అమరావతి మహిళలు సుమారు మూడు నెలలుగా ఆందోళన చేస్తుండగా, వారికి పూర్తి మద్దతు బిజెపి ప్రకటించినప్పటికీ ఆ పార్టీ నేతలు చాలామంది గోడమీద పిల్లి వలే వ్యవహరిస్తూ ఉండటం చాలామందికి విస్మయం కలిగిస్తున్నది. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాత్రమే ఆ గ్రామాలు సందర్శించి, మహిళలు మద్దతు తెలపడం తప్పితే చెప్పుకోదగిన మిగిలిన నాయకులు ఇప్పటి వరకు సందర్శించని లేదు.
పార్టీకి ఉన్న ఇద్దరు శాసన మండలి సభ్యులు – సోము వీర్రాజు, పివిఎన్ మాధవ్ అటు వైపు చూడలేదు. పైగా, మాధవ్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేబట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇకటి లేదా రెండు సార్లు వచ్చినా, మిగిలిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు – సీఎం రమేష్, టిజి వెంకటేష్ సహితం అటువైపే చూడలేదు.
ముఖ్యంగా మాజీ కేంద్ర మంత్రి డి పురందేశ్వరి మహిళా నాయకురాలిగా అటువైపు చూడక పోవడం బిజెపి వర్గాలకే విస్మయం కలిగిస్తున్నది. కనీసం ఆ మహిళలకు మద్దతుగా ఆమె ఎక్కడ మాట్లాడిన్నట్లు లేదు. వాస్తవానికి ఆ ప్రాంతానికి చెందిన పలువురు బిజెపి నాయకులు ఆమెను ఒకసారి అక్కడకు రమ్మనమని కోరినా ఆమె లెక్క చేయలేదని తెలుస్తున్నది.
ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఇన్ ఛార్జ్ గా ఉన్న ఆమె పార్టీలో కీలక పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పదవి దక్కని పక్షంలో వైసిపిలో చేరడానికి రంగం సిద్ధం చేసుకొంటున్నారా అనే అనుమానాలను పలువురు బిజెపి నేతలే వ్యక్తం చేస్తున్నారు.
ఆమె మూడు పదవులను ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రి వర్గంలో చేర్చు కోవడం. లేదా రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం. లేదా జాతీయ మహిళా కమీషన్ చైర్మన్ పదవి ఇవ్వడం. ఐదేళ్ల క్రితమే ఆమె జాతీయ మహిళా కమీషన్ చైర్మన్ పదవి కోరుకున్నారని, ఆ మేరకు ఒక సీనియర్ ఆర్ ఎస్ ఎస్ నాయకుడి ద్వారా ప్రయత్నం చేశారని తెలుస్తున్నది.
అయితే ఆ నాయకుడు ఆ పదవి ప్రాధాన్యత తెలియక మహిళా కమీషన్ కు బదులు, మహిళా మోర్చా అని వ్రాసి పంపారని, దానితో మహిళా మోర్చా ఇన్ ఛార్జ్ గా చేసారని చెబుతున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యతం కూడా లేకుండా ఒక కీలకమైన విభాగానికి ఇన్ ఛార్జ్ గా ఇప్పటి వరకు వారెవ్వరిని చేయలేదు.
ఈ పదవి ద్వారా ఆమె బిజెపి ఆఫీస్ బేరర్ల సమావేశాలకు హాజరు కాగలుగుతున్నారు. అయితే రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ఆమెకు అవకాశం దక్కక పోవడంతో మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం కూడా కనబడటం లేదు.