Homeజాతీయ వార్తలుPonguleti Srinivas Reddy: శత్రువులు, మిత్రులు ఉండరిక్కడ? అవసరాలే కలుపుతాయి

Ponguleti Srinivas Reddy: శత్రువులు, మిత్రులు ఉండరిక్కడ? అవసరాలే కలుపుతాయి

Ponguleti Srinivas Reddy: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని ఓ నానుడి. ఇది పలు సార్లు నిరూపిమవుతూనే ఉంటుంది. తాజాగా తెలంగాణ రాజకీయాల్లోనూ నిజమైంది. అవసరాలు రాజకీయ నాయకుల మధ్య వైరాన్ని పెంచుతాయి. ఆ అవసరాలే వారి మధ్య స్నేహాన్ని పురిగొల్పుతాయి. ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో త్వరలో చేరబోతున్న నేపథ్యంలో అతడి రాకకు ఎలా గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది? ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి రేణుకా చౌదరి తర్వాత మరో పవర్‌ హౌస్‌ లాగున్న భట్టి విక్రమార్క పొంగులేటి రాకను ఎలా స్వాగతించారు? ఎలా సమ్మతం తెలిపారు? ఉప్పూనిప్పూ లాగుండే వారిద్దరూ ఎలా కలిసిపోయారు? మీరూ చదివేయండి.

ఇలా మొదలయింది

వాస్తవానికి భట్టి విక్రమార్కకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వైరం లేదు. 2018 ఎన్నికలు మాత్రం ఇద్దరి మధ్య విభేదాలకు కాణమయ్యాయి. అప్పటి ఎన్నికల్లో పొంగులేటి అనుచరుడు, ప్రస్తుతం ఖమ్మం జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌కు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం టికెట్‌ ఖరారు చేసింది. మధిరలో భట్టికి పోటీగా ఆయన నిలబడ్డారు. స్వతహాగా ధన బలం ఉన్న పొంగులేటి భట్టిని ఢీకొట్టే స్థాయిలో ప్రచారం చేశారు. అభ్యర్థి లింగాల కమల్‌ రాజ్‌ అయినా తెర వెనుక పొంగులేటే చక్రం తిప్పారు. ఫలితంగా భట్టి ఆ ఎన్నికల్లో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మధిర నియోజకవర్గంలో ఆంధ్రాకు సరిహద్దుగా ఉండే ఎర్రుపాలెం మండలంలో పొంగులేటి సామాజిక వర్గానికి చెందిన వారు ఔట్‌ రైట్‌గా బీఆర్‌ఎస్‌కు మద్దతు పలికారు. ఇది సహజంగానే భట్టికి మింగుడు పడలేదు. ఓటమి తప్పదేమోననే భయంతో ఆయన పొరుగున్న ఉన్న ఏపీ మంత్రి(అప్పటి) దేవినేని ఉమా మహేశ్వరరావు సహాయం తీసుకున్నారు. టీడీపీ మధిర ఇన్‌చార్జ్‌ వాసిరెడ్డి రామనాథం కూడా ఇందుకు సహకరించారు. వారి సహాయ సహకారాలతో గట్టెక్కినప్పటికీ నాటి పరిస్థితులను నిన్నటి దాకా భట్టి మర్చిపోలేదు. పైగా పలు సందర్భాల్లో ‘కాంట్రాక్టర్లు రాజకీయాల్లోకి వస్తే ధనబలం చూపిస్తారు. అలాంటివారు మధిర నియోజకవర్గంలో డబ్బు సంచులతో వస్తారు. మధిరలో అలాంటి ప్రయోగాలు చేయాలనుకుని బోర్లాపడ్డారు.’ అని భట్టి పలు సందర్భాల్లో అన్నారు. ‘నేను ప్రజాసేవ కోసమే వచ్చాను. కమల్‌రాజ్‌ గెలిచి ఉంటే మీ నియోజకవర్గం రూపు రేఖలు మారేవి. అతడు ఓడిపోయినా ప్రజల్లోనే ఉంటాడు. నేను కూడా మీతోనే ఉంటాను’ అని పొంగులేటి కూడా కౌంటర్‌ ఇచ్చారు. అప్పుడు మొదలైన వైరం.. నిన్నటి దాకా కొనసాగింది.

ఇలా కలిశారు

పొంగులేటి బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీలో చేరతారు అని ఊహాగానాలు విన్పించాయి. ఈటెట రాజేందర్‌ వంటి వారు రావడం ఇందుకు బలం చేకూర్చాయి. కానీ అవన్నీ గాలికి కొట్టుకుపోయే పేలపిండి అని తర్వాత తేలిపోయింది. ఇక పొంగులేటి కాంగ్రెస్‌లోకి వస్తున్నారు, రేవంత్‌తో మంతనాలు జరుపుతున్నారు అని తెలియగానే భట్టి పెద్దగా స్పందించలేదు. ఎప్పుడయితే రాహుల్‌ టీం పొంగులేటిని కలిసిందో అప్పుడే భట్టికి విషయంఅర్థమైంది. ఇదే విషయాన్ని రాహుల్‌ గాంధీతో చెబితే.. తెలంగాణ కాంగ్రెస్‌ బలంగా ఉండాలంటే కొన్ని కొన్ని శక్తులను చేర్చుకోకతప్పదు అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో భట్టి కూడా ఇలాంటి సమయంలో లేనిపోని పట్టింపులకు పోవద్దు అనే నిర్ణయానికి వచ్చారు. ఇక పొంగులేటి కూడా గతంలో జరిగిన వన్నీ మర్చిపోయి నల్లగొండ జిల్లాలో భట్టి చేస్తున్న పాదయాత్ర దగ్గరకు వెళ్లారు. భట్టితో మాట్లాడారు. ‘ ఆపా్ట్రల్‌ ఓ నార్మల్‌ లీడర్‌ కోసం నన్ను అంత ఇబ్బంది పెట్టావ్‌ అన్నా? దాని వల్ల నేనెంత సఫర్‌ అయ్యానో నీకు తెలుసా?’ అని భట్టి అంటే.. ‘నేను అధిష్ఠానం నిర్ణయం మేరకు అలా నడుచుకున్నాను. స్వతహాగా మీతో నాకు వైరం లేదు. ఉండదు. ఉండబోదు అన్నా’ అంటూ పొంగులేటి తిరుగు సమాధానం ఇచ్చారు. తర్వాత ఇద్దరూ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పడగొడతామని ప్రతిజ్ఞ చేశారు. ఇలా ఉప్పూనిప్పూ లాంటి వ్యక్తులు కలిసిపోయారు. ముందుగానే చెప్పినట్టు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు!

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular