AP Politics: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మారిపోతున్నాయి. హుందాగా ఉండాల్సిన అధికార పార్టీ స్థాయిని మరిచి ఆరోపణలు చేస్తోంది. బూతు పురాణాలు వల్లిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ఏదైనా మాట్లాడితే దానికి సావధానంగా సమాధానం చెప్పాల్సి ఉన్నా తిట్ల దండకం అందుకుంటోంది. దీంతో ఎవరు కూడా ఏం మాట్లాడడానికి ఇష్ట పడటం లేదు. ఇటీవల కాలంలో అయితే బూతులు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆన్ లైన్ టికెట్ల విషయంలో మాట్లాడినందుకు ఆయనను టార్గెట్ చేసి మంత్రులు మాట్లాడటం విడ్డూరంగా ఉంది.

ప్రభుత్వంతో సంబంధం లేనివారు కూడా ఇందులో మాట కలపడం సముచితం కాదని తెలిసినా పట్టించుకోవడం లేదు. ఎంత బూతులు తిడితే అంత విలువ వస్తుందనే భ్రమలో వైసీపీ నేతలున్నట్లు కనిపిస్తోంది. ఎదుటి వారి స్థైర్యం దెబ్బతీసే క్రమంలో తిట్లే ప్రధాన ఆయుధాలుగా చేసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పలేక బూతులు తిట్టడం మొదలెట్టారు. ఇందులో కులాన్ని కూడా చేర్చి పచ్చిబూతులు అందుకున్నారు. దీంతో రాజకీయం ఎటు వైపు వెళుతుందో తెలియడం లేదు.
ప్రతిపక్షం ఎవరిని ప్రశ్నించినా తిట్లే సమాధానంగా చెబుతున్నారు. ఇష్టారాజ్యంగా బూతులు తిడుతూ వారిని మానసికంగా వేధిస్తున్నారు. శాపనార్థాలు సైతం పెడుతున్నారు. పచ్చి బూతులు తిట్టడమే ఎదురుదాడిగా పెట్టుకున్నారు. దీంతో వారి మాటలు సభ్య సమాజమే తలదించుకునేలా ఉంటున్నాయని సగటు పౌరుడు సైతం విమర్శిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల తీరుపై సహజంగానే విమర్శలు వస్తున్నాయి.
ప్రతిపక్షాలు చేసే విమర్శలకు సంయమనంగా సమాధానం చెప్పాలి. ఎంతటి విమర్శనైనా తిప్పికొట్టేలా జవాబు చెప్పాలి. కానీ వారిలో సంయమనం కొరవడింది. తిట్ల పురాణం పెరిగిపోతోంది. ఎంతటి వారినైనా బూతులతోనే అదుపు చేయాలని చూస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే క్రమంలో వారే తమ స్థాయిని మరిచిపోతున్నారు. దీంతో రాష్ర్టంలో అధికార పార్టీపై అందరిలో అనుమానాలు తలెత్తుతున్నాయి.