హీరోయిజం మాటల్లో కాదు చేతల్లో ఉంటుంది. సీఎం జగన్ గతంలో సోనియాగాంధీని ఎదురించి నిలబడి విజయం సాధించి వారికే హీరోయిజం చూపించారు. ప్రస్తుతం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహారం కూడా ఇదే తీరుగా కొనసాగుతోంది. జగన్ ఇచ్చిన టికెట్ తోనే గెలిచి ఆయనకే కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. వైసీపీ నేతల తీరుతో ప్రజల్లో ఆయన క్రేజ్ పెరిగిపోతోంది. ప్రతిపక్షం అంటే చంద్రబాబు కాదు రఘురామ రాజే అని చెప్పుకునే విధంగా పరిస్థితి మారిపోయింది. ఈ నేపథ్యంలో రఘురామపై వేటు వేయించాలనే వైసీపీ నేతల ప్రయత్నాలు సైతం బెడిసికొట్టినట్లు తెలుస్తోంది.
రఘురామ కృష్ణంరాజుపై వేటువేయించాలనే ప్రయత్నాల్లో భాగంగా స్పీకర్ ఓం బిర్లాకు పిటిషన్ ఇచ్చినా దానిపై ఆయన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. దానికి ఓ ప్రక్రియ ఉంటుందని స్పీకర్ పేర్కొనడంతో వైసీపీ ఇరుకున పడినట్లు అయింది. వైసీపీ నేతల తీరుకు స్పీకర్ అంత వేగంగా స్పందించే విధంగా లేనట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో రఘురామపై వేటు పడే అవకాశాలు కనిపించడం లేదని తెలుస్తోంది.
జగన్ తో మొదట్లో చిన్నచిన్న మాటలతో మొదలై ఇప్పుడు గాలివానలా మారుతోంది. ఆయన ప్రతిష్టను పెంచిన ఘనత జగన్ దే అని అందరు చెప్పుకుంటున్నారు. జగన్ తీరు వల్ల రఘురామ ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్నారని తెలుస్తోంది. రఘురామపై వేటు విషయంలో కూడా జగన్ ఆ నెపాన్ని స్పీకర్ మీదకు నెట్టాలని చూశారు. కానీ రఘురామ స్పందన చూశాక వైసీపీ నేతలకు కూడా ఈ పాటకే అర్థమైపోయింది.
ప్రస్తుతం రఘురామ ఇమేజ్ జగన్ కు సమానంగా పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రఘురామ బాగా ఫోకస్ అయినట్లు తెలుస్తోంది. ఇంతలా ఎదిగిన ఆయన ప్రతి పనికి జగన్ నే టార్గెట్ చేసుకుని నిరంతరం జగన్ ను ఇరుకున పెట్టే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. రఘురామ వేసిన ట్రాప్ లో జగన్ ఇరుక్కుని ఎటూ వెళ్లలేక చిక్కులో పడిపోయినట్లు చెబుతున్నారు.