Prashant kishor: అనుకున్నదే అయింది. కాంగ్రెస్ కు పెద్ద షాకే తగిలింది. ఇన్నాళ్లు ఊరిస్తూ వచ్చిన పీకే చేరిక ఇక లేదని తేలిపోయింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలో పడ్డారు. ఇప్పటి దాకా తమ పార్టీకి పీకే వ్యూహాలు పనిచేస్తాయి. రాబోయే కాలంలో తామే చక్రం తిప్పుతామని భావించినా అదంతా వట్టిదే అని తేలిపోయింది. దీంతో ఇక కాంగ్రెస్ కు దిక్కు లేకుండా పోయింది. వచ్చే ఎన్నికల్లో పార్టీ భవితవ్యం డోలాయమానంలో పడనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఏం నిర్ణయాలు తీసుకుంటుందో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
గత కొద్ది రోజులుగా అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి పార్టీలో తీసుకోబోయే చర్యల గురించి కూడా చర్చించారు. పీకే సూచించిన సలహాలు, సూచనలు పాటించేందుకు కాంగ్రెస్ కూడా ముందుకు వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరి మరే పార్టీకి సేవలు అందించరాదని పీకేకు షరతు విధించడంతో ఆయన ససేమిరా అన్నారు. దీంతో నే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి కాంగ్రెస్ తో పని చేయలేనని పీకే తెగేసి చెప్పినట్లు సమాచారం.
Also Read: TS Police Jobs: తెలంగాణ ఎట్టకేలకు కానిస్టేబుళ్ల నోటిఫికేషన్ విడుదల
మరోవైపు తెలంగాణలో టీఆర్ఎస్ కోసం తన ఐ ప్యాడ్ సేవలు అందుబాటులో ఉంటాయని పీకే చెప్పడంతో కాంగ్రెస్ నేతలు ఒప్పుకోలేదని తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ తో ఇక పనిచేయడం వీలు కాదని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇక టీఆర్ఎస్ కు మార్గం సుగమం అయినట్లే. ఇన్ని రోజులు టీఆర్ఎస్ నేతలు సైతం తమకు పీకే సేవలు అందుతాయా? లేదా అన్నదే అనుమానంగా ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకున్న క్రమంలో ఇక పీకే సేవలు టీఆర్ఎస్ కు పూర్తిస్థాయిలో అందుతాయని నమ్ముతున్నారు.
ఇన్నాళ్లు దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా తాము రంగంలోకి దిగుతామని ప్రకటించిన పీకే చివరి క్షణంలో మనసు మార్చుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి సమస్యలే ఎదురు కానున్నాయి. మునిగిపోయే నావను ఆపేదెవరు? కాంగ్రెస్ పార్టీని ఆదుకునేదెవరు? అనే సంశయాలు అందరిలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ బతికి బట్టకట్టాలంటే ఎవరో రావాలి? ఏదో చేయాలి? అనే కోణంలోనే అందరు ఆలోచిస్తున్నారు. భవిష్యత్ లో పార్టీని ముందుండి నడిపించే వారి కోసమే నేతలు ఎదురుచూస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ కథ కంచికి చేరినట్లేనని తెలుస్తోంది.