‘ప్రకాష్ రాజ్..’ భారతీయ చిత్రపరిశ్రమలో అద్భుతమైన నటుడు. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల అరుదైన నటుడు. అంతేకాదు.. ఆయన గొప్ప మానవతావాది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గౌరీలంకేష్ వంటి నిఖార్సైన జర్నలిస్టును దారుణ హత్య చేసిన మూకలకు వ్యతిరేకంగా గళం వినిపించారు. అప్పటి నుంచి అన్యాయాన్ని ధీటుగా ఎదుర్కొంటూ వచ్చారు.
ప్రధానంగా మతతత్వ రాజకీయాలకు ఆయన వ్యతిరేకం. మతం పేరుతో దేశ ప్రజలను విడదీయడానికి తాను వ్యతిరేకం అంటారు. ఈ నినాదం ఎత్తుకున్నందుకే గౌరీలంకేష్ ను హత్యచేశారనే వాదన ఉంది. అప్పటి వరకూ పెద్దగా రాజకీయాలపై ప్రకాష్ రాజ్ ఫోకస్ చేసింది లేదు. కానీ.. గౌరీలంకేష్ హత్య తర్వాత రాజకీయ తెరపైకి వచ్చేశారు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని బలంగా వినిపించారు.
ఇంటర్వ్యూల ద్వారా.. మీటింగుల ద్వారా.. ఇతర చర్చా వేదికల ద్వారా.. అన్యాయానికి వ్యతిరేకంగా గళం వినిపించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఎవరు చేసినా విమర్శలు చేస్తూ వచ్చారు. అలాంటి ప్రకాష్ రాజ్ కొంత కాలంగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోవడాన్ని గమనించవచ్చు. సరిగ్గా చెప్పాలంటే.. 2019 ఎన్నికల ముందు వరకూ ఆయన సినిమాలతోపాటు పాలిటిక్స్ లోనూ యాక్టివ్ గా ఉన్నట్టే కనిపించారు. దీంతో.. ప్రకాష్ రాజ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేసినట్టేనని అనుకున్నారు అంతా. కానీ.. ఉన్నట్టుండి మౌనం వహించారు.
దీనికి కారణమేంటని ఆలోచిస్తే.. ఒకే ఒక రీజన్ కనిపిస్తోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కానీ.. ఆయన ఓడిపోయారు. దీంతో.. ప్రజల మనస్తత్వం ఆయనకు బాగా అర్థమైనట్టుంది. డబ్బు, కులాలు, మతాల ప్రాతిపదికన సాగే ఈ రాజకీయాలు తనకు సరిపడవని భావించారని, అందువల్లే వాటికి దూరంగా ఉంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నిజానికి.. ప్రతీ అంశంపైనా విషయ పరిజ్ఞానంతో మాట్లాడుతారు ప్రకాష్ రాజ్. ఏదో కావాలని చేసే రాజకీయ విమర్శలు కాకుండా.. లోతైన విశ్లేషణ చేస్తారు. పద్ధతిగా చర్చ చేస్తారు. అలాంటి వ్యక్తి రాజకీయాలకు దూరంగా ఉండడంపై కర్నాటకలో చర్చనీయాంశమైంది.