https://oktelugu.com/

Prakasam YCP: వైసీపీలో ప్రకంపనలు.. ఆ ఇద్దరు నేతలే టార్గెట్

వైసిపి ఆవిర్భావం నుంచి నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచాయి. నెల్లూరులో అయితే అన్ని స్థానాలను వైసీపీ స్వీప్ చేసింది. తెలుగుదేశం పార్టీని దారుణంగా దెబ్బతీసింది.

Written By:
  • Dharma
  • , Updated On : October 18, 2023 / 04:02 PM IST

    YCP

    Follow us on

    Prakasam YCP: వైసీపీలో ఇప్పుడు ప్రకాశం జిల్లా గుబులు రేపుతోంది. నెల్లూరులో వచ్చిన కల్లోలం అందరికీ తెలిసిందే. ఆ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. కొరకరాని కొయ్యలుగా మారారు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో సైతం ఇద్దరు సీనియర్లు పార్టీపై రగిలిపోతున్నారు. తమను పొమ్మన లేక పొగ పెడుతున్నారని గ్రహించి పావులు కదుపుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం గట్టి ప్రణాళిక వేస్తున్నారు. ప్రత్యర్థుల ఎత్తులను గమనించి రాజకీయ వ్యూహాలు రూపొందించుకుంటున్నారు.

    వైసిపి ఆవిర్భావం నుంచి నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచాయి. నెల్లూరులో అయితే అన్ని స్థానాలను వైసీపీ స్వీప్ చేసింది. తెలుగుదేశం పార్టీని దారుణంగా దెబ్బతీసింది. అయితే అంతటి విజయాన్ని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి తనంతట తానుగా నీరుగార్చుతూ వస్తోంది. ఇప్పటికే సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మరో ఎమ్మెల్యే ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు. మరికొందరు నాయకులు సైతం పక్క చూపులు చూస్తున్నారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఇప్పుడున్న వైసీపీ నేతల్లో సైతం గ్రూపుల గొడవ నడుస్తోంది. దీంతో గత ఎన్నికల మాదిరిగా వైసీపీకి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం లేదని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

    సరిగ్గా ఇటువంటి తరుణంలోనే ప్రకాశం జిల్లాలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి, బాలిలేని శ్రీనివాస్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మన్న రీతిలో పరిస్థితి ఉంది. ఒకప్పుడు వైవి సుబ్బారెడ్డి తో కలిసి మాగుంట శ్రీనివాస్ రెడ్డి పై బాలినేని కుట్రలు చేశారన్న కామెంట్స్ ఉండేవి. ఇప్పుడు అదే బాలినేని మాగుంటతో జత కట్టారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డి తన కొడుకుకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నారు. కానీ అనూహ్యంగా ఆయన జైలుకెళ్లారు. ఆ సమయంలో వైసీపీ నుంచి కానీ.. జగన్ నుంచి కానీ కనీస సపోర్టు రాలేదని మాగుంట బాధపడుతున్నారు. కానీ ఆ విషయాన్ని ఎప్పుడూ బయట పెట్టలేదు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు పోటీ చేస్తారని చెబుతున్నారు. జగన్ టికెట్ హామీ ఇచ్చారో లేదో కానీ… బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎంపీగా మాగుంట కుమారుడు పోటీ చేస్తారని ప్రకటించారు. ముందు నీకు టికెట్ వస్తుందో లేదో చూసుకో అని బాలినేని పై వైవి అనుచరులు సెటైర్లు వేస్తున్నారు. దీంతో బాలినేని వెనుక తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు పెరుగుతున్నాయి.

    ఇప్పటికే ఎంపీ మాగుంట, మాజీ మంత్రి బాలినేని అనుచరులను పార్టీ నుంచి బయటకు పంపేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ ఇద్దరి నేతలకు అనుచరులు ఉన్నారు. వారంతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అంటూ సస్పెన్షన్ వేటు వేశారు. దీని వెనుక వైవి సుబ్బారెడ్డి ఉన్నారని ఇద్దరు నేతలు అనుమానిస్తున్నారు. అటు నాయకత్వం సైతం ఈ ఇద్దరు నేతలు విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిందని.. మీరు పార్టీ నుంచి బయటకు వెళ్లినా ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేసుకోగలమని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే నెల్లూరు మాదిరిగానే ప్రకాశం జిల్లాలో సైతం వైసీపీలో నివురు గప్పిన నిప్పులా పరిస్థితి మారింది.