ప్రముఖ సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణ మూర్తి తాజా చిత్రం ‘రైతన్న’. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా కేంద్రం తెచ్చని కొత్త వ్యవసాయ చట్టాలను తప్పుబట్టారు. వీటివల్ల రైతు అనేవాడు లేకుండా పోతాడని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశంలోని పలు సమస్యల మీద కవులు, కళాకారులు, మీడియా స్పందిస్తున్నట్టుగానే.. గడిచిన 36 సంవత్సరాలుగా తాను కూడా సినిమా ద్వారా స్పందిస్తున్నట్టు చెప్పారు. అర్ధరాత్రి స్వాతంత్రం నుంచి అన్నదాత చిత్రం వరకు 36 సినిమాలు తీశానని అన్నారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఇక, కేంద్రం తెచ్చని వ్యవసాయ చట్టాలపై మాట్లాడుతూ.. అవి రైతులకు వరాలు కావాని, శాపాలుగా మారబోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలాంటి చట్టాలు భారతదేశానికి మంచివి కావని అన్నారు. ఇటీవల బీహార్ లో మార్కెట్లు ఎత్తేస్తే.. గిట్టుబాటు ధర లభించక రైతులు విలవిల్లాడుతున్నారని అన్నారు. ఇప్పుడు బీహార్ లో రైతులు లేరని, రైతు కూలీలు మాత్రమే మిగిలారని అన్నారు. రేపు.. దేశంలోనూ ఇదే పరిస్థితి రాబోతోందని అన్నారు. స్వేచ్ఛా వాణిజ్యం పేరుతోరైతు మెడకు ఉరి బిగించడం సరికాదని నారాయణమూర్తి సూచించారు. కేంద్రం కొత్త చట్టాలను పక్కనపెట్టి, స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకం ఎంతో గొప్పగా ఉందని, ఇది దేశానికే ఆదర్శమని నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు.
ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజ హితం కోసం ఉద్యమాల ద్వారా పలువురు కృషి చేస్తుంటారని, నారాయణ మూర్తి ప్రజల పక్షపాతిగా సినిమాలు నిర్మిస్తున్నారని అభినందించారు. రైతులతోపాటు అన్నివర్గాల ప్రజలు ఈ చిత్రాన్ని చూడాలని కోరారు. వ్యాపారమే ప్రధానంగా ఉన్న ఈ రోజులక్లో.. సమాజ హితం కోసం వచ్చే సినిమాలు అరుదుగా వస్తుంటాయని, వాటిని ఆదరించాలని మంత్రి సూచించారు.