Politics Vs YSR family : అనుబంధాలు కరువు.. రాజకీయాలే వైఎస్ కుటుంబంలో చిచ్చుపెట్టాయా?

వైఎస్సార్ నామస్మరణ చేసే నేతలు సైతం అటువైపుగా చూడడం లేదు. అందుకే ఇప్పుడు జగనన్న వదిలిన బాణం తిరిగి రివర్స్ అవుతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Written By: Dharma, Updated On : April 29, 2023 3:07 pm
Follow us on

Politics Vs YSR family : వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఈ పేరుకో బ్రాండ్ ఈమేజ్ ఉంది. ఎన్నో లక్షల మంది గుడికట్టి దేవుడిగా కొలుచుకునే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. కుదేలైన  కాంగ్రెస్ పార్టీని తన భుజస్కందాలపై వేసుకొని పైకిలేపిన చరిత్ర ఆయన సొంతం. పులివెందుల బిడ్డగా రాజకీయాలను శాసించిన ఆయన కృషి వెనుక వసుదైక కుటుంబం ఉంది. ఉమ్మడి కుటుంబం విలువలను చాటిచెప్పే మనుషులకు అక్కడ కొదువ ఉండదు. ఆ కుటుంబంలో అందరికీ రాజకీయ అనుభవం ఉంది. ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. బహుశా రాజశేఖర్ రెడ్డి సుదీర్ఘ కాలం రాజకీయం చేయడానికి అది కూడా దోహదపడింది. కేవలం తమవారినే కాదు.. తమతో పనిచేస్తున్నవారిని సైతం గౌరవించి కలుపుకొని వెళ్లడం ఆ కుటుంబ సొంతం. అందుకే ఓ సూరీడు, మరో వంట మాస్టర్ చంద్రుడు కుటుంబసభ్యులుగా చేరిపోయారు. కేవీపీ రామచంద్రరావు ఆత్మగా మారిపోయారు.

ఎడబాటు..
అయితే అదంతా గతం. ఆ వసుదైక కుటుంబంలో అనురాగాలు, అప్యాయతలు అలానే ఉన్నాయంటే ప్రస్తుతం సమాధానం దొరకని పరిస్థితి. వైఎస్ మరణించిన తొలినాళ్లలో మాత్రం ఆ కుటుంబం చెక్కుచెదరలేదు. తండ్రిలేని పిల్లలుగా జగన్ , షర్మిళలకు అండగా నిలిచింది ఆ కుటుంబం. తమకు ఇంతటి పేరు, ప్రతిష్ఠ ఇచ్చిన రాజశేఖర్ రెడ్డిని ఆయన పిల్లలిద్దరిలో చూసుకుంది ఆ కుటుంబం, కానీ వారి అనుబంధాన్ని చూసి విధికి కన్ను కుట్టిందేమో ఎవరికి ఎవర్నీ కాకుండా చేసేంతటి ఎడబాటును పెంచింది. అది ఒక సామాన్య కుటుంబమేనని సమాజంలో చిన్నబోయేలా చేసింది. ఏపీ సమాజంలో కుటుంబంపై విభేదాల మచ్చపడింది.

పలకరింపులు కరువు..
వైఎస్ కుటుంబంలో ఈ పరిస్థితికి కారణం ఏంటి? అంటే పరిస్థితి అన్న సమాధానం తప్ప మరేమీ కనిపిండచం లేదు. కాంగ్రెస్ నాయకత్వంపై తిరగబడిన జగన్ కు జనబలం తోడైంది. అంతకు మించి తల్లి, చెల్లి రూపంలో బలం అక్కరకు వచ్చింది. జగన్ జైలుకు వెళ్లినప్పుడు ఆయన తరపున అలుపు లేకుండా.. విరామం తీసుకోకుండా షర్మిళ శ్రమించారు. జగన్ వదిలిన బాణంగా చెప్పుకొని మరీ ప్రత్యర్థులను ఆమె ఢీకొట్టారు. కష్టకాలంలో కూడా వైసీపీని నిలబెట్టగలిగారు. అప్పటివరకూ భర్త చాటుగా ఉండే విజయమ్మ రోడ్డుపైకి వచ్చారు. నా భర్త మీకోసం ప్రాణాలు వదిలారు. ఇప్పుడు నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను అంటూ ఊరూవాడా ప్రచారం చేశారు. కుమారుడికి రాజ్యాధికారం చేరువ చేశారు. కానీ ఇప్పుడు తల్లీ చెల్లెలు నుంచి పలకరింపులు కూడా లేవనే పరిస్థితిని ఏమని చెప్పుకోవాలి.

అంతులేని ఆవేదనతోనే..
తెలంగాణలో తండ్రి పేరిట షర్మిళ పార్టీ పెట్టుకున్నారు. దాని వెనుక అన్న ప్రోత్సాహం ఉందనుకున్నారు. కానీ అదంతా ఊహాగానమే అని తేలిపోయింది. అయితే ఇప్పుడు చిన్నాన్న వివేకా హత్య కేసుపై అన్నపై బాణం వదిలేసరికి అసలు విషయం బయటపడింది. తప్పొప్పులు పక్కనపెడితే అంతటి బాణాలను విడిచిపెట్టడానికి బలమైన కారణాలున్నట్టు విశ్లేషణలు వస్తున్నాయి. అయినదానికి.. కానిదానికి తోబుట్టువుపై తెలంగాణ సర్కారు కర్కశంగా వ్యవహరిస్తున్నా స్పందించడం లేదు. తల్లిని నడిరోడ్డుపై ఇబ్బందులకు గురిచేసినా వాకబు చేయడం లేదు. అటు వైఎస్సార్ నామస్మరణ చేసే నేతలు సైతం అటువైపుగా చూడడం లేదు. అందుకే ఇప్పుడు జగనన్న వదిలిన బాణం తిరిగి రివర్స్ అవుతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.