Modi- Jagan: ఏపీలో వైసీపీ సర్కారు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఒకవైపు సంక్షేమం, మరోవైపు పాలనను సమతూకం చేసుకోవడంలో వైఫల్యం చెందిందన్న అపవాదును మూటగట్టకుంది. పాలనను గాలికొదిలేసిందన్న విమర్శలను ఎదుర్కొంటోంది, రహదారులు, కాలువలు వంటి మౌలిక వసతులు కల్పించకపోవడంతో ప్రజాగ్రహం పెల్లుబికుతోంది. మరోవైపు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సమస్యల సాధన కోసం రోడ్లెక్కుతున్నారు. నెలనెలా అప్పుపుడితే కానీ పాలన చేయలేని స్థితికి జగన్ సర్కారు వచ్చింది. రాజకీయంగా కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. సొంత పార్టీలో సైతం లుకలుకలు ప్రారంభమయ్యాయి. మరో రెండేళ్ల పాలన ఎలా తీసుకెళ్లాలో తెలియక జగన్ సతమతమవుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఆశించిన స్థాయిలో సహకరించడం లేదన్న వ్యాఖ్యలు వినిపించాయి. విభజన హామీల అమలులో ఎడతెగని జాప్యం జరుగుతూ వస్తోంది. జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఏం చర్చించారో తెలపాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. వ్యక్తిగత ప్రయోజనాలకే జగన్ కేంద్ర పెద్దలను కలుస్తున్నట్టు ఆరోపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ సర్కారుకు అండగా కేంద్ర ప్రభుత్వం నిలిచింది. ప్రధాని మోదీ నుంచి బిగ్ రిలీఫ్ లభించింది. ఇటీవల జగన్ చేసిన వినతులపై కేంద్రం వేగంగా స్పందిస్తోంది. అందులో భాగంగా ఏపీకి తెలంగాణ నుంచి రావాల్సిన రూ.3441 కోట్ల విద్యుత్ బకాయిలను నెలరోజుల్లో చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

నాడు పరిష్కారానికి నోచుకోక..
రాష్ట్ర విభజన తరువాత ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ సర్కారు అధికారంలోకి వచ్చాయి. అయితే ఏపీలో కంటే తెలంగాణలో విద్యుత్ అవసరం ఎక్కువ. దీంతో విభజన చట్టంలో భాగంగా ఏపీ నుంచి తెలంగాణ డిస్కంలకు అదనంగా విద్యుత్ ను అందించారు. 2014 నుంచి 2017 వరకూ మూడేళ్ల పాటు విద్యుత్ ను సరఫరా చేశారు. అయితే నాడు కేసీఆర్ సర్కారు రూపాయి కూడా చెల్లించలేదు. అడిగి అడిగి విసిగిపోయిన చంద్రబాబు సర్కారు పంచాయితీని కేంద్రం వద్ద పెట్టింది. అయినా పరిష్కారానికి నోచుకోలేదు. నాడు కేంద్ర పెద్దలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రూ.3,441 కోట్లు బకాయిల కోసం చంద్రబాబు సర్కారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తలుపు తట్టింది. అయినా కేసు కొలిక్కి రాలేదు. పైగా ఏపీ సర్కారే తమకు రూ.5 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని..అందుకు తగ్గ లెక్కలు సైతం తమ వద్ద ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. తరువాత వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చింది. కానీ ఈ బకాయిల వసూలుపై ఆశించిన స్థాయిలో దృష్టిపెట్టలేదు. పైగా చంద్రబాబు నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ లో వేసిన పిటీషన్ సైతం వెనక్కి తీసుకుంది. దీంతో ఇంటా బయట తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. దీంతో గత ఏడాది సెప్టెంబరులో తెలంగాణ హైకోర్టులో పిల్ వేసింది.
వేగంగా స్పందించిన పీఎంవో..
అయితే ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ ప్రధాని మోదీతో పాటు విద్యుత్ శాఖ మంత్రిని కలిశారు. తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిల గురించి ప్రస్తావించారు. దీనిపై ప్రధాన మంత్రి కార్యాలయ వర్గాలు వేగంగా స్పందించాయి. ఏపీకి సంబంధించిన అంశాలపై అధికారుల కమిటీకి కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ బకాయిల వసూలకు ఆదేశాలచ్చింది. నెలరోజుల్లో బకాయి, ఫైన్ తో రూ.3,700కోట్లు చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో అనివార్య పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీ జెన్ కో తెలంగాణ డిస్కంలకు 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను సరఫరా చేసింది. 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ అందించిన విద్యుత్ కు సంబంధించి బకాయిలు ఉండిపోయాయి. నాడు చంద్రబాబు నీతి అయోగ్ సమావేశాలతో పాటు జాతీయ స్థాయిలో జరిగిన సమావేశాల్లో బకాయిల విషయం ప్రస్తావించినా న్యాయం జరగలేదు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా సరిగ్గా స్పందించలేదు. గత మూడేళ్లుగా సీఎం జగన్ అభ్యర్థిస్తున్నా పట్టించుకోలేదు. కానీ ఉన్నపలంగా ఇప్పుడు పీఎంవో వర్గాలు స్పందించడం, ఆదేశాలివ్వడం చర్చనీయాంశంగా మారింది.

గతంలో అవకాశమిచ్చినా..
అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం గతంలోనే తన వైఖరిని వెల్లడించి. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు 15 రోజుల్లోగా సమావేశమై సమస్యను కొలిక్కి తీసుకురావాలని సూచించింది. దీంతో అధికారులు సమావేశమయ్యారు. చర్చించినా ఫలితం లేకపోయింది. ఇంకా ఏపీ నుంచి తమకు రూ.500 కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ వాదించింది. దీంతో సీఎం జగన్ ప్రధాని మోదీ వద్ద ప్రస్తావించారు. విద్యుత్ శాఖ మంత్రి, ఉన్నతాధికారుల వద్ద పట్టుబట్టి మరీ వాదించారు. దాని ఫలితమే ఇప్పడుతాజాగా పీఎంవో ఆదేశాలు. అయితే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జగన్ సర్కారుకు కేంద్ర తాజా ఆదేశాలు బిగ్ రిలీఫే.
https://www.youtube.com/watch?v=5THwJgxJGv0
