
ఓ వైపు దేశంలో రోజుకు 3 లక్షల పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. రోజుకు 2 వేల మందికిపైగా చనిపోతున్నారు. కొవిడ్ సోకిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో ఆసుపత్రుల్లో పడకలు దొరకట్లేదు. ఆక్సీజన్ కొరత వేధిస్తోంది. ఇలాంటి కండీషన్లో కూడా పట్టువదలకుండా ముందుకే సాగుతోంది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్. అయితే.. నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించాలని ఆదేశిస్తోంది. కానీ.. క్షేత్రస్థాయిలో ఆ ఆదేశాలు ఎక్కడా అమలవుతున్న దాఖలాలు కనిపించట్లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతోపాటు సిద్ధిపేట, అచ్చంపేట, జడ్చర్ల కొత్తూరు, నకిరేకల్ మునిసిపాలిటీలకు ఈ నెల 30న ఎన్నికల జరగనున్నాయి. వీటిని దక్కించుకునేందుకు పార్టీలు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే.. ఈ క్రమంలో కరోనా నిబంధనలు గాలికి వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ఆయా పార్టీల కార్యకర్తలు కనీస బాధ్యత లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతోపాటు విపక్షాలకు చెందిన నేతలు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న ర్యాలీలు, రోడ్ షోలలో కార్యకర్తలు గుంపులుగా పాల్గొంటున్నారు.
ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య పెరుగుతుందనే భయాందోళన వ్యక్తమవుతోంది. ఒకరికి వైరస్ వస్తే.. వారి ఖర్మ అని వదిలేసుకునే పరిస్థితి లేదు. ఆ ఒక్కరి నుంచి ఎంత మందికి వైరస్ వ్యాపిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. అందువల్ల ఎవరు నిబంధనలు అతిక్రమించినా.. మొత్తం సమాజానికి హాని చేసినట్టే అవుతుంది.
ఇప్పటికే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడ్డారు. మంత్రి కేటీఆర్ కూడా కరోనా పాజిటివ్ రావడంతో హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన రాజకీయ నేతలు, కార్యకర్తలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల వల్ల రాబోయే రోజుల్లో ఎన్ని కేసులు పెరుగుతాయో అనే ఆందోళన వ్యక్తమవుతోంది.