశాలు ఓటర్లను దూరం చేశాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
బెంగాల్ పరీక్ష కీలకం
ఇప్పటికే బెంగాల్ ఎన్నికల సన్నాహాలు మొదలయ్యాయి. అక్కడ తృణమూల్, బీజేపీ ప్రభావం మధ్య కాంగ్రెస్ గెలుపు అంత ఈజీ కాదు. 95 పరాజయాల తరువాత రాహుల్ గాంధీకి ఇది నిర్ణాయక దశగా భావిస్తున్నారు. పార్టీ పునర్‌వ్యవస్థీకరణ, యువ నేతల ప్రోత్సాహం, స్థానిక స్థాయిలో బలమైన వ్యూహం లేకపోతే, కాంగ్రెస్‌కు ‘‘పరాజయాల సెంచరీ’’ తప్పదని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.
మొత్తంగా రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పరాజయాల్లో సెంచరీ కొట్టబోతుందని ఆయన విమర్శకులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.