PM Modi- Chiranjeevi: ప్రధాని మోదీ మెగాస్టార్ కు మంచి ఆఫర్ ప్రకటించారా? అందుకు చిరంజీవి సున్నితంగా తిరస్కరించారా? రాజకీయాలకంటే సినిమాయే బెటర్ అనుకున్నారా? .. సినీ, రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అందర్నీ కాదని చిరంజీవిని పిలవడం వెనుక భారీ స్కెచ్ నడిచినట్టు తెలుస్తోంది. కేంద్ర పర్యాటక శాఖ మాజీ మంత్రి హోదాలో పిలిచినామని చెప్పుకున్నప్పటికీ తెర వెనుక చాలా జరిగిందన్న ప్రచారమైతే నడుస్తోంది. ఇందులో నిజానిజాలు తెలియకున్నా.. రాష్ట్రపతి కోటాలో చిరంజీవికి రాజ్యసభ ఆఫర్ చేసినట్టు మాత్రం తెలుస్తోంది. ఇటీవల దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రకటించిన నలుగురి పేర్లలో తొలి పేరు చిరంజీవిదేనన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్ ను చిరంజీవి తిరస్కరించారట. తాను సినిమాలతో సేఫ్ జోన్ లో ఉన్నానని.. తనకు మరోసారి రాజకీయాల్లోకి రావొద్దని విన్నవించుకున్నారట. చిరంజీవి వదులుకున్న చాన్సే విజయేంద్రప్రసాద్ కు వెళ్లినట్టు టాక్ నడుస్తోంది. వాస్తవానికి అల్లూరి విగ్రహావిష్కరణకు చిరంజీవికి ఎనలేని ప్రాధాన్యం దక్కింది. తన మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ ను పక్కనపెట్టి మరీ ఆయన సోదరుడు చిరంజీవిని పిలవడం వెనుక పెద్ద కథే నడిచినట్టు తెలుస్తోంది. అంతకంటే ముందుగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ జీవిఎల్ నరసింహరావు చిరంజీవితో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేసేందుకు ప్రధాని మోదీ సుముఖంగా ఉన్నట్టు వారు చిరంజీవి చెవిలో వేశారు. చిరంజీవి నుంచి సానుకూల స్పందన వస్తుందని వారు భావించారు. కానీ అందుకు తాను సుముఖంగా లేనని.. సినిమాలతో బీజీగా ఉన్నానని.. ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని బదులివ్వడంతో సదరు నాయకులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇది బీజేపీ నుంచి ఇచ్చిన ఆఫర్ కాదని.. రాష్ట్ర పతి కోటాలో ఇస్తున్నట్టు సముదాయించినా చిరంజీవి తిరస్కరించారు. అయితే సభా వేదికపై ప్రధాని మోదీ కూడా చిరంజీవికి ఎనలేని ప్రాధాన్యిమిచ్చారు. చిరంజీవి మనసు మార్చుకుంటారని భావించారు. కానీ తనకు రాజకీయాలపై ఇంట్రస్ట్ లేదంటూ చిరంజీవి చెప్పడంతో బీజేపీ పెద్దలు సైలెంట్ అయిపోయారు.
రాజకీయాలకు దూరంగా..
ప్రస్తుతానికి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అలాగని ఇప్పటివరకూ ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాఖలాలు లేవు. అంతగా యాక్టివ్ గా కూడా పనిచేయడం లేదు. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు తీసుకోవాలన్న అధిష్టాన సూచనను సైతం తిరస్కరించారు. అప్పటి నుంచి ఆయన్ను కాంగ్రెస్ పార్టీ సైతం పట్టించుకోవడం లేదు. సోదరుడు పవన్ జనసేన యాక్టివ్ గా ఉన్న ఆ పార్టీ వైపు కూడా చిరంజీవి చూడడం లేదు. తన సినిమాలు తనవే అన్నట్టు సినీ ప్రపంచంలో ఉండిపోయారు. ఆ మధ్యన సినిమా టిక్కెట్ల వివాదంలో పెద్దన్న పాత్ర పోషించారు.
Also Read: Revanth Reddy: రేవంత్ మరో రాజశేఖర్ రెడ్డి అవుతారా?
