PM Modi- Sonia Gandhi: రాజకీయాలంటే బబ్రాజమానం భజ గోవిందంగా మారి పోయిన ఈ రోజుల్లో నాయకుల్లో హుందా తనం నానాటికీ కొడి గడుతన్నది. దూషణలు, వ్యక్తిగత విమర్శలతో సభ్య సమాజానికి ఏవగింపు కలుగుతున్నది. తెలంగాణ లాంటి ప్రాంతంలో రండ, హౌలే, కిరి కిరి గాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బూతు భాష. రాజకీయ నాయకుల మధ్య పరస్పరం బదిలీ అవుతున్నది. ఇలాంటి సమయంలో రాజకీయ నాయకులు సమయమనం కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. కొన్ని చోట్ల అయితే భౌతిక దాడులకు కూడా దిగుతుండడం సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నది .

హుందాతనం కావాలి
మొన్న జి 20 అధ్యక్ష బాధ్యత భారతదేశానికి వచ్చిన తర్వాత… నరేంద్ర మోడీ అన్ని పార్టీల నాయకులతో రాష్ట్రపతి భవన్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప అందరూ హాజరయ్యారు. అందరితో నరేంద్ర మోడీ పిచ్చా పాటిగా మాట్లాడారు. వారి వద్ద నుంచి సలహాలు స్వీకరించారు. పొద్దున లేస్తే పరస్పర విమర్శ చేసుకుని, సవాళ్లు విసురుకొనే రాజకీయ నాయకులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అంటే మామూలు విషయం కాదు. కార్యకర్తలకు కూడా ఇలాంటి దృశ్యాలు కనుల విందుగా ఉంటాయి. రాజకీయాల్లో వైరాలను తగ్గిస్తాయి. కానీ ఈ దిశగా ఆలోచించేది ఎవరు? వీటిని ఆచరణ మార్గంలో పెట్టేది ఎవరు? గతంలో రాజకీయాలు బయటకు మాత్రమే పరిమితమయ్యేవి. వ్యక్తిగత సంబంధాల విషయంలో రాజకీయ నాయకులు విలువలు పాటించేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.
మోడీ శుభాకాంక్షలు తెలిపారు
రాజకీయాలు అంటే పూర్తి వ్యక్తిగత వైరంగా మారిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష నాయకురాలు శ్రీమతి సోనియాగాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. రాజకీయ నాయకుల మధ్య ఇటువంటి సుహృద్భావ వాతావరణం ఉన్నప్పుడే సమాజానికి మంచి సందేశం వెళుతుంది. అలా కాకుండా చవక బారు విమర్శలు చేస్తే ఫలితం మరోలా ఉంటుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు చాలా ప్రభావం చూపించాయి. కాంగ్రెస్ పార్టీ గుజరాత్ అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని ఉద్దేశించి చేసిన రావణాసురుడి వ్యాఖ్యలు కూడా కలకలం సృష్టించాయి. వీటిని జనంలోకి నరేంద్ర మోడీ బలంగా తీసుకుపోయారు. ఫలితంగా కాంగ్రెస్ ఓటమిపాలైంది. ఇప్పుడనే కాదు ఎప్పుడైనా కూడా రాజకీయాలనేవి ఒక వృత్తి లాగానే చూడాలి. అక్కడిదాకా ఎందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలంగాణ ఉద్యమ సమయంలో ఖమ్మం జైల్లో వేసినప్పుడు వామపక్ష పార్టీల నాయకులు కాపాడుకున్నారు. ఆయనకు అనుకూలంగా వ్యవహరించారు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక సీఎం వారిని ప్రగతి భవన్ దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. పైగా సూది, దబ్బుణం అంటూ విమర్శలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మళ్ళీ వారిని దగ్గరికి తీశారు. ఇలాంటి అవకాశవాద రాజకీయాలు అప్పటివరకు పనికొస్తాయేమో గాని… దీర్ఘ కాలంలో ఇబ్బందులు కలగజేస్తాయి.

నేటి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
శుక్రవారం పుట్టినరోజు జరుపుకుంటున్న సోనియా గాంధీ రాజస్థాన్ వెళ్లారు. ప్రస్తుతం అక్కడ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. ఈరోజు యాత్రకు విరామం ఇచ్చి తన తల్లి జన్మదిన వేడుకల్లో పాల్గొనాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లు చేశారు. కాగా నిన్న వెల్లడైన రెండు రాష్ట్రాల ఫలితాల్లో హిమాచల్ ప్రదేశ్ ను గెలుచుకున్న కాంగ్రెస్… గుజరాత్ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదానూ కోల్పోయింది. కాగా నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలుపుతూ చేసినటువంటి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఎవరు ఏమనుకున్నా… మోడీ వ్యవహరించిన తీరు బాగుంది.. రాజకీయాలు అంటే ఏవగింపు కలుగుతున్న ఈ రోజుల్లో ఒక ప్రతిపక్ష నాయకురాలుకి హుందాగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం గొప్ప విషయం. ఈ రోజుల్లో మరీ గొప్ప విషయం..