TRS MLAs Purchase Case: మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మరింత పట్టు బిగిస్తోంది. బిజెపి అగ్ర నాయకులను హైదరాబాద్ కు రప్పించేందుకు వేగంగా పావులు కదుపుతోంది. కెసిఆర్ లక్ష్యం అదే కాబట్టి.. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు కూడా అదే స్థాయిలో నడుచుకుంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.. వారిని పలుమార్లు విచారించి కీలకమైన ఆధారాలు రాబట్టామని పోలీసులు అంటున్నారు.. ఇదే సమయంలో మీడియాకు పలు లీకులు ఇచ్చారు.. అయితే ఆ ముగ్గురు నిందితుల ఫోన్ కాల్ డేటా, బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించిన అధికారులు ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు.

మళ్లీ పిలిచారు
బండి సంజయ్ బంధువైన అడ్వకేట్ శ్రీనివాస్ ను ఈరోజు సిట్ అధికారులు మరోసారి విచారించారు. నందకుమార్ భార్య చిత్రలేఖ కు, అంబర్ పేట కు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్ కూడా విచారణకు హాజరుకావాలని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు నోటీసులు జారీ చేయగా… ఆయన విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఒక నిందితుడుగా ఉన్న నంద కుమార్ తో ప్రతాప్ గౌడ్ పలు లావాదేవీలు నిర్వహించినట్టు తెలుస్తోంది. సింహ యాజి స్వామితో అనేక సందర్భాల్లో ప్రయాణం చేసినట్టు సెట్ అధికారులు గుర్తించారు.. ఇదే సమయంలో ప్రతాప్ గౌడ్ కు, నిందితులకు ఉన్న సంబంధాలను, వారి మధ్య జరిగిన లావాదేవీలను మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సిట్ అధికారులు అతడిని విచారణకు పిలిపించారు. అయితే దీనిపై ప్రతాప్ గౌడ్ హైకోర్టుకు వెళ్లారు. సింహయాజి స్వామితో పూజలు జరిపించుకున్నంత మాత్రాన వారితో తనకు సంబంధం అంటగట్టడం ఎంతవరకు న్యాయమని ప్రతాప్ గౌడ్ వాపోతున్నారు. అయితే హైకోర్టు విచారణకు హాజరుకావాలని, దర్యాప్తునకు సహకరించాలని, అయితే ప్రతాప్ గౌడ్ ను అరెస్టు చేయకూడదని సిట్ అధికారులకు ఉత్తర్వులు ఇచ్చింది.
లావాదేవీలపై ఆరా
ఈ కేసులో నిందితుడుగా ఉన్న నందకుమార్ భార్య సతీమణి చిత్రలేఖ కూడా విచారణకు హాజరుకానున్నారు. నందకుమార్ కు సంబంధించిన వ్యాపార లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలను అడిగి తెలుసుకునేందుకు సిట్ అధికారులు విచారించనున్నారు. అయితే నందకుమార్ చిత్రలేఖ పేరు మీదనే పలు లావాదేవీలు నిర్వహించడంతో గుర్తించిన సిట్ అధికారులు ఆమెను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. అయితే ఇవాళ ఉదయం నుంచి విచారణ కొనసాగించిన సీట్ అధికారులు ఎలాంటి ఆధారాలు రాబట్టారో అనేది తేలాల్సి ఉంది.

లుక్ ఔట్ నోటీసులు
ఈ కేసులో సిట్ అధికారులు బిజెపి కీలక నేత బిఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామి, శ్రీనివాస్ లను నిందితులుగా చేర్చారు. లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 29న విచారణకు రావాలని ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు బిఎల్ సంతోష్ కు 41 ఏ నోటీసులు జారీ చేసిన సిట్…వాటిని ఆయనకు మెయిల్ ద్వారా పంపింది. 26 లేదా 28న సంతోష్ విచారణకు రావాలని సిట్ ఆదేశాలు జారీ చేసింది. ఇన్ని రోజులు సిట్ విచారణ నిర్వహిస్తున్నప్పటికీ .. ఒక కీలక ఆధారం కూడా బయట పెట్టకపోవడంతో ఈ కేసు స్థితిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.