Prashant Kishore Fees: అతని పేరు ప్రశాంత్ కిషోర్. పేరుపొందిన రాజకీయ వ్యూహకర్త. మనదేశంలో రాజకీయాలను కూడా కార్పొరేట్ మయం చేసిన వ్యక్తి. పైగా ఎలాంటి రాజకీయాలు చేయాలో.. ఎలాంటి రాజకీయాలు చేస్తే ఓట్లు పడతాయో.. ఒక స్ట్రాటజీ మాదిరిగా అతను చెప్పేవాడు. మనదేశంలో ఉన్న మెజారిటీ రాజకీయ పార్టీలకు అతడు పని చేశాడు. అయితే ఎక్కువసార్లు అతడి ప్రణాళికలు విజయవంతమై.. అతడు పని చేసిన రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఏపీలో వైసిపి, టిడిపి, కేంద్రంలో బిజెపి, ఒకానొక సందర్భంలో భారత రాష్ట్ర సమితి, టిఎంసి.. ఇలా అనేక రాజకీయ పార్టీలు అతడి ప్రణాళికలను అమలు చేసి అధికారంలోకి వచ్చాయి. ఎవరికో సేవలు చేసి.. అధికారంలోకి తీసుకొచ్చే బదులు.. తనే ఒక రాజకీయ పార్టీని పెట్టాలని ప్రశాంత్ కిషోర్ అనుకున్నాడు. అనుకున్నది తడవుగా జన్ సూరజ్ పేరుతో పార్టీ ని ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఆ పార్టీ బీహార్ రాష్ట్రంలో పోటీ చేస్తోంది.
ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రశాంత్ కిషోర్ పార్టీ బీహార్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ముఖ్య పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోందని తెలిపింది.. అందువల్లే ప్రశాంత్ కిషోర్ వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీని.. ప్రతిపక్ష పార్టీని తనదైన వ్యూహాలతో ఇబ్బంది పెడుతున్నారు. గతంలో ఈ పార్టీలతో పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ తనదైన చాకచక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.. ఏమాత్రం అవకాశం దొరికినా చాలు రెచ్చిపోతున్నారు. తను ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు గానీ.. బీహార్ రాష్ట్ర అభివృద్ధిని మాత్రం విస్మరించేది లేదని ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు..
రాజకీయ వ్యూహ కర్తగా పేరుపొందిన ప్రశాంత్ కిషోర్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తాను ఎదుర్కొన్న రాజకీయపరమైన విషయాలను మొహమాటం లేకుండా చెబుతున్నారు. 2021 నుంచి ఇప్పటివరకు కన్సల్టెన్సీ సేవల ద్వారా తాను 241 కోట్లు సంపాదించాలని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. వీటిలో 30.95 కోట్లు జీఎస్టీ రూపంలో.. 20 కోట్లు ఐటి రూపంలో చెల్లించినట్టు పేర్కొన్నారు. 98.75 కోట్లను పార్టీకి డొనేషన్ రూపంలో ఇచ్చినట్టు వెల్లడించారు.
ఓ సందర్భంలో తన నైపుణ్యాన్ని అనుభవాన్ని ఉపయోగించి రెండు గంటలకు 11 కోట్లు తీసుకున్నట్టు ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.. ” రాజకీయాలు , వ్యాపారం వేరువేరు కాదు. ఒక వ్యాపారి ముందస్తు లాభాలను గురించి పెట్టుబడి పెడుతుంటాడు. జనాల అవసరాలకు తగ్గట్టుగా నడుచుకుంటాడు. రాజకీయ పార్టీలు కూడా అంతే. జనాల అవసరాల ఆధారంగా హామీలు ఇస్తుంటాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయడంలో షరతులు విధిస్తుంటాయి. ఎన్నికల్లో చేసిన ఖర్చుకు మించి సంపాదిస్తుంటాయి. అయితే ఇందులో వ్యూహాత్మకతను పాటించే రాజకీయ పార్టీకి మాత్రమే అధికారం దక్కుతుందని” ప్రశాంత్ కిషోర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.