ఏపీలో పంచాయతీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. పంచాయతీ ఎన్నికలు ముగియగానే మున్సిపాలిటీ, జడీపటీసీలు, ఎంపీటీసీల ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇలా వరుసగా ఇప్పుడు ఏపీలో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. వచ్చే నెల చివరి వరకు స్థానిక సంస్థల ఎన్నికల తంతు ముగిసేందుకు రంగం సిద్ధం కాగా.. ఏడాది కాలంగా ఈ ఎన్నికలపై సాగిన రగడకు తెర పడుతున్నప్పటికీ రాజకీయం మాత్రం చల్లారడం లేదు. చెప్పాలంటే పంచాయతీ ఎన్నికలకు పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు. అవి పార్టీ రహిత ఎన్నికలు. కానీ.. పార్టీల మద్దతుదారులు, కార్యకర్తలు, నేతలు బరిలో నిలుస్తుంటారు.
Also Read: చంద్రబాబుకు ఇంతకంటే అవమానం ఉండదేమో?
ముఖ్యంగా ఈ విషయంలో స్థానిక సంస్థలపై ముఖ్యమంత్రి జగన్ ఎక్కడా ప్రస్తావించడం లేదు. కానీ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం అన్నీ తానే అన్నట్లుగా తాడోపేడో తేల్చుకోవాలన్నంత కసి కనబరుస్తున్నారు. ఇదిలా ఉండగా.. అందరూ ఊహించినట్లుగానే స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి సానుకూలంగానే ఫలితాలు వస్తున్నాయి. గ్రామాల్లో ఎంతో కొంత అభివృద్ధి సాగాలన్నా, ప్రెసిడెంటు మాట అధికారులు వినాలన్నా అధికారపక్షంలో ఉండటమే మేలన్న ఒక అనధికార ఒడంబడిక చాలా గ్రామాల్లో కనిపిస్తోంది.
మరోవైపు.. తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా మేనిఫెస్టో విడుదల చేసి అభాసు పాలైంది. భారీ ప్రచారాన్ని మాత్రం పొందగలిగింది. పంచాయతీల్లో తన పట్టు నిరూపించుకునేందుకు అధికార వైసీపీ మద్దతుదారులు ఎంతవరకైనా తెగిస్తారనే ప్రచారం ముందుగా సాగింది. కానీ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ గట్టి నియంత్రణ చర్యలను చేపట్టింది. ఫలితంగా చాలా చోట్ల ప్రత్యర్థులుగా ప్రధాన పార్టీల మద్దతు దారులు పోటీ పడే వాతావరణం నెలకొంది. ఏకగ్రీవాలు 16 నుంచి 17 శాతానికే పరిమితమయ్యాయి. ఏకపక్షంగా తొంభై శాతం సీట్లు వస్తాయనుకున్న వైసీపీ ఆ స్థాయి విజయాలను నమోదు చేయలేకపోయింది. టీడీపీ సగటున సీట్లు, ఓట్ల పరంగా 24 శాతం సాధించినట్లు తటస్థ పరిశీలకుల అంచనా. మరో 3 శాతం మేరకు బీజేపీ, జనసేన కూటమి ఖాతాలో పడినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద చూస్తే వైసీపీ పద్దులో 73 శాతం పంచాయతీలు కైవసం అయ్యాయి.
Also Read: జగన్ కరుణించే ఆ ఆరుగురు అదృష్టవంతులు ఎవరో..?
కానీ.. ఇందులో 16 శాతం ఏకగ్రీవాలను పక్కనపెట్టాలి. అక్కడ ఉన్న పరిస్థితులు, ఒత్తిడులు కారణంగా అధికారపార్టీకి అనుకూలంగా అవాంఛనీయమైన ధోరణితోనే ఏకగ్రీవాలు సాగాయి. వైసీపీ ప్రాబల్యాన్ని రాజకీయంగా అంచనా వేసే క్రమంలో బేరీజు వేస్తే ఏకగ్రీవాలను మినహాయించాలి. నికరంగా 57 శాతం పంచాయతీల్లో ఎటువంటి పోటీ లేకుండానే వైసీపీ ప్రజాస్వామ్య బద్ధంగా విజేతగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగిన పంచాయతీ ఫలితాలతో పోలిస్తే తన బలాన్ని నాలుగు రెట్టు చేసుకోగలిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల కంటే గ్రామప్రాంతాల్లో పట్టు పెరిగినట్లు ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అయినప్పటికీ అధికార పార్టీలో ఆత్మవిశ్వాస స్థాయి తగ్గింది. అసలు పోటీయే ఉండదనుకున్న వేల గ్రామాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో నిలవడం, గట్టి పోటీ ఇవ్వడాన్ని అధికార పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. మరోవైపు.. తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఎన్నికల్లో గట్టి పోటీని ఇచ్చినట్లుగా చెప్పాలి. 40 శాతం సీట్లలో టీడీపీ బలమైన పోటీనిచ్చి, 22 శాతం వరకూ దక్కించుకోగలిగింది. ఓట్ల పరంగా చూస్తే మొత్తమ్మీద 24 శాతం పైగానే రాబట్టగలిగింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్