Ponguleti Srinivas Reddy : ” భారత రాష్ట్ర సమితిలో మనకు ఏ పాటి గౌరవం దక్కుతుందో చూస్తున్నాం.. కార్యకర్తల అభీష్టం మేరకే త్వరలో నా నిర్ణయం ఉంటుంది.. వారందరికీ గౌరవం దక్కుతుంది” ఇవీ ఈనెల ఒకటో తేదీన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత ఆయన బిజెపిలోకి వెళ్తున్నారనే ప్రచారం జరిగింది.. అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఖరారు అయిందని తెలిసింది.. దీనికి బలం చేకూర్చుతూ పొంగులేటి శిబిరంలో ఉన్న భారత రాష్ట్ర సమితి నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ఖమ్మం సభకు హాజరు కాలేదు. ఈ పరిణామం తర్వాత పొంగులేటి ఇక బిజెపిలో చేరడం లాంచనమే అనే అభిప్రాయానికి అందరూ వచ్చారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.

అనుచరులు దూరం
పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మట్టా దయానంద్ విజయ్ కుమార్, మువ్వ విజయ్ బాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, కోరం కనకయ్య ప్రధాన అనుచరులుగా ఉన్నారు. అయితే వీరిలో మట్టా దయానంద్ విజయకుమార్ ఇటీవల అజ్ఞాతంలోకి వెళ్లారు.. 2014లో మట్టా దయానంద్ వైఎస్ఆర్సిపి నుంచి సత్తుపల్లిలో పోటీ చేశారు.. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.. అప్పట్లో పొంగులేటి శ్రీనివాస రెడ్డే మట్టా దయానంద్ విజయకుమార్ ను చేరదీశారు.. ఆయన ప్రోద్బలంతోనే సత్తుపల్లి నియోజకవర్గం నుంచి విజయ్ కుమార్ పోటీ చేశారు. నాటి నుంచి నేటి వరకు ఆయన పొంగులేటి వర్గంలోనే కొనసాగుతున్నారు.. అయితే తాజాగా పొంగులేటి అడుగులు బిజెపి వైపు పడుతున్నాయనే సమాచారంతో విజయ్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన అనుచరులకు కూడా అందుబాటులో లేకుండా దూరంగా ఉన్నారు. పొంగులేటి బిజెపి వైపు వెళ్తే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని నిర్ణయానికి విజయ్ కుమార్ వచ్చినట్టు తెలుస్తోంది.. ఇదే దారిలో మిగతా నాయకులు ఉన్నట్టు సమాచారం.
కాంగ్రెస్ వైపు వెళ్తారా?
మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలుమార్లు పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఫోన్ చేశారని సమాచారం.. కాంగ్రెస్ లోకి వస్తే బలమైన భవిష్యత్తు ఉంటుందని ఆయనకు హామీ ఇచ్చినట్టు సమాచారం.. ఖమ్మంలో జరిగిన మీటింగ్ లో కూడా రేణుకా చౌదరి ఇదే విషయాన్ని చెప్పారు.. అయితే పొంగులేటి శ్రీనివాస రెడ్డికి, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క కు అసలు పొసగదు. పైగా 2018 ఎన్నికల్లో తన ఓటమికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్కెచ్ వేశారని అప్పట్లో భట్టి విక్రమార్క ఆరోపించారు. అంతేకాదు కాంట్రాక్టర్లు రాజకీయాల్లోకి రావడం వల్ల అవి భ్రష్టు పట్టిపోయాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే పొంగులేటి రాకను విక్రమార్క అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. ఇన్ని పరిణామాల మధ్య పొంగులేటి ఎటువైపు వెళ్తారో తెలియక ఆయన అనుచరులు ఆందోళనలో ఉన్నారు.