Government Education: ప్రభుత్వ విద్యను( Government education) బలోపేతం చేస్తున్నట్లు ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. ఇందుకోసం దేశవ్యాప్తంగా వేలకోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. గత ఐదేళ్ల కాలంలో 20 రాష్ట్రాలలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య కోటి 30 లక్షలు తగ్గితే… ప్రైవేటు పాఠశాలల్లో చేరే వారి సంఖ్య ఓటీ 70 లక్షలకు పెరిగింది. అంటే ప్రభుత్వ విద్య ఎంతటి ప్రమాదంలో ఉందో తెలుసుకోవచ్చు. అయితే ఉచిత బస్సు ప్రయాణానికి మొగ్గు చూపుతున్న ప్రజలు.. ఉచిత పథకాలకు జై కొడుతున్న ప్రజలు.. ఉచిత విద్యకు మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఇది అత్యంత ప్రమాదకరం. ప్రభుత్వ విద్యావ్యవస్థను ప్రమాదంలో పెట్టినట్టే.
ఉత్తమ విద్యా బోధన
సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో( Government schools) ఉచితంగానే విద్య అందిస్తారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారు. శిక్షణ తీసుకొని, మంచి నైపుణ్యం గల వారే ఉపాధ్యాయులుగా ఎంపిక అవుతారు. మధ్యాహ్నం భోజన పథకం, స్కాలర్ షిప్స్, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు… ఇలా ఒక్కటేమిటి అన్ని అందిస్తారు. కానీ ఎందుకో మాత్రం ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులు మొగ్గు చూపడం లేదు. కనీసం అటువైపుగా చూసేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. దీనిపై రకరకాల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అక్కడ అయితే మంచి చదువు అందుతుందని వారి ఆశ. వారి భవిష్యత్తుకు గట్టి పునాదులు పడతాయి అన్నది ఒక అభిలాష.
Also Read: AP Government: ఏపీలో ఇంగ్లీష్ మీడియం చదవులు.. జగన్ కు చిక్కిన కూటమి ప్రభుత్వం
కేంద్రం సర్వ శిక్ష అభియాన్ ద్వారా..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు పెద్దపీట వేస్తుంటాయి. లక్షల కోట్లు ఖర్చు పెడుతుంటాయి. దేశవ్యాప్తంగా సర్వ శిక్ష అభియాన్( Sarv Shiksha Abhiyan ) కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది కేంద్రం. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే విద్యార్థుల చదువుకు ప్రోత్సహించేందుకు గత ఆరేళ్లుగా ప్రభుత్వమే నేరుగా నిధులు అందిస్తోంది. తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. అయితే ఇది ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు పరిమితం చేస్తే బాగుండేది. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సైతం ఈ తరహా సాయం అందిస్తుండడం విశేషం. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపడుతున్నాయి. విద్యా బోధన అందుతోంది. అయినా సరే తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు వైపు ఆసక్తి చూపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా ప్రైవేటు పాఠశాలల వైపు వెళ్లడంతో చాలా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను ఎత్తివేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఇకనైనా ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.