దేశంలో బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ముందు వరసలో ఉంటుంది. అక్కడ ఎదిగేందుకు దశాబ్దాలుగా ప్రయత్నిస్తోంది. అప్పట్లో కమ్యూనిస్టులు, ఇప్పుడు మమతా బెనర్జీ.. వారికి ఎదురు నిలిచారు. అయితే.. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు సర్వ శక్తులూ ఒడ్డినప్పటికీ.. ఉపయోగం లేకుండాపోయింది. ఒంటరిగా పోరాడిన మమతా బెనర్జీ.. ఒంటి చేత్తో ఘన విజయం సాధించారు. అయితే.. ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితులు మారిపోవడం మొదలు పెట్టాయి. ఎన్నికల ముందు బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కాస్తా.. ఇప్పుడు వికర్ష్ గా మారిపోయింది. దీంతో.. కమలం పార్టీలో కలవరం మొదలైంది. ఇది ఎక్కడిదాకా వెళ్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో ఎప్పటి నుంచో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ.. తృణమూల్, కమ్యూనిస్టు పార్టీల నుంచి భారీగా వలసలను ప్రోత్సహించింది. అది ఎంతగా అంటే.. రాష్ట్రంలో మొత్తం 293 స్థానాల్లో బీజేపీ బరిలో నిలిస్తే.. అందులో ఏకంగా.. 148 స్థానాల్లో తృణమూల్, కమ్యూనిస్టు పార్టీల నుంచి వచ్చిన వారినే నిలబెట్టిందంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సొంత నేతలకు సత్తా లేదనే కారణంతోనే.. ఇతర పార్టీల నేతలను పిలిచి, వారికి టిక్కెట్లు ఇచ్చిందనే విమర్శలు వచ్చాయి. అయినా.. వీరిలో కేవలం ఆరుగురు మాత్రం గెలుపోవడం గమనించాల్సిన అంశం.
ఎన్నికలు జరగడం.. తృణమూల్ ఘన విజయం సాధించడం.. మమతా సీఎం సీటుపై కూర్చోవడం జరిగిపోయాయి. దీంతో.. ఎన్నికల ముందు తన పార్టీ నుంచి నేతలను చేర్చుకొని బీజేపీ ఎలా దెబ్బ తీసిందే.. ఇప్పుడు అదే ప్లాన్ రివర్స్ లో అప్లై చేస్తున్నారు మమతా బెనర్జీ. ఇందులో భాగంగానే.. కీలక నేత ముకుల్ రాయ్ తిరిగి తృణమూల్ గూటికి చేరుకున్నారు. ఈయన 2017లో మమత పార్టీని వీడి కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ నాలుగేళ్లలో బీజేపీ చాలా బలపడింది. దీనికి కారణం ముకుల్ రాయ్ అన్నది అందరూ చెబుతున్న మాట. ముకుల్ వ్యక్తిగతంగా చాలా బలమైన నేత. ఆయన బీజేపీలోకి వెళ్లిన తర్వాతే.. ఆయన పిలుపు అందుకొని చాలా మంది నేతలు, కార్యకర్తలు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
అయితే.. ఎన్నికల ముందు తృణమూల్ నుంచి సువేందు అధికారి బీజేపీలో చేరారు. మమత తర్వాత నెంబర్ 2గా ఉన్న సువేందు.. కమలం గూటికి చేరడంతో బీజేపీలో లెక్కలు మారాయి. అప్పటి వరకూ ముకుల్ రాయ్ ప్రధాన నేతగా భావించారు అందరూ. ముకుల్ కూడా అదే అనుకున్నారు. కానీ.. సువేందు రాకతో ఆయనే సర్వం అయిపోయారు. ముకుల్ రాయ్ ప్రభావం పడిపోతూ వచ్చింది. ఆయన 2019లో బీజేపీ కేంద్రంలో గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి పదవి ఆశించినా.. అది కూడా దక్కలేదు. ఇప్పుడు సువేందు వచ్చి.. రాష్ట్రంలో కూడా రెండో స్థానానికి నెట్టేశారు. దీంతో.. ఇక, బీజేపీలో తనకు భవిష్యత్ లేదని గుర్తించిన ముకుల్ రాయ్.. మళ్లీ తృణమూల్ గూటికి చేరారు.
దీంతో.. బీజేపీలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. కీలక నేత వీడిపోవడంతో కమల దళంలో కలవరం మొదలైంది. ఆయన మాత్రమే కాదు.. ఇంకా చాలా మందిని బీజేపీ నుంచి తీసుకుపోనున్నారన్నది టాక్. ఇప్పటికే.. బగ్దా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే.. మమతా బెనర్జీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఇదే బాటలో ఉన్నారని సమాచారం. ఇక, ఇతర నేతలు, కార్యకర్తలు కూడా తృణమూల్ గూటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట. ఇదే జరిగితే.. కమలం రేకులు ఇప్పుడే రాలిపోయే పరిస్థితి వస్తుందని అంటున్నారు విశ్లేషకులు. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Political migration starts from bjp to tmc in west bengal
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com