Powell Speech: తయారీ రంగంలో చైనా తోపు కావచ్చు. ప్రపంచానికి పెద్దన్న కావాలని ఆశపడుతుండొచ్చు. కానీ ఇప్పటికీ ప్రపంచాన్ని శాసించేది అమెరికానే. అక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఆ ప్రభావం ప్రపంచం మీద ఉంటుంది. ఇప్పటికీ ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ముంగిట ఉంది. ధరల పెరుగుదల కనివిని ఎరుగని స్థాయిలో ఉంది. ఇందుకు అమెరికా కూడా మినహాయింపు కాదు. అందులో భాగంగానే రకరకాల ఉద్దీపన చర్యలు అక్కడి ఫెడరల్ బ్యాంక్ తీసుకుంటున్నది. ఆ ఫెడరల్ బ్యాంకు నిర్ణయాల వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ప్రస్తుతం మన దేశ కరెన్సీ జీవితకాల కనిష్ఠాన్ని ఎదుర్కొంటున్నదంటే అందుకు కారణం ఇదే.

మరోసారి వడ్డీరేట్ల పెంపు
క్షీణిస్తున్న దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లు పెంచుకుంటూ వస్తోంది. ఫలితంగా ఆయా దేశాల్లో పెట్టుబడులు పెట్టిన అమెరికా పెట్టుబడిదారులు తమ నగదు నిల్వలను ఉపసంహరించుకుంటున్నారు. దీనివల్ల ఆయా దేశాల్లో విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నాయి. ఈ ప్రభావం అంతిమంగా ఆ దేశ కరెన్సీ ల మీద పడుతున్నది. ఇండియా నుంచి ఇంగ్లాండ్ దాకా ప్రస్తుతం అన్ని దేశాలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నవి. ఇక తాజాగా అమెరికా ఫెడరల్ బ్యాంక్ చైర్మన్ పావెల్ ద్రవ్యోల్బణ కట్టడికి వడ్డీరేట్ల పెంపు తప్పదని ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. భారీ నష్టాలతోనే మొదలైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ నుంచి ప్రతికూల ప్రభావంతో బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఐటి, బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో పెట్టుబడిదారులు షేర్లను విక్రయించేందుకే మొగ్గు చూపుతుండటంతో సెన్సెక్స్, నిఫ్టీ పతనం అంచున నిలిచాయి. పావెల్ ఒక్క మాటతో మదుపర్ల లక్షల కోట్ల సంపద ఆవిరి అయిపోతున్నది. కేవలం 8 నిమిషాలు మాత్రమే పావెల్ మాట్లాడారు. కానీ 6 లక్షల కోట్లు హుక్ కాకీ అయ్యాయి.
Also Read: Noida Twin Towers Demolition: ట్విన్ టవర్స్ కూల్చే ముందు.. ప్లాట్‌లో నిద్రపోయిన వ్యక్తి..!
ఒక్క చైనా మినహా
పావెల్ వడ్డీరెట్లు పెంచుతామని ప్రకటించడంతో ఆసియాలో ఒక్క చైనా మినహా అన్ని దేశాల స్టాక్ సూచీలు రెండు శాతం నష్టపోయాయి. యూరప్ లో మార్కెట్లు ఒక్క శాతం పతనమయ్యాయి. అమెరికా సూచీలు పావు శాతం నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇక భారత దేశం విషయానికి వస్తే సెన్సెక్స్ ఒకటిన్నర నష్టంతో బీఎస్ఈ లో 2.39 లక్షల కోట్ల సంపద మాయమైంది. ఈ ప్రభావంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బి ఎస్ సి నమోదిత కంపెనీల మొత్తం విలువ 274 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఆరంభ నష్టాల నుంచి రికవరీ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, రష్యా , ఉక్రెయిన్ యుద్ధం ఫలితం.. వెరసి ఇండియన్ స్టాక్ మార్కెట్ నష్టాలతో మొదలైంది. నిన్నటికి నిన్న సెన్సెక్స్ 1467 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 370 పాయింట్లు నష్టపోయింది. ఇక ఇంట్రా డే లో సెన్సెక్స్ 57,367 వద్ద వారాంతపు కనిష్టాన్ని చవి చూసింది. నిఫ్టీ కూడా 17,380_ 17,166 పరిధిలో మాత్రమే ట్రేడ్ అయింది. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. గుడ్డిలో మెల్లగా ఒక్క రిలయన్స్ షేర్ మాత్రమే ఒక్క శాతం నష్టంతో 2,597 వద్ద ముగిసింది.

ఎందుకు ఈ ప్రభావం
ఇప్పటికీ గ్లోబల్ మార్కెట్లో అమెరికా మదుపర్లదే హవా ఉంటుంది. బ్యాంకింగ్ నుంచి చమురు వరకు వారే అన్ని రంగాల్లో పెట్టుబడులు పెడతారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న ఇటీవల పరిణామాలు మార్కెట్లను ఒడిదుడుకులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా యూరప్, ఆసియా మార్కెట్లు తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. అయితే అమెరికాలో కూడా ధరల సూచి అంతకంతకు పెరుగుతుండడంతో దానిని కట్టడి చేసేందుకు అక్కడి ఫెడరల్ బ్యాంకు ఇటీవల తన ద్రవ్య పరపతి విధానాన్ని పలుమార్లు సవరించింది. అందులో భాగంగానే కీలకమైన వడ్డీరేట్లను పెంచింది. దీంతో మదుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. వారంతా అమెరికాలోని వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. దీనివల్ల అమెరికా కరెన్సీ క్రమేణా బలపడుతోంది. ఇది అంతిమంగా ఆయా దేశాల కరెన్సీల మీద ప్రభావం చూపిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే చాలా దేశాలు ఇబ్బందులు పడే అవకాశాలుంటాయి. ఇప్పటికే శ్రీలంక, పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఆర్థికంగా పతనం అంచున నిలిచాయి. ఆఫ్రికాలోని చాలా దేశాలు ఆర్థిక సమస్యలతో విలవిలలాడుతున్నాయి. ఇండియా కరెన్సీ విలువ కూడా తగ్గిపోతుంది. అయితే ఈ పరిస్థితికి కారణమైన అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు సవరించకుండా ఉండాలని అన్ని దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయినప్పటికీ అమెరికా మాట వినడం లేదు.
Also Read:MP Gorantla Madhav Video Issue: గోరంట్ల మాధవ్ ఘటనపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం.. చర్యలకు ఆదేశం
https://www.youtube.com/watch?v=5THwJgxJGv0