Jagan Mohan Reddy: జగన్ కి పీకే షాక్

ప్రశాంత్ కిషోర్ వైసీపీకి పని చేశారు. వైసీపీ అధికారంలోకి రావడానికి ఆయన ఒక కారణం. పీకే సైతం వైసీపీ శ్రేణులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారు సైతం పీకే వ్యూహాలను ఇష్టపడతారు.

Written By: Dharma, Updated On : March 4, 2024 1:48 pm

Prashant Kishor shock to CM Jagan

Follow us on

Jagan Mohan Reddy: వైసీపీకి ఉన్న ఇబ్బందులు చాలా ఉన్నట్టు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) రూపంలో కొత్త సమస్య వచ్చి పడింది. వచ్చే ఎన్నికల్లో జగన్ కు భారీ ఓటమి ఖాయమని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పారు. జాతీయ మీడియా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పీకే సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కెసిఆర్ కు ఎదురైన ఓటమి జగన్(Jagan) కు కూడా తప్పదని విశ్లేషించారు. అక్కడ నిరుద్యోగుల నుంచి ఎదురైన వ్యతిరేకత.. ఏపీలో కూడా స్పష్టంగా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే పార్టీ నుంచి నేతలు వీడడం, మరోవైపు వివేక హత్య కేసు విషయంలో ఆయన కుమార్తె సునీత ప్రజాక్షేత్రంలోకి రావడం, మరోవైపు వైయస్ షర్మిల రూపంలో వ్యతిరేక ప్రచారం ఎక్కువ కావడం.. ఇటువంటి పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ జోష్యం చెప్పడం వైసిపి శ్రేణులకు మింగుడు పడడం లేదు.

గతంలో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి పని చేశారు. వైసీపీ అధికారంలోకి రావడానికి ఆయన ఒక కారణం. పీకే సైతం వైసీపీ శ్రేణులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారు సైతం పీకే వ్యూహాలను ఇష్టపడతారు. అటువంటి వైసీపీ నేతలకు ఇప్పుడు పీకే మాటలు రుచించడం లేదు. పీకే కామెంట్స్ తర్వాత వైసిపి నేతలు ఒక్కొక్కరు బయటకు వస్తూ ప్రశాంత్ కిషోర్ పై విమర్శలు చేస్తున్నారు. హై కమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మీడియాతో పాటు సోషల్ మీడియాలో అనేక రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే పీకే మాటలు మాత్రం వారిని భయపెడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్న సమయంలో పీకే చేసిన వ్యాఖ్యలు గుబులు పుట్టిస్తున్నాయి.

తెలంగాణలో కెసిఆర్ ఓటమికి నిరుద్యోగ సమస్య ఒక కారణం. అభివృద్ధిని గుర్తించిన ప్రాంతాల్లో కెసిఆర్ కు తెలంగాణ ప్రజలు గెలిపించారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కెసిఆర్ ను వ్యతిరేకించారు. ఏపీలో కూడా అదే పరిస్థితి ఉంటుందని పీకే అంచనా వేశారు. రాష్ట్రంలో అభివృద్ధి లేకపోగా నిరుద్యోగ సమస్య ఎక్కువైంది. నవరత్నాల్లో భాగంగా జగన్ ఇచ్చిన ఏటా ఉద్యోగ క్యాలెండర్ హామీ గాలిలో కలిసిపోయింది. ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని వైసీపీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. కానీ సంక్షేమ పథకాలతో వాటన్నింటినీ అధిగమిస్తామని జగన్ భావిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. మరోవైపు రాజకీయ ప్రత్యర్థులంతా ఏకమవుతున్నారు. అటు జగన్ సొంత కుటుంబం సైతం ఈసారి వ్యతిరేకిస్తోంది. వైయస్ సునీత అయితే నేరుగా వైసీపీకి ఓటు వేయొద్దని పిలుపునిస్తున్నారు. తన తండ్రి హత్య కేసులో జగన్ చూపిన వైఖరిని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటివరకు జగన్ నిరుద్యోగ సమస్యకు సంబంధించి దృష్టి పెట్టలేదు. కేవలం సచివాలయ ఉద్యోగులను మాత్రమే భర్తీ చేశారు. అటు పరిశ్రమల స్థాపనలో కూడా ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. ఉన్న పరిశ్రమలను సైతం తరిమేశారన్న విమర్శ ఉంది. నిరుద్యోగ సమస్య స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ నిరుద్యోగ సమస్యను టార్గెట్ చేసుకుంటూ మాట్లాడారు. ఆయన చంద్రబాబు ట్రాప్ లో పడి ఈ ప్రకటన చేశారని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. అదే సమయంలో సమస్య ఉందని సైతం గుర్తిస్తున్నారు. వైసీపీలోని ప్రధాన లోపాలను ప్రశాంత్ కిషోర్ టార్గెట్ చేసుకోవడం విశేషం. తెలుగుదేశం పార్టీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఎన్నికల్లోపు ప్రశాంత్ కిషోర్ మరిన్ని ప్రకటనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి దోహద పడిన ప్రశాంత్ కిషోర్.. ఈసారి జగన్ ను ఎలాగైనా గద్దె దించాలన్న కృత నిశ్చయంతో కనిపిస్తున్నట్టు ఉన్నారు. దీంతో వైసిపి శ్రేణులు ప్రశాంత్ కిషోర్ అంటే మండిపడుతున్నాయి. అదే స్థాయిలో భయపడుతున్నాయి.