Most Beautiful Handwriting: విద్యార్థులకు చదవడం ఎంత ముఖ్యమో.. చేతిరాత కూడా అంతే ముఖ్యమైనది. అందమైన చేతి రాత ఉంటే..వారు అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ఐతే ప్రతి వ్యక్తి చేతిరాత శైలి భిన్నంగా ఉంటుంది. కొందరు విద్యార్థులు బాగా చదువుతారు. కానీ చేతిరాత అంతబాగుండదు. మరికొందరు చేతిరాత అద్భుతంగా ఉంటుంది. కానీ చదువు మాత్రం అంతంతే ఉంటుంది. ఇక కొంతమంది చేతిరాత ఆధారంగా వ్యక్తుల ఆత్మవిశ్వాసం, బలాలు, బలహీనతలు, జాతకాలు కూడా అంచనా వేస్తుంటారు. అంతలా చేతిరాత ప్రభావితం చేస్తుంది.
ప్రపంచంలో అందమైన చేతిరాత..
ఈ క్రమంలో మరి ప్రపంచంలోనే అత్యంత అందమైన చేతిరాత నేపాల్‌కు చెందిన ఓ స్కూల్ విద్యార్థినిదిగా గుర్తింపు పొందింది. ప్రకృతి మల్లా అనే విద్యార్థిని తన అందమైన చేతిరాతతో వార్తల్లో నిలిచింది. ప్రకృతి వయసు 16 ఏళ్లు. 14 ఏళ్ల వయసులో నేపాల్‌లోని సైనిక్ వాస్య మహావిద్యాలయంలో 10వ తరగతి చదివింది. ప్రకృతి మల్లా చేతిరాత ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు..
ప్రకృతి మల్లా చేతిరాతకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకృతి చేతిరాత ఫొటోలకు నెటిజన్లు లైక్‌లు, కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు చేతిరాత నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఆమె పేపర్‌పై రాస్తే.. కంప్యూటర్‌లో టైప్ చేస్తున్నట్లుగా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కంప్యూటర్ కంటే అందంగా రాస్తుందని ప్రశంసిస్తున్నారు.
నిపుణుల మాట ఇలా..
ప్రకృతి చేతిరాతలో ప్రతి అక్షరం మధ్య గ్యాప్ సమానంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆమె చేతిరాత ఇప్పుడు నేపాల్‌లోనే కాకుండా మొత్తం ప్రపంచంలోనే ఉత్తమమైనదిగా నిలిచింది. ప్రకృతి మల్లా చేతిరాతకు నేపాల్ ప్రభుత్వం నుంచి కూడా గుర్తింపు లభించింది. తన అద్భుతమైన చేతిరాతకు గాను.. నేపాల్ సాయుధ దళాల నుంచి అవార్డును కూడా అందుకుంది ప్రకృతి మల్లా.