
గబ్బర్ సింగ్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది.. ‘‘రాజకీయాల్లో మన పార్టీ వాడా.. కాదా..? అని ఉండదు. మనవాడా.. కాదా? అనేది మాత్రమే ఉంటుంది.’’ అని అంటాడు మంత్రి పాత్రలో ఉన్న రావురమేష్. సరిగ్గా ఇదే డైలాగ్.. వైసీపీ ఎంపీ-మంత్రికి అప్లై చేయొచ్చు. ఒంగోలు కేంద్రంగా సాగుతున్న ఈ పొలిటికల్ వార్.. అధికార పార్టీ కేడర్ ను అయోమయానికి గురిచేస్తుంటే.. అధిష్టానానికి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది.
ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఇదే ఒంగోలు నుంచి గెలిచిన ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి మధ్య పొలిటికల్ వార్ గురించి అందరికీ తెలిసిందే. ఎంపీ మాగుంటను వైసీపీలో ఎదగకుండా బాలినేని చక్రం తిప్పుతున్నారనే చర్చ చాలా కాలంగా ఉంది. మంత్రిగా బాలినేని అన్నీతానై వ్యవహరిస్తూ.. మాగుంటకు స్కోప్ ఇవ్వట్లేదనే వాదన ఉంది.
అయితే.. ఈ వైరం ఇప్పటి నుంచి కాదు.. మాగుంట టీడీపీలో ఉన్నప్పటి నుంచే కొనసాగుతోంది. అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన.. బాలినేని వర్గాన్ని అణగదొక్కారనే పేరుంది. దీన్ని మనసులో పెట్టుకున్న బాలినేని.. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో ఉంది. అంతకు ముందు కాంగ్రెస్ లో కూడా వీరు ఎంపీ, మంత్రులుగా ఉన్నారు. అప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఈ పాత గొడవల నేపథ్యంలో.. ఇప్పుడు బాలినేని అవకాశం ఇవ్వట్లేదని అంటున్నారు.
మాగుంట వర్గానికి చిన్న చిన్న పదువులు కూడా రానివ్వకుండా మంత్రి బాలినేని అడ్డుకుంటున్నారనే వాదన ఉంది. ప్రకాశం జిల్లాలో సుదీర్ఘ కాలం ఎంపీగా ఉన్న మాగుంటకు.. బలమైన అనుచరగణమే ఉంది. ఇప్పుడు ఆయన అధికార పార్టీ ఎంపీ అయినప్పటికీ.. వారికి ఏమీ చేయలేకపోతున్నాననే ఆవేదనలో ఉన్నారు. ఈ పరిస్థితి ముదరడంతో.. ఈ మధ్య అధిష్టానానికి కూడా ఫిర్యాదులు చేసుకున్నారు.
బాలినేనికన్నా తాను సీనియర్ నేతను అయిఉండికూడా.. ఏమీ చేయలేకపోతున్నాని ఆగ్రహంగా ఉన్నారు మాగుంట. బాలినేని మాత్రం ఎక్కడ తిప్పాలో అక్కడ తిప్పుతూ సైలెంట్ గా చెక్ పెడుతూ పోతున్నారు. ఈ గొడవలకు పుల్ స్టాప్ పెట్టాలని అధిష్టానం ఆదేశించినా.. వీరు మాత్రం థావిధిగానే ఆధిపత్య పోరాటం సాగిస్తున్నట్టు సమాచారం. దీంతో.. పార్టీ పరువు పలుచనవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, ఈ పరిస్థితి వచ్చే ఎన్నికలనాటికి ఎలాంటి రూపం తీసుకుంటుందో చూడాలి.