Ponduru Khadi: మహాత్మ గాంధీ నుంచి మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు వరకూ ప్రముఖులు, సెలబ్రెటీల హృదయాలను దోచుకున్న వస్త్రం పొందూరు ఖద్దరు. అంతర్జాతీయ ఖ్యాతి దక్కించుకున్న పొందూరు ఖద్దరుకు విశేష చరిత్ర ఉంది. మల్లెపూవ్వులాంటి తెల్లదనం, ఎండతాపం నుంచి ఉపశమనం, చల్లదనం ఈ వస్త్రం సొంతం. శరీరానికి ఏమాత్రం ఇబ్బంది కలిగించని మెత్తదనం, ప్రశాంతతనిచ్చే స్వచ్ఛదనం పొందూరు ఖద్దరు ప్రత్యేకత. మార్కెట్లో కార్పొరేట్ కంపెనీల హవా నడుస్తున్న ఈ తరుణంలో పొందూరు ఖాదీ వాసి తగ్గలేదు. ఆదరణ చెక్కుచెదరలేదు. ఇప్పటికీ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఏరికోరి ఆర్డర్ చేసుకొని తీసుకెళుతుంటారు. వేసవిలో చల్లదనం, శీతాకాలంలో వెచ్చదనం ఇవ్వడమే ఈ వస్త్రం స్పెషల్. ఈ వస్త్రాలు ధరిస్తే మనుసుకు హాయితనం, హుందాతనంతో పాటు ఎంతో సౌకర్యంగా ఉంటాయి. అతి సామాన్యుల నుంచి అసామాన్యుల వరకూ ధరించేందుకు వీలుగా వస్త్రాలు అందుబాటులో ఉంటాయి. స్వాతంత్రం సాధించిపెట్టిన గాంధీజీ నుంచి ప్రస్తుత రాజకీయ నాయకుల వరకూ అందరూ పొందూరు ఖాదీ అభిమానులే. ముట్టుకుంటే మాసిపోయే పొందూరు ఖాదీ తెల్లదనం వెనుక వందలాది మంది నేతన్నల కష్టం దాగి ఉంది. అంతకు మించి మరో వర్గం శ్రమ కూడా ఇందులో ఉంది. వారే ఆనందపురం రజకులు. నేతన్న బట్ట తయారుచేయగా.,.దానికి సానబెట్టి తెల్లదనం తెప్పించడంలో మాత్రం రజకులదే కీలక పాత్ర.

వస్త్రం తయారీకి రెండు వారాలు..
మరో వింతమేమిటంటే పొందూరు ఖాదీ తెల్లదనానికి ఆవు పేడ వినియోగిస్తారు. ఆశ్చర్యకరంగా ఉంది కదా. బట్ట తయారీకి ఆవు పేడ వినియోగించడం ఏమిటని ఆలోచిస్తున్నారు కదూ. ఈ నిజమేనండి. నేతన్న వస్త్రం తయారుచేసినప్పుడు అది ముతకగా ఉంటుంది. తెల్లగా కాకుండా కోర రంగులో ఉంటుంది. అంతవరకే నేతన్న పని. అక్కడ నుంచి ఆ వస్త్రం పొందూరు పక్కనే ఉన్న ఆనందపురం రజకుల చేతిలోకి వెళుతుంది. వారు 14 రోజుల పాటు శ్రమించి దానిని మల్లెపువ్వలా తయారుచేస్తారు. ముట్టుకుంటే మాసిపోయేలా తీర్చుదిద్దుతారు. ఈ 14 రోజులు గట్టిగానే శ్రమిస్తారు. ముందుగా వస్త్రాన్ని ఆవుపేడతో రెండు రోజుల పాటు ఉడికిస్తారు. దీంతో బట్ట ముతఖ నుంచి మొత్తగా మారుతుంది. తరువాత సోడా కారం, సున్నం పట్టిస్తారు. ఆవిరితో రెండు రోజుల పాటు బాగా బాయిలింగ్ చేస్తారు.. అటు తరువాత వస్త్రాన్ని బయటకు తీసి బ్లీచింగ్, సోడాకారం కలిపి మరో రెండు రోజుల పాటు నీటిలో నిల్వ చేస్తారు. బయటకు తీసిన తరువాత నీలిరంగు, గంజిని కలిపిన నీటిలో మూడురోజుల వరకూ ఆరబెడతారు. తరువాత బయటకు తీసి బాగా ఆరబెడతారు. అప్పుడు తెల్లటి మల్లెపూవ్వులాంటి ఖాదీ వస్త్రం సిద్ధమవుతుంది. వాటిని రజకులు ఉత్పత్తిదారులకు అందిస్తారు.
రజకుల పాత్ర కీలకం
అయితే ఇప్పటివరకూ పొందూరు ఖాదీ అంటే నేతన్న కష్టమే అని లోకానికి తెలుసు. అయితే తెర వెనుక ఆనందపురం రజకుల పాత్ర ఉందన్నది చాలామందికి తెలియదు. పొందూరుకు కూతవేటు దూరంలో ఉంటుంది గ్రామం. పదుల సంఖ్యలో రజక కుటుంబాలు ఖద్దరు వస్త్రాల సేవలో తరించేవి. గతంలో ఆదాయం బాగుండేది. కానీ ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. దీంతో గిట్టుబాటుకాక కొన్ని కుటుంబాలు ప్రత్యామ్నాయ ఉపాధిని వెతుక్కుంటూ వెళ్లిపోయాయి. ఉన్న కొద్దిపాటి కుటుంబాలు చివరి తరం వారు మాత్రమే వృత్తిని కొనసాగిస్తున్నారు. కుటుంబంలో పిల్లను ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మళ్లించారు. ప్రస్తుతం ఖాదీ వస్త్రానికి ఒక వర్గంవారే ఆదరిస్తున్నారు. ఇలా ఆదరిస్తున్న వారిలో సమాజంలో చాలా తక్కువ శాతం. అందుకే పనికి తగ్గట్టు గిట్టుబాటు కావడం లేదని అటు నేతన్నలు, ఇటు రజకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రభుత్వాలు కూడా ఆశించిన స్థాయిలో చేయూతనందించడం లేదు. ఖాదీకి రాయితీలు, రుణాలు పెంచడం లేదు.

అమ్మకాలు పెంచేందుకు ప్రయత్నాలు
పొందూరు ఖద్దరు క్రయవిక్రయాలు పెంచేందుకు చేనేత సంఘాలు పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎక్కడికక్కడే అవుట్ లెట్లు ఏర్పాటు చేస్తున్నాయి. అమ్మకాలు పెంచి నేతన్నలకు ఉపాధి పెంచే ప్రయత్నాల్లో ఉన్నాయి. అటు ఆన్ లైన్ మార్కెటింగ్ ను సైతం విస్రృతం చేశాయి. అయితే ఎక్కువ మంది నేరుగా వెళ్లి కొనుగోలు చేసేందుకే ఇష్టపడుతుంటారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అటు రైలు, ఇటు బస్సు సౌకర్యం ఉంటుంది. పొందూరుకు పలు రైళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. స్థానికంగా రైల్వేస్టేషన్ కూడా ఉంది. శ్రీకాకుళం నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పొందూరు. నిత్యం బస్సులు ఉంటాయి. సుమారు 40 నిమిషాల వ్యవధిలో పొందూరు చేరుకోవచ్చు.
Also Read:Jagan- Amit Shah: అమిత్ షాపై జగన్ కు అంత కోపం ఏంటబ్బా? అసలేంటి కారణం?
[…] […]