AP New DGP: నచ్చిన వారిని అందలమెక్కించడం.. నచ్చని వారిని అణగదొక్కడం ఏపీ సర్కారు నైజంగా మారింది. న్యాయవ్యవస్థ పరిధులనే ప్రశ్నించిన అరుదైన ఘటనలు ఏపీలో చూశాం. తనకు నచ్చలేదని ఏకంగా ఎలక్షన్ అధికారిపై కత్తికట్టి వేటు వేసే వరకూ నిద్రపట్టలేదు. న్యాయస్థానాలున్నాయి కాబట్టి రాజ్యాంగబద్ధ పదవులకు సేఫ్ కానీ.. లేకుంటే తమకు నచ్చి.. తమ మాట విన్నవారికే జగన్ ప్రాధాన్యమిస్తారని చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి పదవీ గండం తప్పేలాలేదు. ఆయన్ను వారం రోజుల్లో తప్పించి..ఆ పోస్టులో కొత్త వ్యక్తిని తెచ్చి పెడతారన్న టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రాజేంద్రనాథ్ రెడ్డి ఇన్ చార్జి హోదాలో ఉన్నారు. నిబంధనల ప్రకారం నియామకం జరగడం లేదు. అయితే నిబంధనలు సవరించి పూర్తిస్థాయి డీజీపీగా ఆయన్ను కొనసాగించే చాన్స్ ఉంది. అయితే ప్రభుత్వ ఆశలు, ఆకాంక్షలకు తగ్గట్టు పనిచేయడం లేదని ఇప్పుడు ఆయన్ను తప్పించడానికి దాదాపు డిసైడ్ అయినట్టు సమాచారం.

గౌతమ్ సవాంగ్ నిష్క్రమణ ఎపిసోడ్ ను త్వరత్వరగా పూర్తిచేసిన ప్రభుత్వం ఆ బాధ్యతలను రాజేంద్రనాథ్ రెడ్డికి అప్పగించింది. అప్పుడు నిబంధనలు పాటించలేదు. ఇన్ చార్జిగా నియమించుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. కానీ వెంటనే డీజీ హోదా ఉన్న అధికారుల పేర్లను డీవోపీటీకి పంపాలి. వారిలో ముగ్గురు పేర్లను ఫైనల్ చేసి తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతుంది. ఆ ముగ్గురిలో ఒకర్ని నియమించుకోవచ్చు. అయితే రాజేంద్రనాథ్ రెడ్డి విషయంలో ఈ ఫార్ములాలు ఏవీ పాటించలేదు. అందుకే దానిని ఒక సాకుగా చూపి డీజీపీ బాధ్యతల నుంచి తప్పించేందుకు ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
గతంలో ఏ ప్రభుత్వమూ ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఇంతలా వినియోగించుకోలేదు. సాధారణంగా నిఘా సంస్థలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తాయి. అయితే గత మూడున్నరేళ్లుగా సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ జగన్ ప్రభుత్వానికి, పార్టీకి మెప్పించేలా పనిచేశారు. ఆయన్ను డీజీపీ చేసేందుకే రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పిస్తారన్న టాక్ ప్రారంభమైంది. అందులో భాగంగానే సునీల్ కుమార్ కు ఇటీవల డీజీ హోదా ఇచ్చారు. అయితే సునీల్ కుమార్ తో పాటు పీఎస్ఆర్ ఆంజనేయులు కూడా డీజీపీ పోస్టు కోసం పోటీ పడుతున్నారు. కానీ తమకు రాజకీయంగా పనికొచ్చిన సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వైపే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.

ఏపీ పోలీస్ వ్యవస్థ ప్రజల్లో నమ్మకం కోల్పోయింది. సీనియర్, సిన్సియర్ అధికారులంతా లూప్ లైన్ లో ఉన్నారు. గత ఎన్నికల్లో తమకు పనికొచ్చాడని.. వచ్చే ఎన్నికల్లో పనికొస్తాడని రకరకాల గణాంకాలు చూపుతూ కొందరి అధికారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వస్తోంది. తమ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే పోలీస్ అధికారులకు పదవులు ఇస్తోంది. దీంతో ఏపీలో పోలీసుల నుంచి రాజకీయ హింస పెరుగుతోందన్న అపవాదు అయితే ఒకటి ఉంది.