Power Charges AP: లేదు లేదంటూనే ఏపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీల మోత మోగించింది. వినియోగదారులకు షాక్ ఇచ్చేలా గత నెలకు రెట్టింపు బిల్లులు చేతిలో పెడుతోంది. దీంతో నడివేసవి ఠారెత్తిస్తున్న ఎండలు ఒకవైపు.. విద్యుత్ చార్జీలు మరోవైపు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జగనన్న ఎడాపెడా బాదుడుతో ప్రజలు విల్లవిల్లాడిపోతున్నారు. వాస్తవానికి విద్యుత్ చార్జీలు పెంచాలని విద్యుత్ నియంత్రణ మండలి ఎప్పుడో ప్రభుత్వానికి సూచించాయి. కొత్త టారిఫ్ లను సైతం సిఫారసు చేశాయి. అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందన్న భావనతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అసలు అటువంటి ప్రతిపాదనలేవీ అందలేదని సైతం మంత్రులు ప్రకటించారు. కానీ అందుకు విరుద్ధంగా 2022-23 కొత్త టారిఫ్ అమలు చేయడం మొదలైపోయింది.
గత నెలలో వచ్చిన బిల్లుకూ.. ఈ నెలలో వచ్చిన బిల్లుకూ మధ్య తేడాను గమనించినవారికి.. ఒకరు చెప్పకుండానే విద్యుత్ చార్జీలు పెంచిన విషయం అర్ధమైపోతోంది. రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలికి (ఏపీఈఆర్‌సీ) రాష్ట్ర ఇంధన పంపిణీ సంస్థలు(డిస్కమ్) వార్షిక ఆదాయ వ్యయ నివేదికలు(ఏఆర్‌ఆర్) సమర్పించినప్పుడు.. 2022 జూలై వరకూ 2021-22 టారి్‌ఫనే కొనసాగిస్తామని.. 2022 ఆగస్టు నుంచి 2023 మార్చి 31 వరకూ 2022-23 టారి్‌ఫను అమలు చేస్తామని నివేదించాయి. ఈ నివేదికలను పట్టుకుని ఏపీఈఆర్‌సీ… ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది.
Also Read: AP Debts: ఏపీ అప్పుల తప్పుడు లెక్కలపై కేంద్రం సీరియస్.. ఆ ఇద్దరు అధికారులపై చర్యలు తప్పవా?
కానీ..కొత్త టారిఫ్ ఆర్డర్‌ను తిరుపతిలో వెల్లడించినప్పుడు.. 2022-23 వార్షిక టారిఫ్ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమలులోనికి వస్తుందని ఈఆర్‌సీ ప్రకటించింది. డిస్కమ్‌ల ప్రతిపాదనలకు భిన్నంగా.. వినియోగదారులకు వ్యతిరేకంగా ఈఆర్‌సీ నిర్ణయం తీసుకోవడంపై విద్యుత్తురంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేశారు. ఇలా ఎలా చేస్తుందంటూ ఇంధనరంగ నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు. ఏఆర్‌ఆర్‌లను సమర్పించిన సమయంలో వినియోగదారులపై చార్జీల భారం తగ్గించేందుకే.. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కాకుండా ఆగస్టు నుంచి కొత్త విద్యుత్తు టారి్‌ఫను అమలు చేస్తామని డిస్కమ్‌లు వెల్లడించాయి. దీంతో.. ఆగస్టు నుంచే కొత్త టారిఫ్ అమలులోకి వస్తుందని వినియోగదారులు భావించారు. కానీ.. ఏప్రిల్ నెల బిల్లుతోనే కొత్త టారిఫ్ బాదుడు మొదలైపోయింది.
పేదరికం స్థాయి తగ్గింపు
నెలకు 30 యూనిట్లలోపు విద్యుత్తును వాడేవారిని పేదలుగా డిస్కమ్‌లు పరిగణించాయి. గతంలో 75 యూనిట్ల వరకు ఒకే శ్లాబుగా భావించేవారు. దానిని తాజాగా రెండు శ్లాబులు చేశారు. తొలి 30 యూనిట్లకు ఇప్పటివరకు వసూలు చేసిన యూనిట్ రూ.1.45ను ఏకంగా రూ.1.90చేశారు. అంటే పేదవాడిపైనా నెలకు అదనంగా రూ.13.50 భారం మోపారు. 31 నుంచి 75 యూనిట్ల దాకా .. రూ.2.09గా ఉన్న భారాన్ని యూనిట్‌కు రూ.3కు పెంచారు. దీనివల్ల అదనపు భారం రూ.27.30. నిజానికి, దశాబ్దాలుగా మొదటి శ్లాబును పెంచేందుకు ఏ ప్రభుత్వాలూ సాహసించలేకపోయాయి. జగన్ సర్కారే ఆ సాహసానికి ఒడిగట్టింది. లేదు లేదంటూ నమ్మించి అమలు చేస్తోంది. 76 నుంచి 125 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.3.10 నుంచి రూ.4.50కు పెంచారు. ఈ స్లాబ్ వినియోగదారులపై పడిన భారం రూ.42. వేసవిలో ఫ్యాన్లు, ఏసీలు అత్యధికంగా వాడుతుండడంతో.. సగటు వినియోగం 226 నుంచి 400 యూనిట్ల మధ్యలోకి వెళ్లిపోయింది. వినియోగదారులు ఈ స్థాయి వాడకానికి గతంలో రూ.1328 కట్టేవారు. ఇప్పుడది రూ.1531కి పెరిగిపోయింది. అంటే రూ.203 అదనంగా బాదారన్నమాట. ప్రభుత్వ మోసం పేద, సామాన్యవర్గాలకు అంతు పట్టడం లేదు కానీ మధ్యతరగతి ప్రజలు మాత్రం పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు.
కొనుగోలు భారం ప్రజలపైనే..
మూలిగే నక్కపై తాటిపండు చందంగా ఇప్పటికే రెట్టింపైన విద్యుత్ చార్జీలతో ఇబ్బందిపడుతున్న వినియోగదారులపై మరో బాదుడుకు జగన్ సర్కారు సిద్ధమైంది. తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రజలపై భారం మోపాలని నిర్ణయించింది. ప్రజలకు విద్యుత్ కష్టాలు తేబోమని.. బహిరంగ మార్కెట్లో ఎంత ధరకైనా కొనుగోలు చేసేందుకు సిద్ధమేనని సీఎం జగన్ ప్రకటించారు. అయితే దీని వెనుక కూడా పెద్ద స్కెచ్ నడిచినట్టు తెలుస్తోంది. కానీ.. ఇలా అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేస్తున్న విద్యుత్తు భారాన్నంతటినీ.. తిరిగి వినియోగదారుల నుంచి ట్రూఅప్ చార్జీల పేరిట వసూలు చేస్తామని చెప్పకుండా దాచేశారు. ఈ ఏడాది మార్చిలో 1268.69 మిలియన్ యూనిట్లను రూ.1123.74 కోట్లకు కొనుగోలు చేశామని ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఏప్రిల్‌లో 1047.78 మిలియన్ యూనిట్లు రూ.1022.42 కోట్లు పెట్టి కొన్నామని చెప్పారు. అంటే..ఈ రెండు నెలలకే వినియోగదారులపై రూ.2,166 కోట్లమేర భారం పడనుందన్నమాట. పవర్ ఎక్ఛ్సేంజీలో అధిక ధరకు కరెంటు కొంటున్న ప్రభుత్వం ఈ మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేయబోమంటూ హామీ ఇవ్వడం లేదు.