Homeజాతీయ వార్తలుPrayagraj: కాలుష్యాన్ని పారదోలిన యోగి మియావాకీ మంత్రం.. దేశమంతా చేస్తే ‘ఊపిరి’ పీల్చుకోవచ్చు

Prayagraj: కాలుష్యాన్ని పారదోలిన యోగి మియావాకీ మంత్రం.. దేశమంతా చేస్తే ‘ఊపిరి’ పీల్చుకోవచ్చు

Prayagraj: రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతుకు మించి సహకారాన్ని అందిస్తోంది. దీంతో వసతి సౌకర్యాలు మెరుగ్గా ఉండడంతో భక్తులు కూడా వ్యయ ప్రయాసలకు ఏమాత్రం లెక్కచేయకుండా వస్తున్నారు. మహా కుంభమేళకు 45 కోట్ల మంది వస్తారని అంచనా వేశారు. రెండు లక్షల కోట్ల వరకు ఆదాయం వస్తుందని లెక్క కట్టారు. ఆ స్థాయిలో సాధ్యమవుతుందా? అనే ప్రశ్నను కాస్త పక్కన పెడితే.. ఆ స్థాయిలో జనం వస్తే కాలుష్యం సంగతి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది. మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో జపనీస్ సాంకేతిక పరిజ్ఞానం వల్లే కాలుష్యం పెరగలేదు. పరిస్థితి చేయి దాటి పోలేదు.. మహా కుంభమేళాను దృష్టిలో పెట్టుకొని ఉత్తర ప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం రెండు సంవత్సరాల నుంచి యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. ప్రయాగ్ రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ (prayagraj municipal corporation) ఆధ్వర్యంలో మియా వాకి (Miyavaki) అనే జపనీస్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చిట్టడవులు పెంచడం మొదలుపెట్టింది. ఈ ప్రాంతంలో దాదాపు 18.5 ఎకరాల ఖాళీ స్థలాలలో ఐదు లక్షలకు పైగా మొక్కలు నాటింది. ఇందులో 63 రకాల మొక్కలను నాటారు. దీనికోసం దాదాపు 6 కోట్ల వరకు ఖర్చు చేశారు.

ఆక్సిజన్ అందిస్తున్నాయి

మియావాకి అనేది జపనీస్ సాంకేతిక పరిజ్ఞానం. అంటే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు పెంచడం.. జపాన్లో భూమి లభ్యత తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు పెంచుతారు. ఈ విధానానికి మియా వాకి అనే పేరు పెట్టారు. ఈ విధానంలో పెరిగిన మొక్కలు వాతావరణంలోకి ఎక్కువగా ఆక్సిజన్ పంపిచేస్తాయి. తక్కువ ప్రదేశంలో ఇలా ఎక్కువ మొక్కలను నాటడాన్ని జపాన్ దేశానికి చెందిన అకిరా మియావాకి అనే వృక్ష శాస్త్రవేత్త అభివృద్ధి చేశాడు.. ఇక ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో పెంచిన మొక్కల్లో మర్రి, రావి, వేప, చింత, రేగు, ఉసిరి, వెదురు వంటి రకాలు ఉన్నాయి. వీటిని ఏపుగా పెంచే బాధ్యతను.. యోగి ప్రభుత్వం ఓ ప్రైవేటు ఏజెన్సీకి ఇచ్చింది. ఆ మొక్కలు కూడా ఏపుగా పెరగడంతో గాల్లోకి ఎక్కువగా ఆక్సిజన్ పంప్ అవుతోంది. అందువల్లే ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో ఆ స్థాయిలో భక్తులు వస్తున్నప్పటికీ కాలుష్యం అనేది కనిపించడం లేదు. ఇక ప్రయాగ్ రాజ్ నమూనాను.. మనదేశంలోని నగరాలు, పట్టణాలు, ఒక మోస్తరు జన సామర్థ్యం ఉన్న ప్రాంతాలు కచ్చితంగా అమలు చేస్తే కాలుష్యాన్ని కొంతలో కొంత తగ్గించుకోవచ్చు. పైన పేర్కొన్న ప్రాంతాలలో భారీగానే ఖాళీ స్థలాలు ఉన్నాయి. ప్రభుత్వ భూములకు ఇక్కడ కొదవలేదు. హార్టికల్చర్, అర్బన్ ఫారెస్ట్ వంటి విభాగాలు కూడా ఈ ప్రాంతాలలో ఉన్నాయి.. పైగా మునిసిపాలిటీలకు బడ్జెట్లో కూడా భారీగానే ఉన్నాయి.. జస్ట్ ఆరుకోట్లను అత్యంత సులభంగా ఖర్చు చేసే సామర్థ్యం ఉంది. ఇక నగర పాలకాలకైతే అసలు ఇది ఖర్చే కాదు. ఇంతటి బృహత్ సంకల్పానికి కావాల్సింది కేవలం చిత్తశుద్ధి మాత్రమే. మూసి సుందరీకరణ కోసం.. వేల కోట్లు ఖర్చు చేసే బదులు.. మూసికి అటు ఇటు వేలాది మొక్కలు నాటి.. ఇదే మియా వాకి విధానంలో పెంచి.. మూసీ నదిలోకి వ్యర్ధాలు రాకుండా అడ్డుకోగలిగి.. అత్యంత భారీ సామర్థ్యం ఉన్న ఎస్టిపి యూనిట్లు ఏర్పాటు చేయగలిగితే.. ప్రభుత్వంపై భారం తగ్గుతుంది.. తక్కువ మొత్తంలో కాలుష్య నివారణ సాధ్యమవుతుంది.. ఎలాగూ మన ప్రభుత్వ పెద్దలు సియోల్ దాకా వెళ్ళొచ్చారు కదా.. ఒకసారి ప్రయాగ్ రాజ్ వెళ్లి వస్తే.. ఇంకా బాగుంటుంది.. చిట్టడువులను చూసి రావచ్చు.. మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించవచ్చు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular