Congress : ఖమ్మం సభతో కాంగ్రెస్ లో ఉత్సాహం వచ్చేసింది. ఒకేసారి అటు భట్టి విక్రమార్క పాదయాత్ర.. ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి చేరికతో కాంగ్రెస్ బలోపేతమైంది. ఇక బీజేపీ రోజురోజుకు బలహీన పడుతుండగా అదే స్తానంలో కాంగ్రెస్ బలంగా తయారవుతోంది. తెలంగాణలో అధికారంపై రాహుల్ గాంధీలో భరోసా కనిపిస్తోంది. అందుకే పీపుల్స్ మార్చ్ అంటూ పాదయాత్ర చేపట్టిన భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. ఖమ్మం వేదికపైనే సన్మానించారు. పార్టీకి ఊపు తెచ్చారంటూ ప్రశంసించారు. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రాహుల్ చూశారు. పాదయాత్రలో భట్టి పేదలకు ఇచ్చిన అంశాలను నెరవేరుస్తానంటూ పార్టీ తరుఫున ప్రకటించారు.
ఇక సభ ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ తన వెంట స్వయంగా భట్టి విక్రమార్కను కారులో గన్నవరం వరకూ తీసుకెళ్లారు. పార్టీ గురించి.. నాయకత్వం, కార్యకర్తలపై రాహుల్ గాంధీ ఆరాతీశారు. కీలక సూచనలు చేశారు. ఖమ్మం సభ ద్వారా తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా విభేదాలు విడిచి ఒక్క తాటిపైకి రావడంతో రాహుల్ గాంధీ సంతోషించారు. ఇదంతా భట్టి పాదయాత్ర వల్లే సాధ్యమైందంటూ కొనియాడారు.
రాష్ట్రంలో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కకు రాహుల్ గాంధీ ఖమ్మం సభలో ప్రత్యేక అభినందనలు తెలిపారు. సభలో హర్షధ్వానాలు చోటు చేసుకున్నాయి. సభకు వచ్చినప్పటి నుంచి పోయేవరకూ ప్రతీ సందర్భంలోనూ భట్టి విక్రమార్కకు రాహుల్ ప్రాధాన్యత ఇవ్వటం విశేషం. రేవంత్ కంటే కూడా భట్టికే రాహుల్ అత్యధిక ప్రాధాన్యతనివ్వడం ఆయన పాదయాత్రను కొనియాడడం విశేషం. సభలో రాహుల్ కంటే ముందు ప్రసంగించే అవకాశం భట్టి..పొంగులేటికి కల్పించారు. భట్టి తన పాదయాత్ర అనుభవాలను పంచుకున్నారు. పేదల పక్షాల కాంగ్రెస్ నిలబడుతుందని రాహుల్ సమక్షంలో స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారం ఖాయమని రాహుల్ ముందే ధీమా వ్యక్తం చేసారు. ఆయనకు భరోసా కల్పించారు.
మొత్తంగా పీపుల్స్ మార్చ్ యాత్ర..ఖమ్మం సభ నిర్వహణ పైన భట్టిని రాహుల్ ప్రత్యేకంగా అభినందించారు. సభకు తరలి వచ్చిన జనసందోహంతో ట్రాఫిక్ లో రాహుల్ చిక్కుకున్నారు. ఈ సభ ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దిశగా తొలి అడుగు పడుతుందన్న నమ్మకాన్ని రాహుల్ కు భట్టి, పొంగులేటి కల్పించారు.