R Krishnaiah Assets: బీసీ ఉద్యమమంటే తెలుగు రాష్ట్రాల్లో ముందుగా గుర్తుకొచ్చేది ఆర్.కృష్ణయ్య. ఉద్యమంతో బీసీలకు ఏం సాధించారో ..ఏం సాధించి పెట్టారో తెలియదు కానీ బాగా ఆస్తులు కూడబెట్టుకున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అటు రాజకీయ పక్షాలు సైతం కృష్ణయ్య తమ వెంట ఉంటే బీసీల మద్దతు పుష్కలంగా తమకే లభిస్తుందని భావిస్తున్నాయి. ప్రతీ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ ఆయన్ను ఆహ్వానించి ఎమ్మెల్యే, ఎంపీనో చేస్తున్నాయి. అదే సమయంలో ప్రతీ ఎన్నికకు ఆయన ఆస్తులు పెరుగుతూ వస్తున్నాయి. ఉద్యమ నేతగా ఆయన భలే క్యాష్ చేసుకుంటున్నారని తోటి బీసీ నేతల నుంచే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కృష్ణయ్య ఎదుగుతుండడం సహచర బీసీ నేతలకు మింగుడుపడడం లేదు. దీంతో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. కృష్ణయ్యపై నెగిటివ్ కామెంట్స్ ఊపందుకుంటున్నాయి.

ఇటీవల ఆయన వైసీపీ తరుపున రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఏపీ సీఎం జగన్ పిలిచి మరీ కృష్ణయ్యను ప్రమోట్ చేశారు. వైసీపీలో ఎంతోమంది దిగ్గజాలు రాజ్యసభ స్థానం కోసం ఎదురుచూస్తుండగా.. వారి అంచనాలకు విరుద్ధంగా కృష్ణయ్యను ఎంపిక చేశారు. కొంతమంది పారిశ్రామిక దిగ్గజాలను సైతం పక్కకు తప్పించి కృష్ణయ్యకు రాజ్యసభ వరించింది. కానీ ఓ బీసీ నేతకు అరుదైన అవకాశం దక్కినా సంఘ పరంగా ఎవరూ పెద్దగా ఆహ్వానించలేదు.పైగా ఉద్యమాన్ని తన రాజకీయ కొలువుల కోసం తాకట్టు పెడుతున్నారన్న కామెంట్స్ ప్రారంభమయ్యాయి.
ఉద్యమనేతగా ఉన్న కృష్ణయ్యకు బీసీ కార్డు చాలా ఉపయోగపడింది. చంద్రబాబులాంటి నాయకుడే ఒకానొక దశలో కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. 2014లో ఎల్ బీనగర్ నుంచి కృష్ణయ్య టీడీపీ అభ్యర్థిగా పోటీచేశారు. అప్పటికే తెలంగాణలో టీడీపీ డ్యామేజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు. బీసీ ఉద్యమ నేత కృష్ణయ్యకు టీడీపీలోకి రప్పించి.. తెలంగాణ ప్రజలు టీడీపీకి అధికారమిస్తే కృష్ణయ్యను సీఎం చేస్తామని ప్రకటించారు. అది వర్కవుట్ కాలేదు. కానీ కృష్ణయ్య మాత్రం ఎమ్మెల్యే అయ్యారు. టీడీపీ సభ్యుడిగానే కొనసాగారు.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కృష్ణయ్యను ఆహ్వానించింది. మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాన్ని కట్టబెట్టింది. కానీ అక్కడ కూడా ఓటమే ఎదురైంది. కేసీఆర్ కు వ్యతిరేకంగా బీసీలను ఏకతాటిపైకి తెచ్చి కాంగ్రెస్ వైపు మరల్చుతారని హైకమాండ్ ఆశలు పెట్టుకుంది. కానీ అది కూడా వర్కవుట్ కాలేదు. కానీ ఏపీ సీఎం జగన్ ఏకంగా రాజ్యసభ ఆఫర్ ఇచ్చి కృష్ణయ్యను వైసీపీకి రప్పించారు. ప్రస్తుతం వైసీపీ సభ్యుడిగా ఉన్న కృష్ణయ్య ఆ పార్టీ సపోర్టుగా నిలుస్తున్నారు. కానీ ఎన్నికల నాటికి ఆయన గాలి ఎటు మళ్లుతుందోనన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి.

తొలిసారిగా ఎల్బీనగర్ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన సమయంలో ఆయన ఆస్తి రూ.22 లక్షలుగా చూపారు. అటు తరువాత మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగినప్పుడు అఫిడవిట్లో ఆస్తి విలువ రూ.46 కోట్లకు పెరిగింది. కేలం ఐదేళ్ల వ్యవధిలో ఇన్ని రెట్ల ఆస్తి ఎక్కడ నుంచి వచ్చిందని ఇతర ఉద్యమ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ఉద్యమం చేపడితే ఇంతగా లబ్ధి ఉంటుందా అన్న సెటైర్లు అయితే పేలుతున్నాయి. రాజకీయాలు చేసే కంటే ఉద్యమాలు ద్వారానే ఈజీగా ఎర్నింగ్ తో పాటు రాజకీయ కొలువులు సాధ్యమని వివిధ రాజకీయ పక్షాల నేతలు భావిస్తున్నారు. ఆర్. కృష్ణయ్య రాజకీయ ఉన్నతిని ఆదర్శంగా తీసుకుంటే మాత్రం మరింత మంది ఉద్యమ నాయకులు పుట్టుకొచ్చే అవకాశం ఉంది.