Ayodhya Ram Mandir : దేశమంతా రామ నామస్మరణతో మారుమోగిపోతోంది. మీడియా నుంచి సోషల్ మీడియా వరకు రాముడి గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. జనవరి 22న రామ జన్మభూమి అయినటువంటి అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో దేశం మొత్తం ఆ గడియ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని వివిధ ప్రాచుర్యం పొందిన ఆలయాలను సందర్శిస్తున్నారు. ఉత్తరభారతం, దక్షిణభారతం అని తేడా లేకుండా ఆయా ప్రాంతాలలో కొలువుతీరిన దేవతామూర్తులను దర్శించుకుంటున్నారు. అక్కడి ఆలయాలను శుభ్రం చేస్తున్నారు. పశువులకు గ్రాసం తినిపిస్తున్నారు.. దేశం మొత్తం ఆధ్యాత్మిక శోభను పరుచుకునే విధంగా కృషి చేస్తున్నారు. అయోధ్యలో జనవరి 22న రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుక నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణ భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టారు.
వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాయలసీమ ప్రాంతంలోని శిల్పకళకు నెలవు అయిన లేపాక్షి లో పర్యటించారు. అక్కడి దేవాలయ ఆకృతిని చూసి అబ్బురపడ్డారు. అయితే ఆలయ అధికారులు ప్రధానమంత్రి పర్యటనను పురస్కరించుకొని ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తోలు బొమ్మలాటకు నెలవయిన ఆ ప్రాంత ఖ్యాతిని నరేంద్ర మోడీకి వివరించే ప్రయత్నం చేశారు. లేపాక్షి గర్భగుడిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆసీనులు కాగా.. రామాయణ ఇతివృత్తాన్ని తోలుబొమ్మలాట రూపంలో ఆయన ఎదుట ప్రదర్శించారు. రాముడు జన్మించిన నాటి నుంచి అయోధ్య నగరాన్ని పాలించిన ఘట్టం వరకు వివరించారు. తోలు బొమ్మలు ఆడుతుండగా వెనుక వైపు నుంచి రామాయణ శ్లోకాలను అర్చకులు ఆలపించడం మొదలుపెట్టారు.
A memorable puppet show at Lepakshi, beautifully showcasing aspects of the Ramayan. pic.twitter.com/oT5yXcQTEK
— Narendra Modi (@narendramodi) January 17, 2024
తెరమీద తోలుబొమ్మలు ఆడుతుంటే.. అర్చకులు రామాయణ శ్లోకాలు ఆలపిస్తుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన్మయత్వం చెందారు. ఆ దృశ్యాలను చూస్తూ రామనామాన్ని జపించారు. ఆ దృశ్యాలను చూస్తూ ఉప్పొంగి పోయారు. రామాయణ ఇతివృత్తం ముగిసిన తర్వాత ఇలాంటి గొప్ప ఏర్పాట్లు చేసిన అధికారులను ఆయన అభినందించారు. కాగా లేపాక్షి గర్భగుడి ఆలయంలో తోలుబొమ్మల ప్రదర్శన తాలూకూ వీడియోను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఈ తోలుబొమ్మల ప్రదర్శన తనకు ఎంతగానో నచ్చిందని రాసుకొచ్చారు. ఈ వీడియో ఇప్పటికే మిలియన్ వ్యూస్ నమోదు చేసుకుంది.
Very special moments at Lepakshi. pic.twitter.com/UEx7nsFT2j
— Narendra Modi (@narendramodi) January 16, 2024