Homeఆంధ్రప్రదేశ్‌Botsa Family Politics: బొత్స కుటుంబంలో చిచ్చు... సామంత రాజ్యానికి బీటలు..

Botsa Family Politics: బొత్స కుటుంబంలో చిచ్చు… సామంత రాజ్యానికి బీటలు..

Botsa Family Politics: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సామంత రాజ్యానికి బీటలు వారుతున్నాయా? జిల్లాను పంచుకొని రాజకీయం చేస్తున్న బొత్స కుటుంబంలో చిచ్చు రేగిందా? కుటుంబసభ్యుల పదవి కాంక్ష…. కాక రేపడానికి కారణమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా విజయనగరం జిల్లా వైసీపీ విస్తృత సమావేశంలో మంత్రి బొత్స వ్యాఖ్యలు ఈ అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి. ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరుబాగాలేదని బొత్స హెచ్చరికలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో వైరల్ అవుతున్నాయి. సొంత కుటుంబంలో వ్యక్తులను ఉద్దేశించే వ్యాఖ్యలు చేశారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సమావేశానికి ఉత్తరాంధ్ర ఇన్ చార్జి వైవీ సుబ్బారెడ్డితో పాటు మంత్రి బొత్స కూడా హాజరయ్యారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు అంతా సిద్ధమైందని ప్రకటించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖ రాజధానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. త్వరలో విశాఖ నుంచి పాలనను ప్రారంభించనున్నట్టు చెప్పుకొచ్చారు.

Botsa Family Politics
botsa satyanarayana

విజయనగరం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని.. నాయకులు, కార్యకర్తల ఫోన్లకు కూడా రెస్పాండ్ కావడం లేదని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎవరా? ఇద్దరు ఎమ్మెల్యేలు అంటూ చర్చ ప్రారంభమైంది. వాస్తవానికి విజయనగరం బొత్స కుటుంబానికి సామంత రాజ్యం. అక్కడ రాజ్యాలేలిన రాజవంశీయులున్నారు. కానీ రాజకీయంగా ఎక్కువగా ఏలింది మాత్రం బొత్స కుటుంబమే. జిల్లాలో సగానికి పైగా నియోజకవర్గాలు బొత్స కుటుంబం చేతిలోనే ఉన్నాయి. తాను చీపురుపల్లి ఎమ్మెల్యే…ఆపై మంత్రి, సోదరుడు అప్పలనర్సయ్య గజపతినగరం ఎమ్మెల్యే, తన సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యే, మొన్నటి వరకూ నీడ నేతగా ఉన్న మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు జిల్లా పరిషత్ చైర్మన్. ఇక మిగిలింది ముగ్గురు మాత్రమే. ఒకరు బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకటచిన అప్పలనాయుడు, ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, విజయనగరం ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. అయితే బొత్స చెప్పిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరబ్బా అన్న చర్చ ఒకటి మొదలైంది.

గతంలో మాదిరిగా బొత్స కుటుంబంలో ఐక్యత లేదు. లుకలుకలు మొదలైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు బొత్స కుటుంబంలో కాక రేపుతున్నాయి. ఇక్కడ మేనకోడలు భర్త అప్పలనాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బొత్స తన రాజకీయ గురువు పెనుమత్స సాంబశివరాజుకు డామినేట్ చేసిన సంగతి తెలిసిందే. పూర్వపు సతివాడ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు సాంబశివరాజు గెలుపొందుతూ వచ్చారు. ఎంపీగా పోటీచేయాలన్నది సాంబశివరాజు కోరిక. కానీ బొత్స తన భార్య ఝాన్సీలక్ష్మిని పట్టుబట్టి మరీ ఎంపీ టిక్కెట్ ను ఇప్పించుకున్నారు. దీంతో కీనుక వహించిన సాంబశివరాజు 2009లో ఎమ్మెల్యేగా పోటీచేయలేదు. అప్పుడే బొత్స పావులు కదిపారు. అప్పటివరకూ జడ్పీ చైర్మన్ గా ఉన్న తన మేనకోడలి భర్త బడ్డుకొండ అప్పలనాయుడును నెల్లిమర్ల నుంచి పోటీచేయించారు. ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. తన కుటుంబ ప్రాతినిధ్యం పెంచుకున్నారు.

Botsa Family Politics
botsa satyanarayana

అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కుటుంబసభ్యుల మనస్థత్వాలు కూడా ఒకేలా ఉండవు. బొత్స మరో సోదరుడు లక్ష్మణరావు కూడా రాజకీయంగా ఎదగాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నెల్లిమర్లపై దృష్టిపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత అజెండాతో పనిచేశారు. పార్టీ రెబల్ క్యాండిడేట్లను పోటీలో పెట్టించారు.ఆర్థిక సాయం చేశారు. దీనిపై ఎమ్మెల్యే బడ్డుకొండ పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదుచేశారు. స్వయంగా అప్పటి ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ చార్జి విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. బొత్స అండదండలతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని.. అవసరమైతే సీఎం జగన్ కు ఫిర్యాదు చేస్తానని కూడా చెప్పుకొచ్చారు. అటు తరువాత వివాదానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడింది. ఇప్పుడు బొత్స తాజా వ్యాఖ్యలతో మళ్లీ వివాదం తెరపైకి వచ్చింది. అవి ముమ్మాటికీ బడ్డుకొండ అప్పలనాయుడును ఉద్దేశించినవేనని .. ఆయనకు పొమ్మన లేక పొగ పెడుతున్నారని అనుచరులు చెబుతున్నారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ కోలగట్లతో బొత్సకు రాజకీయ విభేదాలున్నాయి. అక్కడ వచ్చే ఎన్నికల్లో బీసీలకు టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంది. దాని వెనుక బొత్స ఉన్నట్టు కోలగట్ల అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఆ రెండో ఎమ్మెల్యే కోలగట్లేనన్న అనుమానాలు బలపడుతున్నాయి. మొత్తానికైతే బొత్స సామంత రాజ్యంలో ఆధిపత్యానికి గండి పడే సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular