Homeక్రైమ్‌Promotion of illegal betting apps: ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్.. ఈడీ విచారణకు...

Promotion of illegal betting apps: ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్.. ఈడీ విచారణకు హాజరైన సెలబ్రిటీలు ఎవరంటే?

Promotion of illegal betting apps: వెనకటి కాలంలో చీకటి శక్తులు రకరకాల మోసాలకు పాల్పడేవి. దొంగతనాలు, ఇతరత్రా ఆర్థిక అవకతవకలకు పాల్పడేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వైట్ కలర్ మోసాలకు చీకటి సంస్థలు తెరలేపాయి. ఇందులో భాగంగా జనాలలో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిపోయిన నేపథ్యంలో.. దాని ఆధారంగానే ఆర్థిక అక్రమాలకు పాల్పడటం ప్రారంభించాయి. ఇందులో భాగంగానే బెట్టింగ్ యాప్స్ ను తెరపైకి తీసుకొచ్చాయి. ఇవన్నీ కూడా ఇల్లీగల్ వ్యవహారాలు.. మొదట్లో బెట్టింగ్ లో గెలిచే విధంగా ఆ కంపెనీలు పావులు కదుపుతాయి. డబ్బులు కూడా ఇస్తాయి. ఆ తర్వాత జనాలకు మరింత డబ్బు సంపాదించాలి అనే కోరికతో ఇంకా ఎక్కువ ఆడటం మొదలుపెడతారు. ఆ తర్వాతే ఈ కంపెనీలు అసలైన మోసానికి తెర లేపుతాయి. అంతే అప్పటిదాకా డబ్బులు గెలిచినవారు కోల్పోవడం మొదలవుతుంది. ఆ తర్వాత వారికి అది ఒక వ్యసనం లాగా మారుతుంది. చివరికి అప్పులు చేసేదాకా పరిస్థితి దిగజారుతుంది. ఆ తర్వాత వారి ప్రాణమే పోతుంది. బెట్టింగ్ యాప్స్ కు బానిసలై తెలుగు రాష్ట్రాల్లోనే వందలాది మంది చనిపోయారు. వందల కోట్లల్లో నష్టపోయారు.

సెలబ్రిటీలతో ప్రమోషన్
కొన్ని మినహా మిగతా అన్నింటికీ అనుమతులు లేవు. అటువంటి బెట్టింగ్ యాప్స్ కు సెలబ్రిటీలు ప్రచారం నిర్వహించడం అత్యంత విషాదం. సెలబ్రిటీలు ప్రచారం నిర్వహించడం వల్లే బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులకు కాసుల పంట పండుతోంది. తెరపైన వారు కనిపించకపోయినప్పటికీ.. తెర వెనుక చేసే వ్యవహారాలతో కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ పై ఉక్కు పాదం మోపింది. సెలబ్రిటీలపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. పోలీసులు కూడా కేసులు నమోదు చేయడంతో దెబ్బకు సెలబ్రిటీలు దిగివచ్చారు. ఇక ఇప్పుడు జాతీయస్థాయిలో బెట్టింగ్ యాప్స్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దృష్టిసారించింది. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ నిర్వహిస్తున్న సెలబ్రిటీలకు తాఖీదులు ఇచ్చింది. దీంతో వారు మంగళవారం కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన వారిలో క్రికెటర్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా ఉన్నారు. ఇక బాలీవుడ్ ప్రముఖులలో ఊర్వశి రౌతేలా, సోనూ సూద్ ఉన్నారు. వీరంతా కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ నిర్వహించారని.. అందుకుగానూ భారీగా పారితోషికం స్వీకరించారని కేంద్ర దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. ఇందులో భాగంగానే వారు విచారణకు హాజరయ్యారు.

ఉదయం ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం వరకు గాని ముగియలేదు. హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, సోను సూద్, ఊర్వశి వేర్వేరుగా విచారణకు హాజరయ్యారు. వీరందరినీ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారుల బృందం వేరువేరుగా విచారించింది. వారి వద్ద నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేసింది.. అక్రమంగా వీరు ఏమైనా సంపాదించారా? బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు వీరికి ఏం మార్గాలలో నగదు అందజేశారు? వచ్చిన నగదు వీరు ఏ రూపాలలో మార్చారు? మీరు ఏ ఏ కంపెనీలకు ప్రమోషన్ నిర్వహించారు? ఆ కంపెనీల చరిత్ర ఏమిటి? కోణాలలో కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు విచారణ నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు తదుపరి అడుగులు ఎలా వేస్తారు అనేది చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version