చిత్ర పరిశ్రమ తరుపున ఏపీ సీఎం జగన్ ను కలిశారు. చిత్ర పరిశ్రమను కాపాడాలని అభ్యర్థించారు. అప్పట్లో చిరు అభ్యర్థనలపై రకరకాల కామెంట్లు వినిపించాయి. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చిరంజీవిని పిలిచి అవమానించిందంటూ టాక్ నడిచింది. అంతటితో ఆగకుండా చిరంజీవి లాంటి వ్యక్తి అంతలా అభ్యర్థించాలా అంటూ ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. పనిలో పనిగా వైసీపీ ప్రభుత్వం చిరంజీవికి రాజ్యసభ స్థానం ఆఫర్ ఇచ్చిందని ప్రచారం ప్రారంభించారు. అయితే చిరంజీవి ఎక్కడా దీనిపై ఖండించలేదు. తన పని తాను చేసుకుపోతున్నారు. ఇంతలో అల్లూరి విగ్రహావిష్కరణ రూపంలో బీజేపీ చిరంజీవిని తన వైపు తిప్పుకోవాలని భావించింది. కానీ అందుకు చిరంజీవి ఒప్పుకోకపోవడంతో జాబితా నుంచి పేరు తొలగించి కొత్తవారికి అవకాశమిచ్చారు.
బీజేపీ స్కెచ్..
చిరంజీవికి రాజ్యసభ ఎంపిక విషయంలో బీజేపీ చాలా దూరంగా ఆలోచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జనసేన మిత్ర పక్షంగా ఉన్న కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో పవన్ బీజేపీకి దూరంగా జరుగుతున్నారు. అవసరమైతే చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటానని సంకేతాలు పంపుతున్నారు. మరోవైపు ఏపీలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బీజేపీ ఆశించిన స్థాయిలో బలోపేతం కావడం లేదు. చరిష్మ ఉన్న నాయకుడు లేకపోవడంతో ఆ పార్టీకి మైనస్ గా మారుతుంది. అదే చిరంజీవిని రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవచ్చని ఆలోచించింది. అదే సమయంలో కాపు సామాజికవర్గం అభిమానాన్ని చూరగొనాలని ప్రయత్నించింది. ఇప్పటికే క్షత్రియ సామాజికవర్గం అభిమానాన్ని పొందిన బీజేపీ కాపుల విషయంలో చేయని ప్రయత్నమంటూ లేదు. కన్నా లక్ష్మీనారాయణ, తరువాత సోము వీర్రాజులకు రాష్ట్ర అధ్యక్షులుగా నియమించింది. తాజాగా చిరంజీవిని తెరపైకి తెస్తే కాపులకు మరింత దగ్గర కావచ్చన్నది అంచనాగా వేసింది. కానీ చిరంజీవి తిరస్కరించడంతో కథ అడ్డం తిరిగింది.
గత అనుభవాలతో..
ప్రజారాజ్యం అనుభవాలతో చిరంజీవి రాజకీయాలపై ఆసక్తి తగ్గించుకున్నారు. నాడు ప్రజారాజ్యం పార్టీని స్థాపించి చేతులు కాల్చుకున్నారు. గణనీయమైన ఓట్లు సాధించినా.. అధికారంలోకి మాత్రం రాలేకపోయారు. అటు తరువాత కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని విలీనం చేసి కేంద్ర మంత్రితో సరిపెట్టుకున్నారు. పార్టీ పెట్టిన క్రమంలో చాలా గుణపాఠాలు నేర్చుకున్నారు. తన వెంట నడిచిన వారు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. పీఆర్పీతో రాజకీయ అరంగేట్రం చేసిన వారిలో కొంతమంది బాగానే సక్సెస్ అయ్యారు. మరికొందరు తెరమరుగయ్యారు. ఈ పర్యవసానాల నేపథ్యంలో తనకు రాజకీయాలు ఏమాత్రం సరిపోవన్న నిర్ణయానికి చిరంజీవి వచ్చారు. అందుకే ఏ పార్టీ పదవుల కోసం ఆఫర్లు ప్రకటించిన తిరస్కరిస్తున్నారు. తనకు గుర్తింపునిచ్చిన సినిమా రంగాన్నే ఎంచుకుంటున్నారు.
Also Read:Nagababu: అన్నయ్య తప్ప అందరూ నటించారు.. భీమవరం సభపై నాగబాబు షాకింగ్ కామెంట్