Droupadi Murmu: ఎంత వయసు వచ్చినా పుట్టింటి చీర, సారె అంటే ఏ మహిళకైనా ఇష్టమే. సనాతన భారతీయ సంస్కృతిలో ఇంటి ఆడపడుచుకు చీర, సారె పెట్టడం ఆనవాయితీ. “కలకాలం నువ్వు పచ్చగా ఉండాలి. నీ కుటుంబం వెయ్యేళ్ళు వర్ధిల్లాలని” చెప్పడమే దీని ఉద్దేశం. కాకపోతే సారె, చీర పెట్టే విషయంలో ఒక్కో చోట ఒక్కో పద్ధతి ఉన్నది. ఇక నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ చేతుల మీదుగా రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ద్రౌపది ముర్ముకు కూడా పుట్టింటి నుంచి, చీర, సారె అందింది. కొత్త రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదికి ఆమె సోదరుడి సతీమణి సంథాలి తెగ వారు నేచిన నేత చీరను బహుకరించారు. ఆ చీర కట్టుకునే ద్రౌపది ప్రమాణస్వీకారం చేస్తారు. ద్రౌపది ప్రమాణ స్వీకారం కూడా అత్యంత నిరాడంబరంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ఆమె సోదరుడు తారిణి సేన్ తుడు, ఆయన సతీమణి సుక్రు తుడు, కుమార్తె ఇంటి శ్రీ, ఆమె భర్త గణేష్ మాత్రమే హాజరవుతున్నారు.
ఎన్వీ రమణ చేతుల మీదుగా
జార్ఖండ్లోని సంథాలి తెగకు చెందిన ద్రౌపది భారత దేశయూ 15వ రాష్ట్రపతిగా సోమవారం ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్ లోని సెంట్రల్ హాల్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ద్రౌపదితో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం కేంద్ర హోంశాఖ 21 గన్స్ తో సెల్యూట్ చేస్తుంది.
Also Read: Chief Justice NV Ramana: నేనూ.. రాజకీయాల్లోకి రావాలనుకున్నా.. సీజేఐ సంచలన కామెంట్స్
ప్రమాణ స్వీకారం అనంతరం ద్రౌపది జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత పదవి విరమణ చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఊరేగింపుగా పార్లమెంట్ కు చేరుకుంటారు. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి మండలి సభ్యులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, త్రివిధ దళాల అధిపతులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులు, పారా మిలిటరీ అధికారులు ఇందులో పాల్గొంటారు. ఈ క్రతువు మొత్తం పూర్తయ్యాక ద్రౌపది రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటారు. అక్కడ ఆమెకు త్రివిధ దళాలు స్వాగతం పలుకుతాయి.
నేత చీరలు,నువ్వుల అరిసెలు ఇష్టం
కుటుంబంలో వరుస విషాదాల తర్వాత ద్రౌపది నిరాడంబరంగా మారారు. కానీ సంథాలి తెగ వారు నేచే చేనేత చీరలకు మినహాయింపు ఇచ్చారు. సంథాలి తెగవారు అడవుల్లో లభించే ఒక రకమైన చెట్ల బెరడు ఆకులతో తయారు చేసిన రంగులనే ఈ చీరల తయారీకి వాడుతారు. పైగా ఈ చీరలు ఎంతో హుందాగా ఉంటాయి. అందుకే వీటిని ద్రౌపది అమితంగా ఇష్టపడతారు. ఇక నువ్వుల అరిసెలు అంటే కూడా ద్రౌపదికి మహా ప్రీతి. అందులోనూ చక్కెరకు బదులుగా బెల్లం, నువ్వులు, సేంద్రీయ విధానంలో పండించిన బియ్యంతో తయారు చేస్తారు కాబట్టి మహా ఇష్టంగా తింటారు. పైగా ఈ అరిసెలను నేతిలో కాలుస్తారు. అందువల్లే అవి అంటే ద్రౌపతికి మహాప్రీతి. ఇక ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వాళ్లను ఎదిరించిన ఘనత సంథాలి తెగవారిది. దేశం 75 ఏళ్ల స్వాతంత్ర ఉత్సవాలను జరుపుకుంటున్న నేపథ్యంలో.. తమ జాతి బిడ్డ ఈరోజు దేశ అత్యున్నత పదవిని అలంకరిస్తున్నందుకు సంథాలి తెగవారు మహా ఆనంద పడుతున్నారు.
Also Read:PM Modi- Opposition: విపక్షాల వీక్‌నెస్సే.. మోదీ స్ట్రెంత్!