Ponguleti Srinivas Reddy : రాజకీయాల్లో బంధాలు, అనుబంధాలకు తావు ఉండదు. అవసరాలు మాత్రమే ఉంటాయి.. ఆ అవసరాలు తీరిన తర్వాత ఎవరికి ఎవరు ఏమీ కారు.. జస్ట్ శత్రువులుగా మిగిలిపోతారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే… ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైయస్ఆర్సీపీ పార్టీ మీద గెలిచిన తర్వాత టిఆర్ఎస్ లో చేరారు.. కెసిఆర్ కు అత్యంత ఆప్తుడిగా మారిపోయారు. తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ పార్టీని గెలిపించే బాధ్యత ఆయన భుజాలకు ఎత్తుకున్నారు.. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ కార్మిక సంఘం నాయకులను గెలిపించడంలో శ్రీనివాస్ రెడ్డి కీలకపాత్ర పోషించారు. తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో శ్రీనివాస్ రెడ్డి అనుచరులకు కేసీఆర్ టికెట్లు ఇవ్వలేదు.. 2019 ఎన్నికల్లో ఎంపీ సీటూ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా శ్రీనివాస్ రెడ్డి కడుపులో పెట్టుకున్నాడు. ఆయన మాత్రం ఎన్నాళ్ళని భరిస్తాడు? భోళా శంకరుడు కాదు కదా? ఏళ్లకు ఏళ్ళు ఎదురు చూశాడు. ఫలితం దక్కలేదు. నూతన సంవత్సరం రోజున ధిక్కార స్వరం వినిపించాడు. బస్.. క్లారిటీ వచ్చేసింది.

భద్రత తగ్గించారు
నూతన సంవత్సరం సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేయడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కాక చెలరేగింది. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత ప్రభుత్వం స్పందించింది.. శ్రీనివాస్ రెడ్డి కి ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీలో కోత విధించింది. ఆయన త్వరలో పార్టీ మారబోతారన్న సంకేతాలు ఉండడంతో భారత రాష్ట్ర సమితి దీనిని సీరియస్ గా తీసుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డికి కొనసాగుతున్న “జి ప్లస్ త్రీ” సెక్యూరిటీని “జి ప్లస్ టు” కు తగ్గించింది. ఆయన గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఎస్కార్ట్ వాహనాన్ని ప్రభుత్వం సమకూర్చింది. ఆయన మాజీ ఎంపీగా ఉన్నప్పటికీ భారత రాష్ట్ర సమితి నాయకుడు కావడంతో ప్రభుత్వం ఎస్కార్ట్ వాహనాన్ని కొనసాగించింది.. అయితే నూతన సంవత్సర సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో ఎస్కార్ట్ వాహనాన్ని కూడా ప్రభుత్వం తొలగించింది.. అంతేకాకుండా ఆయన ఇంటి వద్ద ఉండే ముగ్గురు సెక్యూరిటీ గార్డులను కూడా తొలగించింది.. ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి “జి ప్లస్ టు” భద్రత మాత్రమే ప్రభుత్వం ఉంచింది. అయితే ఇప్పటివరకు ఆయన పార్టీ మారే విషయాన్ని వెల్లడించలేదు.. అయితే ముందస్తుగానే భారత రాష్ట్ర సమితి పొంగులేటి పై పరోక్ష చర్యలకు సిద్ధం అన్నట్టుగా సెక్యూరిటీని తొలగించి సంకేతాలు ఇచ్చినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఒక మాజీ ఎంపీకి ఇచ్చినట్టు సెక్యూరిటీని కొనసాగిస్తున్నది.
బిజెపిలో చేరుతారా?
శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ లోకి రాకముందు ఆయన వైఎస్ఆర్సిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. ఎంపీ అయిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు.. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టిఆర్ఎస్ లో చేరారు. మొదట్లో ఆయనకు, కేసిఆర్ కు వేవ్ లెంగ్త్ బాగానే ఉండేది.. ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు కానీ పొంగులేటికి, కెసిఆర్ కు దూరం పెరగడం ప్రారంభమైంది.. అది ఇప్పుడు ఎవరూ పూడ్చలేని స్థాయికి చేరింది. మరో వైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపిలో చేరబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారని, త్వరలో కాషాయ కండువా కప్పుకోవడం ఇక లాంచనమేనని ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ ఇదే గనుక జరిగితే బిజెపి ఖమ్మం లో బలోపేతం కావడం ఖాయం.