
ఈ ప్రపంచంలో తిరిగిరానిది ప్రాణం. అందుకే.. దాన్ని కాపాడే వైద్యులను దేవుళ్లతో పోలుస్తారు. కానీ.. చాలా మంది వైద్యులు మాత్రం దెయ్యాలుగా మారి పీడిస్తున్నారు. రాక్షసులుగా మారి మొత్తం రోగులను దోచేస్తున్నారనే వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. ఎంతో మంది బాధితులు స్వయంగా తమ పరిస్థితిని వివరిస్తూనే ఉన్నారు. డబ్బులు చెల్లించే వరకు మృతదేహాన్ని కూడా అప్పగించని ఘటనలు చాలా చూశాం. ఈ విధమైన వైద్యంతో.. కరోనా సోకిన బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోగులు ఆసుపత్రులకు వెళ్తే చాలు.. లక్షల బిల్లు వేసిగానీ బయటకు వదలట్లేదు ఆసుపత్రులు. దేశంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి నెలకొందనే వార్తలు వస్తున్నాయి. దీంతో.. పరిస్థితి ఎలా తయారైందేంటే.. లక్షల రూపాయలు ఉంటే దవాఖానకు వెళ్లాలి.. లేదంటే ఇంట్లోనే చావాలి అన్నట్టుగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి చికిత్స అందుతోందో అందరికీ తెలిసిందే. దశాబ్దాల నుంచే సర్కారు దవాఖానాలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన ప్రభుత్వాలు.. సర్కారు ఆసుపత్రికి వెళ్తే చావే శరణ్యం అనే భయాన్ని జనాల్లో కలిగించాయనే అభిప్రాయం ఉంది.
దీంతో.. అప్పోసప్పో చేసైనా ప్రైవేటు ఆసుపత్రికే వెళ్తున్నారు. ఏ మాత్రం అవకాశం లేని కడు బీదలు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నారు. అయితే.. ఇప్పుడు కరోనా మహమ్మారి ప్రాణాలనే బలిగొంటుండడంతో ప్రతి ఒక్కరూ అందినకాడ అప్పులు తెచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. అయితే.. మునుపెన్నడూ లేనంత డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి రావడం గమనార్హం.
కొన్ని ఆసుపత్రుల్లో ఒక్క రోజు చికిత్సకే రూ.50 వేలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని సమాచారం. మరింత హైలెవల్ దవాఖానాలైతే రోజుకు లక్ష కూడా వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. డబ్బు దండిగా ఉన్నవాళ్లకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు.. మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటీ? అన్నది సమస్య. ప్రాణం కావాలంటే లక్షలు ఖర్చు చేయాల్సిందే.. లేదంటే శవాన్ని కాటికి మోసుకెళ్లాల్సిందే అన్నట్టుగా తయారైంది పరిస్థితి.
కానీ.. చూస్తూ చూస్తూ మనిషిని చంపుకోలేరు కదా! ప్రాణం నిలబడితే అప్పులు ఎలాగోలా తీర్చుకోవచ్చని ఆలోచిస్తున్నవారు అందినకాడల్లా అప్పులు తెచ్చి ఆసుపత్రుల గల్లాపెట్టెలు నింపుతున్నారు. అయినప్పటికీ.. కనీసం కనికరం లేకుండా ప్రైవేటు వైద్యులు లక్షల రూపాయలు దోచుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి వైద్యం చేయించుకున్న అభాగ్యుల్లో కొందరు ఇటు డబ్బులు, అటు తమవారి ప్రాణం రెండూ పోగొట్టుకొని విలపిస్తున్నారు. మరోవైపు.. కొందరి ప్రాణం నిలబడినా.. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. మొత్తంగా.. కరోనాతో ఆసుపత్రికి వెళ్లి వచ్చేవారు సంతోషంగా మాత్రం ఇంటికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిపై స్వయంగా న్యాయస్థానాలు స్పందించాయి. ఆసుపత్రుల తీరుపై, ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. కానీ.. పరిస్థితిలో మార్పు ఎంత వరకు వచ్చిందన్నది ఎవ్వరికీ అర్థంకావట్లేదు.