Sengol History
Sengol History: నరసింహ సినిమా చూశారా, పోనీ మొన్న విడుదలైన పొన్నియన్ సెల్వన్ లో టైటిల్ కార్డ్స్ మీద ఒక ఆయుధాన్ని పరీక్షించారా? లేక ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్ సభ ను ప్రారంభించే సమయంలో ప్రతిష్టించబోతున్న ఆయుధం గురించి ఏ వార్తల్లోనైనా చదివారా? పోనీ ఏ వార్త కథనమైనా చూశారా? ఇప్పుడు ఆ యంత్రాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టించబోతున్నారు.. అది కూడా అధునాతనంగా నిర్మించిన లోక్ సభ లో. ఇంతకీ ప్రధాని ప్రతిష్టించబోయే ఆ యంత్రం నరసింహ సినిమాలోదో, పొన్నియన్ సెల్వన్ చిత్రంలోదో కాదు. దానికి ఏళ్ల నాటి చరిత్ర ఉంది. లెక్కకు మిక్కిలి ఘనత ఉంది. ఆ కథా కమామీసు ఏమిటో మీరూ చదివేయండి.
కొత్త పార్లమెంట్ భవనంలో..
సాధారణంగా మనం గృహప్రవేశం చేస్తున్నప్పుడు పాలకోయ జాతికి చెందిన చెట్టు కర్రతో యంత్రాన్ని దిగువ మూలన ప్రతిష్టించడం ఆనవాయితీ. దీనివల్ల ఇంటికి ఏమైనా అరిష్టాలు వస్తే వాటిని ఆ యంత్రం తొలగిస్తుందని ఒక నమ్మకం. ఇప్పుడు దేశానికి సంబంధించి నిర్మించిన పార్లమెంటు భవనానికి కూడా ఎలాంటి అరిష్టాలు రాకుండా ఉండేందుకు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మే 28న ఒక రాజ దండాన్ని ప్రతిష్టించబోతున్నారు.. అయితే దానికి ఏళ్ల నాటి చరిత్ర ఉంది. 1947లో బ్రిటిషర్లు మనకు స్వాతంత్రం ప్రకటించి భారతదేశాన్ని విడిచి వెళ్లిపోయే ముందు అధికార మార్పిడికి గుర్తుగా దేశ తొలి ప్రధాని నెహ్రూకు రాజదండం ఇచ్చారు. ఇది ఇన్నాళ్లుగా అలహాబాద్ లోని పురావస్తు ప్రదర్శనశాలలో ఉంది. దానిని ప్రధానమంత్రి మే 28న కొత్త పార్లమెంటు భవనంలో ప్రతిష్టించబోతున్నారు. భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించిన తర్వాత నాటి వైస్రాయ్ మౌంట్ బాటెన్ ” బ్రిటిషర్ల నుంచి భారతీయుల చేతుల్లోకి అధికార మార్పిడి జరుగుతోంది కదా? దానికి గుర్తుగా ఎలాంటి కార్యక్రమం చేద్దామనుకుంటున్నారు” అని నెహ్రూను అడిగారు.. దీనిపై చక్రవర్తుల రాజగోపాలాచారి ( రాజాజీ) కొంత పరిశోధన చేసి అధికార మార్పిడికి సంబంధించి చోళ రాజులు పాటించిన విధానాన్ని ఎంచుకున్నారు. చోళుల్లో ఒక రాజు నుంచి మరొక రాజుకు అధికార మార్పిడి జరిగినప్పుడు రాజదండాన్ని కొత్త రాజుకు బహుకరిస్తారు. దీంతో ఆయన మద్రాసులో అప్పటికి ప్రముఖ నగల వర్తకులైన “ఉమ్మిడి బంగారు శెట్టి అండ్ సన్స్” కు దండాన్ని తయారు చేసే బాధ్యత అప్పగించారు. దాన్ని తయారుచేసిన ఉమ్మిడి ఎత్తి రాజులు, సుధాకర్ ఇప్పటికీ చెన్నైలో నిర్వహిస్తున్నారు. ఐదు అడుగుల ఎత్తుకుంటే ఈ బంగారు పూత పూసిన వెండి దండం పైన పవిత్రతకు, న్యాయానికి గుర్తుగా నంది ప్రతిమను వారు చెక్కారు.
ఇలా జరిగింది మార్పిడి
1947 ఆగస్టు 14న రాజదండ మార్పిడి తమిళ సంప్రదాయ పద్ధతిలో సాగింది. తమిళనాడులోని శైవ మఠం తిరువావడుదురై ఆధీనం ప్రధాన పూజారి అంబలవాన దేశిక స్వామి, అదే ఆధీనానికి చెందిన గాయకుడు ( ఒడువర్) ఆరోజు మద్రాసు నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. తొలుత పూజారి ఆ రాజదండాన్ని రాత్రి పది గంటల 45 నిమిషాల సమయం లో మౌంట్ బాటెన్ కు అప్పగించి మళ్లీ ఆయన చేతుల నుంచి తీసుకొని దాన్ని గంగాజలంతో శుద్ధి చేసి ఊరేగింపుగా ప్రదర్శన చేశారు. ఏడవ శతాబ్ది నాటి తమిళ సాధువు జ్ఞాన సంబంధర్ రాసిన “కోలార్ పదిగం” అనే కవితను ఒడు వర్ పాడుతుండగా రాత్రి 11 గంటల 45 నిమిషాలకు నెహ్రూ అప్పగించారు.
అలహాబాద్ మ్యూజియంలో..
ఇక ఆ రాజదండాన్ని అప్పటినుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలహాబాద్ మ్యూజియంలో నెహ్రూ వస్తువుల మధ్య ఉంచారు. ఇప్పుడు కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా మే 28న లోక్ సభ స్పీకర్ కుర్చీకి సమీపంలో దీనిని ప్రతిష్టిస్తారు. అయితే దీని తయారీదారులు రాజదండం పై కీలక వ్యాఖ్యలు చేశారు. ” మేము రాజదండం తయారు చేస్తున్నప్పుడు యువకులం. ఇప్పుడు వృద్ధులం అయిపోయాం. కానీ నాడు తయారుచేసిన రాజదండం నేడు పార్లమెంట్లో ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రతిష్టించడం, ఆ క్రతువును మేము కళ్ళారా చూసేందుకు అవకాశం లభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం” అని దీని తయారీదారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రాజదండానికి సంబంధించి గూగుల్లో మనవాళ్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.