భారత్‌ ఈ విపత్తును ఎదుర్కోలేదు..!

భారత్‌ ప్రస్తుతం భారీ ఆర్థిక విపత్తును ఎదుర్కొంటున్నదని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఒక్కటే పోరాడలేదని రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తెలిపారు. ‘నేను చాలా ఆందోళన చెందుతున్నది మనం (భారత్‌) ఎదుర్కొంటున్న విపత్తు మరింత ముదురుతున్నదనే. ప్రధాన మంత్రి కార్యాలయం ఒక్కటే దీనిపై పోరాడలేదు. తప్పక ప్రతిపక్షాలను సంప్రదించాలి. వారి సలహాలు, సూచనలు తీసుకోవాలి’ అని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. దేశంలోని నిపుణులు, ప్రతిభావంతులను సంప్రదించాలని, అలాంటివారు రాజకీయ ప్రత్యర్థులైనా సంశయం వద్దని […]

Written By: Neelambaram, Updated On : May 22, 2020 5:39 pm
Follow us on

భారత్‌ ప్రస్తుతం భారీ ఆర్థిక విపత్తును ఎదుర్కొంటున్నదని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఒక్కటే పోరాడలేదని రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తెలిపారు. ‘నేను చాలా ఆందోళన చెందుతున్నది మనం (భారత్‌) ఎదుర్కొంటున్న విపత్తు మరింత ముదురుతున్నదనే. ప్రధాన మంత్రి కార్యాలయం ఒక్కటే దీనిపై పోరాడలేదు. తప్పక ప్రతిపక్షాలను సంప్రదించాలి. వారి సలహాలు, సూచనలు తీసుకోవాలి’ అని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

దేశంలోని నిపుణులు, ప్రతిభావంతులను సంప్రదించాలని, అలాంటివారు రాజకీయ ప్రత్యర్థులైనా సంశయం వద్దని హితవు చెప్పారు. వైరస్‌ ఉద్ధృతి, లాక్‌డౌన్‌ల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం ఒక్కటే ఇప్పుడు సవాల్‌ కాదన్న రాజన్ గత ఆర్థిక వైభవాన్ని అందుకోవడం కూడా కీలకమేనని పేర్కొన్నారు. దేశంలో ఎందరో మేధావులున్నారని, వారందరికీ పిలుపునివ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ద్రవ్యలోటు పెరిగితే రేటింగ్‌ ఏజెన్సీల స్పందన ఎలా? ఉంటుందోనన్న భయాలను ప్రభుత్వం వీడాలని రాజన్‌ హితవుపలికారు. బహుశా దీనివల్లేనేమో ఆర్థికపరమైన నిర్ణయాల్లో ప్రభుత్వం పరిమిత స్థాయిలోనే స్పందిస్తున్నదని పేర్కొన్నారు. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే ఖర్చుల పెంపు అత్యవసరమని స్పష్టం చేశారు. ఏదిఏమైనా త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడగలదన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు.

కేంద్రం ఇటీవల ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ.. దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకోదని రాజన్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉందని, దీన్ని పరుగులు పెట్టించాలంటే ఈ ప్యాకేజీలు ఎంతమాత్రం సరిపోవని తేల్చి పారేశారు. మరిన్ని గొప్ప ఉద్దీపనల అవసరం ఉందని సూచించారు.

నిజానికి కేంద్ర ప్యాకేజీలో కొన్ని మంచి నిర్ణయాలున్నా.. ఇంకా అత్యుత్తమ నిర్ణయాలు తీసుకునే వీలుందని చెప్పారు. ఇక నిర్మాణ, మౌలిక రంగాల అభివృద్ధితో కూడిన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే ఇప్పుడు అసలైన పరీక్ష అని రాజన్‌ తెలిపారు. వైరస్‌తో పోరాటం కంటే దేశ జీడీపీని వృద్ధి బాట పట్టించడమే చాలా ముఖ్యమని సూచించారు. లాక్‌డౌన్‌ పరిస్థితులను వ్యూహాత్మకంగా జయించడం కూడా ప్రధానమేనని స్పష్టం చేసారు.